హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ) : టీచర్ పోస్టుల భర్తీ ఊసేలేదు. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకాదు. కానీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్)లను మాత్రం ప్రభుత్వం టంచన్‌గా నిర్వహిస్తున్నది. టెట్ పేరిట నిరుద్యోగులను ఆశలపలకిలోకి నెడుతున్నది. ఇదిగో.. అదిగో అంటూ రెండేండ్లుగా సాగదీస్తున్నది. డీఎస్సీ లేకుండానే తాజా పాఠశాల విద్యాశాఖ టెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 30 వరకు దరఖాస్తు చేసే అవకాశం ఇచ్చింది. జూన్ 15 నుంచి 30 వరకు పరీక్షలు జరుగనున్నాయి. రెండేండ్ల నుంచి ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకాలేదు.
2024 ఫిబ్రవరిలో జారీ అయిన నోటిఫికేషనే ఆఖరు. ఏటా రెండు టెట్ పరీక్షలను ప్రభుత్వం నిర్వహిస్తున్నది. ఇప్పటి వరకు నాలుగు టెట్ పరీక్షలు నిర్వహించింది. కానీ టీచర్ పోస్టుల భర్తీని మాత్రం అటకెక్కించింది. దీంతో డీఎస్సీ ఇంకెప్పుడని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. టీచర్ పోస్టులను భర్తీచేయకుండా, టెట్ నోటిఫికేషన్ విడుదల చేసి ఏం లాభమని నిలదీస్తున్నారు. టెట్ పేరుతో వేలకు వేలు ఫీజులు వసూలు చేసుకొని సర్కార్ ఖజానా నింపుకొంటున్నదని మండిపడుతున్నారు.
అధికారంలోకి రాగానే 25వేల టీచర్ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీచేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అధికారం చేపట్టాక కేవలం ఐదువేల పోస్టులు మాత్రమే నోటిపై చేసింది. 2023లోనే బీఆర్ఎస్ సర్కార్ 5,089 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేయగా, ఈ నోటిఫికేషన్‌ను రద్దుచేసి, అదనంగా 5,973 పోస్టులు కలిపి మొత్తం 11,062 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది. వీటిలో 10,006 పోస్టులు మాత్రమే భర్తీ అయ్యాయి. మరో 1,056 పోస్టుల భర్తీ ఇంకా పెండింగ్‌లోనే ఉంది. జాబ్ క్యాలెండర్ ప్రకారం 2025 ఫిబ్రవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ జారీచేస్తామన్నారు. 6 వేల పోస్టులంటూ లీకులిచ్చారు. ఇటీవల టీచర్లు ఉద్యోగ విరమణ పొందుతున్నారు. ఖాళీ పోస్టుల సంఖ్య పెరుగుతున్నది. తాజా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 20వేలకు పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కానీ సర్కార్ వీటిని భర్తీచేయడంలేదు. సర్కార్ తీరుపై నిరుద్యోగులు, నిరుద్యోగ జేఏసీ నేతలు మండిపడుతున్నారు.
కొత్తగా పూర్వప్రాథమిక పాఠశాలలను సర్కార్ ప్రారంభిస్తున్నది. ఈ ఏడాది 2,700 పాఠశాలలను కొత్తగా ఏర్పాటు చేయనున్నది. గ్రేటర్ సహా పలు ప్రాంతాల్లో కొత్త స్కూళ్లను సైతం ప్రారంభిస్తున్నారు. రిటైర్మెంట్లు పెరుగుతున్నా.. కొత్త స్కూళ్లు తెరుస్తున్నా సర్కార్ బడుల్లో టీచర్ పోస్టులను మాత్రం భర్తీచేయడంలేదు. దీంతో నిరుద్యోగులకు ఎదురుచూపులు తప్పడంలేదు. రాష్ట్రంలో 1.10లక్షల డీఎడ్, 2.40లక్షల మంది బీఎడ్ అభ్యర్థులున్నారు. 3.5 లక్షల మంది అభ్యర్థుల్లో ఇప్పటికే మూడు లక్షల మంది టెట్ పాసయ్యారు. డీఎస్సీ నోటిఫికేషన్ల కోసం శిక్షణ పొందుతున్నారు. కానీ సర్కార్ మాత్రం టెట్ నోటిఫికేషన్‌తోనే సరిపెడుతున్నది. అభ్యర్థులంతా పదే పదే టెట్ రాస్తూ కాలం వెళ్లబుచ్చుతున్నారు.
మరో ఆరు నెలల్లో డీఎస్సీ నోటిఫికేషన్ జారీచేస్తామని 2024 డీఎస్సీ ఫలితాలప్పుడు ప్రకటించారు. రెండేండ్లు గడిచినా ఇంత వరకు ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకాలేదు. ఒకదాని తర్వాత ఒకటి చొప్పున టెట్ నోటిఫికేషన్లు జారీచేస్తున్నది. నిరుద్యోగులను మోసం చేస్తున్నది. డీఎస్సీ లేకుండా టెట్ నోటిఫికేషన్లు జారీచేస్తూ వంచిస్తున్నారు. ప్రతి సారి టెట్కోసం దరఖాస్తు చేసి రూ. వెయ్యి నష్టపోతున్నాం.
– దుర్గం హరీశ్, మంచిర్యాల
మా జిల్లాలో 2024 డీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ క్యాటగిరీలో ఒక్కటంటే ఒక్క పోస్టు కూడా లేదు. 72 మార్కులొచ్చినా ఉద్యోగం రాలేదు. రెండేండ్లుగా డీఎస్సీ కోసం వేచిచూస్తున్నాం. ఇప్పటి వరకు పది సార్లు టెట్ రాశాను. పరీక్షలు రాసి రాసి విసుగొచ్చింది. ప్రభుత్వం టెట్ల మీద టెట్ పరీక్షలు నిర్వహిస్తున్నది. ఇంకా ఎన్నిసార్లు రాయాలి.
– కవితారాణి, పెద్దపలి