రామకృష్ణాపూర్, ఏప్రిల్ 26 : మంత్రి వివేక్ కేసీఆర్, బీఆర్ఎస్ను విమర్శించడం మానుకొని, చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ డిమాండ్ చేశారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ ఎన్నిక సందర్భంగా కేసు నమోదు కాగా, ఆయన ఆదివారం రామకృష్ణాపూర్ పోలీస్‌స్టేషన్‌లో సంతకం చేశారు. ఆపై ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రి వివేక్ అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారని, న్యాయస్థానం కండిషన్ బెయిల్ మంజూరు చేసిందని, దానిని అనుసరించి ప్రతీ ఆదివారం రామకృష్ణాపూర్ పోలీస్‌స్టేషన్‌లో సంతకం చేస్తున్నామని, ఇప్పటికీ 8వ ఆదివారం సంతకం చేశామన్నారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలో ఇప్పటికే పాలక వర్గం కొలువుదీరిందన్నారు.
క్యాతనపల్లిలో త్వరలో మొదటి కౌన్సిల్ సమావేశం జరుగబోతుందని, క్యాతనపల్లి మున్సిపాలిటీకి సంబంధించి 3,4 ముఖ్యమైన విషయాలను కౌన్సిల్లో తీర్మానాలు చేసి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్‌ను కోరినట్లు ఆయన తెలిపారు. ఈ ప్రాంతంలో సింగరేణి కార్మికులు ఎక్కువ సంఖ్యలో ఉంటారని, మెడికల్ బోర్డు పెట్టకుండా, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన వారసత్వ ఉద్యోగాల పరంపరగా కారుణ్యనియమాకాలు కొనసాగించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తుందన్నారు.
మెడికల్ బోర్డు పెట్టి, కార్మికుల అన్‌ఫిట్ చేసి వారి పిల్లలకు కారుణ్యనియమాకాల ద్వారా ఉద్యోగాలు కల్పించాలని కోరుతూ కౌన్సిల్ తీర్మానం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్‌ను కోరినట్లు చెప్పారు. జీవో-76 కింద రామకృష్ణాపూర్‌లోని సింగరేణి ఖాళీ స్థలాల్లో ఇండ్లు కట్టుకున్న 3363 మందికి బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టాలు ఇచ్చిందని గుర్తు చేశారు. ఇంకా అనేక మంది ఇండ్ల పట్టాల కోసం డీడీలు కట్టి ఉన్నారని, వారికి జీవో 76 కింద ఇండ్ల పట్టాలు ఇవ్వాలని కోరుతూ కౌన్సిల్ తీర్మానం చేసి ప్రభుత్వాని పంపాలని, అదేవిధంగా ఇండ్ల పట్టాలు ఇప్పించేందుకు మంత్రి వివేక్ చొరవ చూపాలని కోరాలని వారికి సూచించారు.
మంత్రి వివేక్ క్యాతనపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి చొరవచూపాలని, ఒక్కో వార్డుకు రూ. 10 కోట్లు తీసుకు వచ్చేలా కృషి చేయాలన్నారు. తమపై ఇంకా 2,3 కేసులు పెడుతామని పోలీసులు చెప్పినట్లుగా తెలిసిందన్నారు. ఇప్పటికే మున్సిపాలిటీలో పాలకమండలి కొలువుదీరిందని, ఇక నుంచి ప్రశాంత వాతావరణంలో పనిచేసుకొనే హెచ్చరించారు. మంత్రి వివేక్ ఇతర జిల్లాల్లో తిరుగుపరిస్థితులు ఉండాలన్నారు. మళ్లీ కేసుల పేరిట వేధింపులకు పాల్పడడం మానుకోవాలని హితవు పలికారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను బెదిరింపులకు గురిచేసినా, కాళేశ్వరం ప్రాజెక్టుపై అవాకులు పేలినా ప్రజలు తిరగబడుతారని తూ కేసీఆర్‌ను, బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తే అక్కడి ప్రజలు తిరగబడుతున్నారని, ఇక్కడ కూడా ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని తెలిపారు.
‘కార్మికులకు ఇండ్లు కట్టుకోవడానికి వడ్డీలేని రుణం రూ. 20 లక్షలు ఇస్తామన్నారని, నిరుద్యోగులకు 45 వేల ఉద్యోగాలు ఇసామన్నారని, నియోజకవర్గంలో పెద్ద ఫ్యా క్టరీ పెడుతామన్నారని, కాళేశ్వరం ముంపు గ్రామాల్లో కరకట్టలు పెడుతామన్నారని, ముంపు గ్రామాల భూములను కొనిపిస్తామన్నారని, ఈ హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రామకృష్ణాపూర్, మందమర్రి మున్సిపాలిటీ ప్రజల కోసం 100 పడకల దవాఖాన కడుతామని చెప్పారని, ఆ హామీపై శ్రద్ధ పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గొడిశెల సంధ్యారాణి, కౌన్సిలర్లు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు కంభగోని సుదర్శన్ గౌడ్, జాడి శ్రీనివాస్, మేడిపల్లి సంపత్, కొంగల తిరుపతిరెడ్డి, బండారి సూరిబాబు, రిక్కల మధుకర్,మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.