Sunflower Seeds | సాయంత్రం సమయంలో చాలా మంది చిరుతిళ్లను తినేందుకు ఆసక్తిని చూపిస్తుంటారు. బయట రహదారుల పక్కన బండ్లపై లేదా ఫుడ్ కోర్టులు వంటి వాటిల్లో సమోసాలు, బజ్జీలు, పునుగులతోపాటు బేకరీలలో వివిధ రకాల ఆహారాలను సాయంత్రం సమయంలో స్నాక్స్ లా తింటుంటారు. అయితే ఇవి మన ఆరోగ్యానికి ఎంతో హాని చేస్తాయి. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి. డయాబెటిస్, గుండె జబ్బులు వచ్చేలా చేస్తాయి. కనుక ఈ ఆహారాలను తినకూడదు. సాయంత్రం సమయంలో ఆకలి అయితే ఆరోగ్యవంతమైన స్నాక్స్‌ను తినాల్సి ఉంటుంది. ఇవి ఆకలిని తీర్చడమే కాదు, మనకు పోషకాలను, ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఇక అలాంటి ఆరోగ్యవంతమైన స్నాక్స్‌లో పొద్దు తిరుగుడు విత్తనాలు కూడా ఒకటి. చాలా మంది వీటిని తినేందుకు అంతగా ఇష్టపడరు. కానీ ఇవి మనకు అనేక లాభాలను అందిస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
పొద్దు తిరుగుడు విత్తనాల్లో మోనో అన్‌శాచురేటెడ్, పాలీ అన్‌శాచురేటెడ్ కొవ్వులతోపాటు ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన కొవ్వుల జాబితాకు చెందుతాయి. అందువల్ల ఈ విత్తనాలను తింటే మెదడు పనితీరు మెరుగు పడుతుంది. కణాల నిర్మాణం సరిగ్గా జరుగుతుంది. అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు. ఈ కొవ్వులతోపాటు ఈ విత్తనాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండెకు ఎంతో మేలు చేస్తాయి. ఇవి మన శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి. బీపీ తగ్గేలా చేస్తాయి. ఈ విత్తనాల్లో ఉండే మెగ్నిషియం గుండె వేగంగా కొట్టుకోవడాన్ని తగ్గిస్తుంది. దీంతో హైబీపీ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. ఈ విత్తనాల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ, ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి శరీర కణాలకు జరిగే నష్టాన్ని నివారిస్తాయి. ఫ్రీ ర్యాడికల్స్ ప్రభావాన్ని తగ్గిస్తాయి. దీని వల్ల శరీరంలో అంతర్గతంగా ఉండే వాపులు తగ్గుతాయి. దీంతో క్యాన్సర్, గుండె పోటు వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు.
పొద్దు తిరుగుడు విత్తనాలను తినడం వల్ల షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. ఈ విత్తనాల్లో ఉండే ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వుల కారణంగా మనం తినే ఆహారాల్లో ఉండే పిండి పదార్థాలు రక్తంలో గ్లూకోజ్‌గా నెమ్మదిగా మారుతాయి. దీని వల్ల షుగర్ లెవల్స్ అమాంతం పెరగకుండా ఉంటాయి. డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. ఈ విత్తనాల్లో జింక్, సెలీనియం, విటమిన్ ఇ అధికంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి. దీని వల్ల శరీరం ఇన్ఫెక్షన్లు, వ్యాధులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. రోగాలు రాకుండా ఉంటాయి. ఈ విత్తనాల్లో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. మలబద్దకం తగ్గేలా చేస్తుంది. ఈ విత్తనాల్లో వృక్ష సంబంధ ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. కనుక నాన్ వెజ్ తినని వారికి ఈ విత్తనాలను చక్కని ఆహారంగా చెప్పవచ్చు. ఈ విత్తనాలను తింటే ప్రోటీన్లు లభించి శరీరానికి శక్తి అందుతుంది. ఉత్సాహంగా ఉంటారు. యాక్టివ్‌గా పనిచేస్తారు. బద్దకం పోతుంది. నీరసం, అలసట తగ్గిపోతాయి.
గుప్పెడు పొద్దు తిరుగుడు విత్తనాలను తింటే సుమారుగా 165 క్యాలరీల శక్తి లభిస్తుంది. ప్రోటీన్లు 5.5 గ్రాములు, కొవ్వులు 14.4 గ్రాములు, పిండి పదార్థాలు 6.5 గ్రాములు, ఫైబర్ 3 గ్రాములు ఉంటాయి. అలాగే విటమిన్ ఇ, మెగ్నిషియం, సెలీనియం, జింక్, కాపర్ కూడా ఈ విత్తనాల్లో అధిక మొత్తాల్లో ఉంటాయి. పొద్దు తిరుగుడు విత్తనాలను గుప్పెడు మోతాదులో తినవచ్చు. అధికంగా తింటే వికారం, వాంతికి వచ్చినట్లు అనిపించడం, పొట్టలో అసౌకర్యంగా ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ విత్తనాలను నేరుగా తింటే వికారంగా అనిపిస్తుంది. కనుక పెనంపై కాస్త వేయించి తింటే మంచిది. పొద్దు తిరుగుడు విత్తనాలను సాయంత్రం సమయంలో స్నాక్స్‌లా తినవచ్చు. లేదా రాత్రి నిద్రకు ముందు తినవచ్చు. ఉదయం వ్యాయామం చేసిన తరువాత కూడా తినవచ్చు. ఇలా ఈ విత్తనాలను రోజూ తింటుంటే అనేక లాభాలను పొందవచ్చు.