Coffee | పనిపై దృష్టి కేంద్రీకరించక లేకపోతున్నప్పుడు, పని చేసే సమయంలో నిద్ర మత్తుగా ఉన్నప్పుడు, శరీరానికి శక్తిని, ఉత్తేజాన్ని అందించాల్సి వచ్చినప్పుడు చాలా మందికి ముందుగా గుర్తుకు వచ్చేది కాఫీ. అలాగే చాలా మందికి ఉదయం పూట కాఫీ తాగే అలవాటు కూడా ఉంటుంది. కాఫీ తాగనిదే వారికి రోజూ గడిచిన భావన కూడా రాదు. రోజును ప్రారంభించడానికి, మధ్యాహ్నం వచ్చే అలసటను తగ్గించడానికి చాలా మంది కాఫీని తాగుతూ ఉంటారు. కాఫీలో ఉండే కెఫీన్ సహజ ఉద్దీపనగా పని చేస్తుంది. ఏకాగ్రతను, శక్తి స్థాయిలను పెంచడంలో ఇది సహాయపడుతుంది. కాఫీ తాగిన 10 నుండి 15 నిమిషాల్లోనే శరీరంపై దాని ప్రభావం ప్రారంభమవుతుంది. కాఫీని మితంగా తీసుకోవాలని అందరికీ తెలుసు. కాఫీని మితంగా తీసుకోవడం ఎంత అవసరమో దానిని తీసుకునే సరైన సమయం కూడా అంతే ముఖ్యం.
ఉదయం లేచిన వెంటనే కాఫీని తాగకూడదు. ఎందుకంటే ఉదయం సమయంలో శరీరంలో కార్టిసాల్ ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో కాఫీ తాగడం వల్ల గాబరా, అతి ఉద్దీపన, కెఫిన్ ఎక్కువగా, త్వరగా అలవాటు పడడం వంటి సమస్యలు తలెత్తుతాయి. కనుక నిద్ర లేచిన ఒక గంట తరువాత మొదటి కాఫీని తీసుకోవడం మంచిది. ఆ సమయంలో కార్టిసాల్ స్థాయిలు తక్కువగా ఉంటాయి. కాఫీ ప్రభావం మెరుగ్గా ఉంటుంది. అలాగే మధ్యాహ్నం 1:00 నుంచి 3:00 గంటల మధ్య సమయంలో కూడా చాలా మంది కాఫీ తాగుతూ ఉంటారు. ఆ సమయంలో కాఫీ తాగితే అలసట తగ్గి ఉత్పాదకత పెరుగుతుంది. అయితే మధ్యాహ్నం తాగే కాఫీ రాత్రి నిద్రకు ఆటంకం కలగకుండా చూసుకోవాలి. ఇక వ్యాయామానికి ముందు కాఫీ తాగవచ్చు. ఇది ప్రీ వర్కౌట్ డ్రింక్ గా పని చేస్తుంది. వ్యాయామానికి 30 నుండి 60 నిమిషాల ముందు కాఫీ తీసుకోవడం వల్ల రక్తంలో కెఫిన్ స్థాయిలు గరిష్ట స్థాయికి చేరుకుని శారీరక పనితీరు మెరుగుపడుతుంది. ఇక సాయంత్రం లేదా రాత్రి సమయంలో కాఫీ తీసుకోకపోవడమే మంచిది. ఈ సమయాల్లో తాగే కాఫీ రాత్రి నిద్రకు ఆటంకాన్ని కలిగిస్తుంది. కనుక సాయంత్రం సమయాల్లో కాఫీని నివారించడం మంచిది.
అలాగే రోజుకు 3 నుండి 4 కప్పుల కాఫీని మాత్రమే తీసుకోవాలి. కాఫీ స్వల్పంగా మూత్రవిసర్జనను పెంచుతుంది. కనుక నీటిని ఎక్కువగా తాగాలి. కాఫీని ఎక్కువగా తీసుకునే వారు దానిలో చక్కెర, క్రీమ్ వంటి వాటిని వేసుకోకపోవడమే మంచిది. అదే విధంగా ఖాళీ కడుపుతో కాఫీని తీసుకోకకూడదు. ఇది ఆమ్లత్వాన్ని పెంచి కడుపులో అసౌకర్యాన్ని కలిగిస్తుంది. కనుక అల్పాహారం తీసుకున్న తరువాత మాత్రమే కాఫీని తీసుకోవడం మంచిది. ఇక కాఫీని ఒకేసారి ఎక్కువగా తాగడానికి బదులుగా తక్కువ మొత్తంలో ఎక్కువసార్లు తీసుకోవాలి. కాఫీ తాగడం వల్ల మెదడు పనితీరు, శారీరక పనితీరు మెరుగుపడుతుంది. కాఫీలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కాఫీ తాగడం వల్ల పార్కిన్సన్స్, అల్జీమర్స్, టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇక కాఫీ గరిష్ట ప్రయోజనాలు పొందాలంటే కాఫీని ఉదయం 9:30 నుండి 11:30 గంటల మధ్య తీసుకోవడం ఉత్తమమని నిపుణులు తెలియజేస్తున్నారు.