Robotic Surgery | రోబోటిక్ సర్జరీ అనగానే చాలామందికి వైద్యుడి అవసరం లేకుండా ఒక యంత్రం స్వయంగా శస్త్రచికిత్స చేస్తుందనే ఆలోచన మనలో చాలా మందికి ఉంది. అయితే వాస్తవానికి రోబోట్ రోగికి స్వయంగా శస్త్రచికిత్స చేయదు. ఆధునిక ఆసుపత్రుల్లో ఉపయోగించే సర్జికల్ రోబోట్ అత్యాధునిక వైద్య పరికరం మాత్రమే. శస్త్రచికిత్సకు సంబంధించిన ప్రతి నిర్ణయాన్ని వైద్యుడే తీసుకుంటారు. వైద్యుడు రోగి ఉన్న గదిలోనే కొంత దూరంలో ఉన్న కంప్యూటర్ వద్ద కూర్చొని, శరీరంలోని భాగాలను పెద్దగా, త్రీడీ రూపంలో చూపించే తెరను చూస్తూ ప్రత్యేక నియంత్రణ పరికరాల సహాయంతో రోబోటిక్ పరికరాలను కదిలిస్తారు. వైద్యుడి చేతి కదలికలను రోబోట్ అత్యంత సూక్ష్మమైన కదలికలుగా మార్చి శస్త్రచికిత్సకు సహాయపడుతుంది. సహజంగా చేతుల్లో ఉండే స్వల్ప వణుకును కూడా ఈ వ్యవస్థ తగ్గిస్తుంది.
రోబోటిక్ సర్జరీలో ఉపయోగించే పరికరాలు చాలా చిన్నవిగా ఉండడంతో పాటు, మనిషి చేతి మణికట్టు సాధారణంగా చేరుకోలేని కొన్ని క్లిష్టమైన ప్రాంతాల్లోనూ పనిచేస్తాయి. దీని వల్ల రోగికి పెద్ద కోతలకు బదులుగా చిన్న కోతలతో శస్త్రచికిత్స చేసే అవకాశం ఉంటుంది. తద్వారా శరీరానికి కలిగే గాయం, రక్తస్రావం, శస్త్రచికిత్స అనంతరం ఇన్ఫెక్షన్ ముప్పు తగ్గే అవకాశం ఉంటుంది. కోలుకునే సమయం కూడా తక్కువగా ఉంటుందని ఈ విధానం గురించి చెబుతున్నారు. కొంతమంది రోగులు శస్త్రచికిత్స జరిగిన మరుసటి రోజే నడవడం ప్రారంభించి, తక్కువ సమయంలోనే ఇంటికి వెళ్లే అవకాశం ఉంటుంది. అయితే ప్రతి రోగి పరిస్థితి, శస్త్రచికిత్స రకం ఆధారంగా ఫలితాలు మారుతాయి.
శస్త్రచికిత్స గదిలో రోబోట్ ఉండడం వల్లే శస్త్రచికిత్స విజయవంతమవుతుందని భావించకూడదు. వైద్యుడి అనుభవం, ప్రత్యేక శిక్షణ, ఆసుపత్రిలోని వైద్య సదుపాయాల నాణ్యత వంటి అంశాలు ఇప్పటికీ కీలకమైనవే. రోబోటిక్ వ్యవస్థను ఉపయోగించే వైద్యులు వాటిపై ప్రత్యేక శిక్షణ పొందిన తర్వాతే రోగులపై శస్త్రచికిత్సలు చేస్తారు. ఈ సాంకేతికత ఒక వైద్యుడి స్థానాన్ని భర్తీ చేయడానికి కాకుండా, వైద్యుడు మరింత కచ్చితత్వంతో శస్త్రచికిత్స చేయడానికి సహాయపడే సాధనంగా పనిచేస్తుంది.
గతంలో రోబోటిక్ సర్జరీ చాలా ఖరీదైన సాంకేతికతగా ఉండడంతో ప్రధానంగా పెద్ద నగరాల్లోని కొన్ని ఆసుపత్రులకు మాత్రమే పరిమితమై ఉండేది. విదేశాల నుంచి యంత్రాలను దిగుమతి చేసుకోవాల్సి రావడం వల్ల ఖర్చు కూడా ఎక్కువగా ఉండేది. ప్రస్తుతం భారత్లోనే ఇంజినీర్లు, సాఫ్ట్వేర్ నిపుణులు, వైద్యులు కలిసి స్థానిక అవసరాలకు అనుగుణంగా రోబోటిక్ వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్నారు. దేశీయంగా తయారయ్యే సాంకేతికతతో ఖర్చులు తగ్గి, మరింత మందికి ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అలాగే వేగవంతమైన ఇంటర్నెట్ సదుపాయాల ద్వారా దూర ప్రాంతాల్లో ఉన్న రోగులకు రోబోటిక్ సర్జరీ అందించే అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. భారత్కు చెందిన ఒక సర్జికల్ రోబోట్ సంస్థ ఇప్పటికే 190కి పైగా టెలిసర్జరీలను, ఖండాంతర టెలిసర్జరీలను కూడా విజయవంతంగా నిర్వహించింది. భవిష్యత్తులో వైద్య నిపుణులు, సాంకేతికత కలిసి పనిచేయడం ద్వారా అధునాతన వైద్యం మరింత విస్తృతంగా అందుబాటులోకి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.