హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తేతెలంగాణ) : నాడు సినిమాలు సమాజ మార్పు కోసం తీస్తే, నేడు సమాజంతో పనిలేకుండా సంపాదనే లక్ష్యంగా తీస్తున్నారని ఎమ్మెల్యే, సీపీఐ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో తీవ్రగాయాలపాలై కిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను మంగళవారం ఇతర సీపీఐ నేతలతో కలిసి ఆయన పరామర్శించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. శ్రీతేజ్ ఇప్పుడిప్పుడే కొదికొద్దిగా కోలుకుంటున్నాడని కూనంనేని అనంతరం మగ్ధుంభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. శ్రీతేజ్‌కు మెరుగైన చికిత్స అందించాలని కోరారు. ప్రధాన కథానాయకుడు చెడుకు నాయకునిగా ఉండేలా సినిమాలు రూపొందించడం ఇది దేనికి సంకేతమని ప్రశ్నించారు. సభ్యత లేని సినిమాలకూ అనుమతులు ఇస్తున్న సెన్సార్ బోర్డును పూర్తిగా సంస్కరించాలని డిమాండ్ చేశారు. సందేశాన్ని పంచే చిన్న సినిమాలకూ అన్నిరకాలు ప్రొత్సాహకాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సంధ్య థియేటర్ ఘటనలో హీరో అల్లు అర్జున్ పోలీసులు అరెస్టు చేస్తే దానిని కొన్ని పార్టీల నాయకులు రాజకీయ రంగు పులిమి ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పారు. శ్రీతేజ్‌ను పరామర్శించిన వారిలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఈటీ నరసింహ, కార్యవర ్గసభ్యులు మర్రి వెంకటస్వామి, మంద పవన్ ఉన్నారు.