సెయింట్ జార్జ్: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన వెస్టిండీస్.. ఇంగ్లండ్‌పై టెస్టు సిరీస్ విజయం సాధించింది. ఆదివారం ముగిసిన మూడో టెస్టులో విండీస్ 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 204 పరుగులకు ఆలౌట్ కాగా.. వెస్టిండీస్ 297 పరుగులు చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 120 పరుగులకే కుప్పకూలగా.. 28 పరుగుల లక్ష్యాన్ని విండీస్ వికెట్ కోల్పోకుండా ఛేదించింది. తొలి రెండు టెస్టులు ‘డ్రా’గా ముగియగా.. ఈ మ్యాచ్ నెగ్గిన విండీస్ 1-0తో సిరీస్ పట్టింది. 2019 తర్వాత సొంతగడ్డపై విండీస్‌కు ఇదే తొలి టెస్టు సిరీస్ విజయం కావడం విశేషం. మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీతో చెలరేగిన విండీస్ వికెట్ కీపర్ జాషువ డిసిల్వాకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’, కెప్టెన్ బ్రాత్వైట్కు ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి.