Mamata Banerjee : పశ్చిమ బెంగాల్ సహా నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి ఆదివారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. అయితే, ఈ నోటిఫికేషన్ విడుదలవ్వడానికి కొన్ని గంటల ముందు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ డీఏ బకాయిలు విడుదల చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రక్రియ మొదలైనట్లు మమతా బెనర్జీ వెల్లడించారు. దీనివల్ల ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు.
విద్యా సంస్తల్లోని టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్, పంచాయతీలు, మున్సిపల్ సంస్థలు, ఇతర సంస్థల ఉద్యోగులకు ఈ డీఏ విడుదల వర్తిస్తుంది. ఈ నెల నుంచే ఉద్యోగులకు డీఏ అందుతుంది. మరోవైపు రాష్ట్రంలోని పురోహితులకు, మసీదుల్లోని ముయెజ్జిన్లకు అందిస్తున్న గౌరవ వేతనాన్ని కూడా పెంచారు. ప్రస్తుతం అందిస్తున్న రూ.1,500కు అదనంగా మరో రూ.500 అందించనున్నట్లు తెలిపారు. ఇకపై వారికి రూ.2,000 గౌరవ వేతనం అందుతుంది. ఈ పెంపుపై ప్రభుత్వానికి వారు చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు మమత తెలిపారు. అయితే, ఈ నిర్ణయాల్ని మమత.. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటానికి కొన్ని గంటల ముందు తీసుకోవడం విశేషం. వీటికి సంబంధించిన ఆదేశాలు జారీ అవ్వడం, ఆర్థిక శాఖ ఆమోదం తెలపడం, ఈ ప్రక్రియ మొదలవ్వడం జరిగిపోయింది. దీంతో ఈ నిర్ణయాలపై ఎన్నికల నోటిఫికేషన్ ఎఫెక్ట్ పడదు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుందనే సంగతి తెలిసిందే.
ఈ కోడ్ అమలులో ఉండగా, ఇలా ప్రజలకు లబ్ధి చేకూర్చే నిర్ణయాలు తీసుకోకూడదు. అందుకే మమత ముందే అప్రమత్తమై నిర్ణయం తీసుకుంది. ఇది వచ్చే నెలలో జరగనున్న ఎన్నికల్లో తమ పార్టీకి మేలు చేస్తుందని మమత భావిస్తోంది. పశ్చిమ బెంగాల్లో రెండు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. ఏప్రిల్ 23న తొలి దశ, ఏప్రిల్ 29న రెండో దశలో ఎన్నికలు నిర్వహిస్తారు. మే 4న ఫలితాలు వెల్లడవుతాయి. నోటిఫికేషన్ వెలువడటంతో ఇప్పటికే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.