కొల్లాపూర్: ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయలేక గ్రామాలలో ఐక్యంగా ఉండే ప్రజల మధ్యన వైశమ్యాలను పెంచుతోంది. ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, రుణమాఫీ నూతన పింఛన్లు, నూతన రేషన్ కార్డులు గ్రామాలలో అర్హులైన లబ్ధిదారుల కంటే అనర్హులైన రాజకీయ పార్టీ నాయకులకు 100% వర్తిస్తున్నాయి. సంక్షేమ పథకాలలో డొల్లతనాన్ని ఇవి బయటపెడుతున్నాయి. బుధవారం కొల్లాపూర్ నియోజక వర్గంలోని కోడేరు, పెద్దకొత్తపల్లి మండలాలలో పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికైన పసుపుల, చంద్రబండ తండాలలో నమస్తే తెలంగాణ బృందం పర్యటించింది. ఆ రెండు గ్రామాలలో కూడా సంక్షేమ పథకాల అమలులో చాలా లోపాలు ఉన్నట్లు స్పష్టంగా నమస్తే టీమ్ పరిశీలనలో తేలింది.
కోడేరు మండలంలోని పసుపుల గ్రామాన్ని సంక్షేమ పథకాల అమలు కోసం పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. 2147 మంది జనాభా కలిగిన ఆ గ్రామంలో 455 ఇండ్లు ఉన్నాయి. జనవరి 26న రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్‌ల సమక్షంలో గ్రామ సభ జరిగింది. లబ్ధిదారుల లిస్టును గ్రామసభలో ప్రకటించారు. అయితే మంత్రి జూపల్లి కృష్ణారావు గ్రామంలోని నాయకుల సూచన మేరకు గ్రామంలో పర్యటించి 20 మంది లబ్ధిదారులను స్వయంగా గుర్తించారు. అయితే మంత్రి గుర్తించిన జాబితాలో కూడా నిజమైన లబ్ధిదారులకు చోటు దక్కలేదు. ఎస్సీలకు మూడు, ఎస్టీలకు ఒక ఇందిరమ్మ ఇల్లు మాత్రమే మంజూరైనట్లు తెలిసింది.
రైతు భరోసా సైతం 1317 మంది రైతులకు పూర్తిస్థాయిలో పడలేదు. నూతన పింఛన్లు, నూతన రేషకార్డుల కోసం అర్హులు దరఖాస్తులు పెట్టుకున్నా ఇంతవరకు రేషన్ కార్డులు, పింఛన్లు మంజూరు కాలేదు. ఆత్మీయ భరోసాలో కూడా కూలి పని చేసిన వారికి పథకం వర్తించలేదు. ఉపాధి హమీ పని చేయని, వ్యవసాయ భూమి ఉండి ఇతర ప్రాంతాల్లో ప్రైవేటు జాబ్ చేసే కొండల్రావు లాంటి వ్యక్తులకు ఆత్మీయ భరోసా డబ్బులు పడ్డాయి. కానీ దళిత కాలనీలోని ఒంటరి మహిళ శాంతమ్మకు గుంట భూమి లేదు. ఉండేందుకు ఇల్లు కూడా లేదు. రెక్కల కష్టంపై ఆధారపడి జీవిస్తున్నా, ఉపాధి హామీ జాబు కార్డు ఉండి ఉపాధి హామీ పనులు చేసినా ఆత్మీయ భరోసా కానీ, ఇందిరమ్మ ఇల్లుకానీ దక్కలేదు.
గ్రామంలో 615 ఉపాధి జాబ్ కార్డులు ఉన్నాయి. సగటున 243 మంది ప్రతి ఏడాది ఉపాధి హామీ పనులపై ఆధారపడి బ్రతికే వారు ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. తమకు చెందాల్సిన సంక్షేమ పథకాలను రాజకీయ నాయకులు ఆర్థికంగా బలంగా ఉన్నవాళ్ళకు, అగ్రకులాల వారికి ఇస్తున్నారని దళిత మహిళ శాంతమ్మ వాపోయింది. మానసిక స్థితి సరిగా లేని కూతురుతోపాటు కుమారుడి పోషణ కూడా తనపై ఉందని, సుస్తీ చేసినా కూలికి వెళ్తే తప్ప పూట గడవదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
దళిత మహిళ మిద్దె మశమ్మ నమస్తే తెలంగాణతో మాట్లాడుతూ.. ఊర్లో పని లేక భర్తతో కలిసి నాందేడులో మట్టి పని చేసుకుని బ్రతుకుతున్నామని, ఇప్పుడు ఊర్లో ఇల్లు ఇస్తున్నారని చెప్తే జనవరి 17వ తేదీన గ్రామానికి వచ్చామని చెప్పారు. మంత్రి తమ గల్లీలో నుంచే వెళ్ళాడు కానీ తమను ఏ పథకానికి గుర్తించలేదని అన్నారు. గ్రామ కార్యదర్శి వద్దకు వెళ్లి అడిగితే నాయకుల వద్దకు వెళ్ళండి అని చెప్తున్నట్లు తెలిపారు. తాము 20 సంవత్సరాల క్రితం ఇంటి నిర్మాణం కోసం బేస్మెంట్ కట్టామని, అప్పటి నుంచి మా ఆర్థిక పరిస్థితి సరిగా లేక ఇల్లు నిర్మించుకోలేక అవస్థలు పడుతున్నామని ఆమె కన్నీటి పర్యతమయ్యారు.
గ్రామంలో వృద్ధ దంపతులైన మల్లె చంద్రమ్మ, నరసయ్యలకు మంత్రి జూపల్లి ఇల్లు మంజూరు చేయించారు. కానీ ఆ దంపతుల వద్ద కనీసం ఇంటి బేస్ నిర్మాణం చేసుకునేందుకు కూడా డబ్బులు లేవు. పింఛన్‌పై ఆధారపడి జీవిస్తున్నామని తాము ఇల్లు కట్టుకోలేమని ఆ వృద్ధ దంపతులు వాపోయారు. ప్రభుత్వం దయతలచి ఇల్లు నిర్మాణం చేయించి ఇవ్వాలని మొరపెట్టుకున్నారు.
చంద్రబండ తండా కూడా పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికైంది. అయినా ఇతర గ్రామాలకు భిన్నంగా ఏమి లేదు. జనవరి 26న గ్రామసభ ద్వారా గ్రామంలో 100% సంక్షేమ పథకాలు అమలవుతాయని అధికార పార్టీ నాయకులు, అధికారులు చెప్పినా ఆచరణలో మాత్రం సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అమలు కాలేదు. 100% అమలు అయినట్లు ప్రభుత్వం ప్రకటించిన రైతు భరోసా కూడా 1252 ఎకరాలకు పూర్తిగా రాలేదు. 162 మంది రైతులకు కూడా పూర్తిస్థాయిలో పడలేదు. గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను 21 మందికి, ఆత్మీయ భరోసాకు తొమ్మిది మందిని గుర్తించారు.
ఉపాధిహామీ జాబ్ కార్డులు మాత్రం 150 మందికి ఉన్నాయి. పింఛన్ల కోసం, రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు ఇచ్చిన వారికి ఇంతవరకు పింఛన్లు, రేషన్ కార్డులు మంజూరు కాలేదని గ్రామస్తులు పేర్కొన్నారు. గ్రామంలో అధికార పార్టీలో గ్రూప్ తగాదాలు ఉండడంతో నిజమైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందకుండా అధికార పార్టీ గ్రూపులు పంచుకుంటున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.