హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సంస్థ తన వ్యాపార కేంద్రాన్ని నెలకొల్పేందుకు ముందుకొచ్చింది. రోగుల చికిత్సకు అవసరమయ్యే సాఫ్ట్వేర్ సేవలను అందించడంలో అంతర్జాతీయంగా పేరున్న వెబ్ పీటీ సంస్థ రూ. 150 కోట్ల పెట్టుబడితో తమ గ్లోబల్ కేపబిలిటీస్ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. కండరాలు, ఎముకలకు సంబంధించిన సమస్యలతో బాధపడే రోగులకు మరింత మెరుగైన పద్ధతుల్లో పునరావాస చికిత్సను అందించే సాఫ్ట్వేర్ సొల్యూషన్‌ను ఈ సంస్థ దవాఖానలకు అందజేస్తుంది. అందిస్తుంది. 2008లో అమెరికాలోని ఫీనిక్స్ కేంద్రంగా ప్రారంభమైన వెబ్ పీటీ సాఫ్ట్‌వేర్‌కు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతున్నది. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొంటున్న రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావుతో బుధవారం వెబ్ పీటీ సీఈవో ఆష్లే గ్లోవర్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ పాల్ షుగా, సమ్మిట్ కన్సల్టింగ్ సర్వీసెస్ వ్యవస్థాపకుడు, సీఈవో సందీప్ శర్మ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వెబ్ పీటీ తమ విస్తరణ ప్రణాళికలను వెల్లడించింది. రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్, తెలంగాణ ప్రభుత్వ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి నాగప్పన్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
రిహాబిలిటేషన్ చికిత్సను సులభతరం చేయడమే లక్ష్యం
రిహాబిలిటేషన్ చికిత్సను మరింత సులభతరం చేయడమే వెబ్ పీటీ లక్ష్యమని సీఈవో ఆష్లే గ్లోవర్ తెలిపారు. హైదరాబాద్ కేంద్రంగా భారత్‌లో తమ వ్యాపార విస్తృతిని పెంచుకునే వ్యూహంలో భాగంగా రూ. 150 కోట్లతో గ్లోబల్ కేపబిలిటీస్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. కండరాలు, ఎముకలకు సంబంధించిన వ్యాధులతో బాధపడే రోగులకు అందించే రిహాబిలిటేషన్ థెరపీకి మరింత సాధికారిత కల్పించే లక్ష్యంగా హైదరాబాద్ కేంద్రం పనిచేస్తుందని చెప్పారు.
సుస్థిర, సమర్థ ప్రభుత్వం ఉన్నందునే..
ప్రతిభావంతమైన మానవ వనరులు, సుస్థిర, సమర్థ ప్రభుత్వం, ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, ఇతర అనుకూలతలు ఉన్నందునే వెబ్ పీటీ సంస్థ తమ జీసీసీ ఏర్పాటునకు హైదరాబాద్‌ను ఎంచుకున్నదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో రూ. 150 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిన వెబ్ పీటీ సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. వెబ్ పీటీ విజయాల్లో తెలంగాణ ప్రభుత్వం భాగస్వామిగా ఉంటుందని హామీ ఇచ్చారు. లైఫ్ సైన్సెస్ హబ్ ఆఫ్ ఆసియాగా హైదరాబాద్ ఎదుగుతున్న వైనానికి వెబ్ పీటీ కేంద్రం ఏర్పాటు మరో నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు.
ప్రతిభావంతమైన మానవ వనరుల ఆకర్షణకు సహకారం
గ్లోబల్ కేపబిలిటీస్ సెంటర్ ఏర్పాటు కోసం వెబ్ పీటీతో కలిసి పనిచేస్తున్నామని సమ్మిట్ కన్సల్టింగ్ సర్వీసెస్ సీఈవో సందీప్ శర్మ తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం, కార్యకలాపాల నిర్వహణలో ప్రతిభావంతమైన మానవ వనరులను ఆకర్షించడంలో సమ్మిట్ కన్సల్టింగ్ సర్వీసెస్ సహాయ పడుతుందని ఆయన వివరించారు.