ముంబై, ఫిబ్రవరి 16: సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ (ఎంఎస్ఎంఈ)లకు సకాలంలో, సరిపడా రుణాలు అందేలా చేయడమే ఇప్పటికీ తమ ప్రధాన విధాన ప్రాధాన్యత అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే పలు ఎంఎస్ఎంఈలు, సంఘాల ప్రతినిధులతో మల్హోత్రా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత ఆర్థిక వ్యవస్థలో ఎంఎస్ఎంఈల ప్రాధాన్యతను గవర్నర్ నొక్కిచెప్పినట్టు సోమవారం ఓ ప్రకటనలో ఆర్బీఐ తెలిపింది.
దేశ జీడీపీ, ఎగుమతులు, ప్రజల జీవన ఆదాయాల్లో ఎంఎస్ఎంఈల పాత్ర కీలకమని మల్హోత్రా చెప్పారు. అందుకే వాటికి రుణ లభ్యత పెరిగేలా చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. ఇంకా తీసుకోవాల్సిన చర్యల గురించీ ఎంఎస్ఎంఈల ప్రతినిధుల నుంచి ఆయన ఆరా తీశారు. ఈ సమావేశంలో ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్లు రవి శంకర్, స్వామినాథన్, ముర్ము పాల్గొన్నారు.