మంచిర్యాల అర్బన్ : కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ కార్యకర్తల ( BRS activists ) జోలికి వస్తే ఊరుకునేదేలేదని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ( Durgam Chinnaiah ) హెచ్చరించారు. బెల్లంపల్లిలో జరిగిన భూ వివాదంలో గాయాలపాలైన పనాస గణేష్, పనాస లక్ష్మీ బాధితులను బుధవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పరమార్శించారు. ఈ సందర్భంగా గొడవకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఆయన మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలో మూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నాయకుల ఆగడాలు మితిమీరిపోతున్నాయని ఆరోపించారు. గడ్డం ఫ్యామిలీకి కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి పదవి ఇచ్చిన తరువాత చెన్నూర్, బెల్లంపల్లి నియోజకవర్గంలో అగడాలు ఎక్కువైయ్యాయని విమర్శించారు. కాంగ్రెస్ గుండాలు, మాజీ జడ్పీటీసీ రాంచందర్ అనుచరులు మారణాయుధాలతో దాడి చేసి గాయపరిచారని వెల్లడించారు.
కన్నెపల్లి, వేమనపల్లి మండలాల్లో బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేసినా కూడా పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఏనాడు కూడా ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలపై దాడులకు దిగలేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రాక్షసపాలన నడుస్తున్నదని,బీఆర్ఎస్ అది నాయకత్వం మీద ఈడీ కేసులు పెట్టించి, నోలీసులు ఇచ్చి ఇబ్బందులపాలు చేస్తుందని ఆరోపించారు.
రామగుండం సీపీ ఘటనపై విచారణ జరిపించి దోషులపై చట్టపరంగా చర్యలు తీసుకోని బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ పల్లె భూమేష్, మంచిర్యాల పట్టణ అధ్యక్షుడు గాదె సత్యం, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.