మన్సూరాబాద్ (హైదరాబాద్) : ఎల్బీనగర్ పరిధిలోని ఆటోనగర్ పారిశ్రామిక వాడ (Industrial Park) నుంచి వస్తున్న కెమికల్ (Chemical) దుర్వాసనకు బాధ్యులైన వారిపై కఠినచర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి(MLA Sudheer Reddy) పేర్కొన్నారు. మన్సూరాబాద్ డివిజన్ పరిధి హిమపురికాలనీ ఫేజ్-1, 2, సెవన్హిల్స్కాలనీ, డీపీనగర్, ద్వారకానగర్, ఆటోనగర్ డంపింగ్ యార్డు తదితర ప్రాంతాల్లో మంగళవారం అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
నూతన రోడ్లు, యూజీడీ, ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయాలని, కాలనీల్లో కుక్కల బెడద నుంచి విముక్తి కల్పించాలని కాలనీవాసులు ఎమ్మెల్యేను కోరారు. ఆటోనగర్ పారిశ్రామిక వాడ నుంచి వస్తున్న కెమికల్ దుర్వాసనతో అనారోగ్యాల బారినపడుతున్నామని వివరించారు. కెమికల్ దుర్వాసనపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, తదితర శాఖలకు ఫిర్యాదు చేసి సమస్యను పరిష్కరిస్తానని వెల్లడించారు.
డంపింగ్ యార్డు (Dumping Yard) ప్రాంతంలో జంతు కళాబరాల డంపింగ్‌ను అరికడుతామని తెలిపారు. ఆటోనగర్ పారిశ్రామిక వాడ ప్రాంతం నుంచి దిగువకు వరదనీరు వెళ్లేందుకు రూ. 7 కోట్లతో ట్రంకులైన్ ఏర్పాటు చేసేందుకు నిధులు మంజూరయ్యాయని తెలిపారు.