న్యూఢిల్లీ, మార్చి 24: ఎఫ్ఎంజీసీ (ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్) రంగంలో పతంజలి ఆయుర్వేద, రుచిసోయాలు కలిసి ఐదేండ్లలో నంబర్ వన్ స్థానాన్ని అందుకుంటాయని పతంజలి గ్రూప్ వ్యవస్థాపకుడు బాబా రామ్‌దేవ్ చెప్పారు. రుచి సోయా ఫాలోఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్‌పీవో) జారీ సందర్భంగా గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం పతంజలి ఆయుర్వేద్ గ్రూప్, రుచి సోయాల టర్నోవర్ రూ. 35,000 కోట్లు ఉందని, ఈ రంగంలో ఇప్పుడు అగ్రస్థానంలో ఉన్న హిందుస్థాన్ యూనీలీవర్ (హెచ్‌యూఎల్) టర్నోవర్ 2021 ఆర్థిక సంవత్సరంలో రూ. 45,996 కోట్లని వివరించారు. ఐదేండ్లతో తమ కంపెనీలను అగ్రస్థానంలో నిలపాలన్నది లక్ష్యమన్నారు. పతంజలి ఆయుర్వేద్ తన ఆహారోత్పత్తుల వ్యాపారాల్ని క్రమేపీ లిస్టెడ్ సంస్థ అయిన రుచిసోయాకు బదిలీ చేస్తుందని వెల్లడించారు. దివాలా ప్రక్రియలో ఉన్న రుచి సోయాను 2019లో పతంజలి గ్రూప్ రూ. 4,350 కోట్లకు కొనుగోలు చేసింది. 2021 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఇది హరిద్వార్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న పతంజలి గ్రూప్లోనున్న పలు కంపెనీలను దశలవారీగా లిస్ట్ చేయనున్నట్టు బాబా రామ్‌దేవ్ తెలిపారు. అయితే గ్రూప్ కంపెనీల ఐపీవోలను తెచ్చే సమయాల్ని వెల్లడించలేదు.
గత ఆర్థిక సంవత్సరంలో రుచి సోయా రూ. 16,400 కోట్ల టర్నోవర్ సాధించగా, పతంజలి ఆయుర్వేద అమ్మకాల ఆదాయం రూ. 9,784 కోట్లని రామ్‌దేవ్ తెలిపారు. పతంజలి నేచురల్ బిస్కెట్స్ రూ.650 కోట్లు, తమ ఆయుర్వేద సబ్సిడరీ దివ్య ఫార్మసీ రూ. 850 కోట్లు, ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీ పతంజలి ఆగ్రో రూ. 1,600 కోట్ల చొప్పున టర్నోవర్ నమోదు చేశాయన్నారు. రవాణా సబ్సిడరీ పతంజలి పరివాహన్ రూ.548 కోట్లు, పతంజలి గ్రామోద్యోగ్ రూ.396 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాయన్నారు. వచ్చే కొద్ది నెలల్లో పతంజలి ఆయుర్వేద్ తన ఆహారోత్పత్తుల వ్యాపారాన్ని రుచిసోయాకు బదిలీ చేస్తుందని, గత ఏడాది బిస్కెట్ల వ్యాపారాన్ని రూ. 60 కోట్ల విలువకు పతంజలి ఆయుర్వేద్ బదిలీ చేసిందన్నారు.