
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): మీరు స్టార్టప్‌ను నిర్వహిస్తున్నారా? వ్యాపార నమూనా సిద్ధం చేసి, కార్యకలాపాలు నిర్వహించే ఆలోచనలో ఉన్నారా? అయితే మీ స్టార్టప్‌లో పెట్టుబడులు పెట్టేందుకు పెట్టుబడిదారులు సిద్ధంగా ఉన్నారు. ఇందుకోసం స్టార్టప్‌లను ఎంపిక చేసే మూడో విడత కార్యక్రమాన్ని ’టీ-ఏంజెల్ కోహార్ట్3’ పేరుతో టీహబ్ చేపట్టింది. స్టార్టప్‌లు ఈ నెల 15లోగా దరఖాస్తు చేసుకుంటే, ఈ నెల 22 నుంచి ఫిబ్రవరి 28 వరకు 90 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని టీహబ్‌లో నిర్వహించనున్నారు. ఎంపిక చేసిన స్టార్టప్‌ల నిర్వాహకులకు టీ హబ్‌లోని వివిధ రంగాలకు చెందిన నిపుణులు మార్గనిర్దేశనం చేస్తారు. ఈ కార్యక్రమం ద్వారా స్టార్టప్‌లకు ఎన్నో ప్రయోజనాలు కలుగనున్నాయి. స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టేవారు ఎలాంటి వాటిని కోరుకుంటున్నారో? మొదటిసారి పెట్టుబడి కోసం చూస్తున్నవారైతే స్టార్టప్‌లను ఏవిధంగా ప్రారంభించి, వ్యాపార నమూనాలు ఎలా సిద్ధం చేసుకోవాలో దీని ద్వారా తెలియనున్నది. ఇప్పటికే స్టార్టప్‌లు ప్రారంభించి, రూ.కోటికి పైగా నిధులు సాధించిన స్టార్టప్ వ్యవస్థాపకులను నేరుగా కలిసి మాట్లాడే అవకాశం కలుగుతుందని టీహబ్ నిర్వాహకులు తెలిపారు.
స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు టీహబ్ ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. ఒక స్టార్టప్‌ను ప్రారంభించినప్పటి నుంచి నిధులు సేకరించేదాకా వ్యవస్థాపకులు ఒక సుదీర్ఘ ప్రయాణమే చేయాల్సి ఉంటుంది. అలాంటి వారికి టీహబ్ ‘టీ-ఏంజెల్’ ఉపయోగపడనున్నది. అటు పెట్టుబడిదారులను, ఇటు స్టార్టప్ వ్యవస్థాపకులను దగ్గర చేసే గొప్ప కార్యక్రమమే ఇది. దీని ద్వారా నిధులు సమకూర్చుకోవటం సులభం అవుతున్నది. నిధుల కొరత సమస్య రాకుండా స్టార్టప్‌లకు టీహబ్ మధ్యవర్తిగా పనిచేస్తున్నది.