గంగాధర, జనవరి 6: నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకూ సాగు నీరందించడానికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. బూరుగుపల్లిలో గురువారం ఆయన నీటి పారుదల శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఎల్లంపల్లి ప్యాకేజీ 1, 3 పెండింగ్ పనులు, పోతారం రిజర్వాయర్ డీఎల్ఆర్, ఎస్ఎల్ఆర్ వంతెన పనులు, డీ-1, 2 కెనాల్ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. మల్యాల మండలంలో వ్యవసాయ భూములు వరద కాలువకు ఎత్తులో ఉన్నందున అవసరమైన చోట లిఫ్ట్‌లు ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. వరద కాలువ 76.20 వద్ద లిఫ్ట్‌ను ఏర్పాటు చేసి మద్దుట్ల కొత్త చెరువు, గుడి చెరువు, నల్లమట్టు కుంట ద్వారా 1700 ఎకరాలకు సాగు నీరందించడంతో పాటు గొర్రెగుండం, మద్దుట్ల గ్రామాల్లో 8 ట్యాంక్‌లను నింపుతామని తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అదనపు టీఎంసీ నీటి తరలింపునకు చేపడుతున్న సమాంతర కాలువ నిర్మాణానికి రైతులు భూములు ఇచ్చి సహకరించాలని కోరారు. ఈఈలు నూనె శ్రీధర్, సంతు ప్రకాశ్, సుధాకిరణ్, శ్రీనివాసరావు, డీఈ అరుణ్‌కుమార్ పాల్గొన్నారు.