We-Hub | వ్యాపార రంగం అంటే మగవాళ్ల సామ్రాజ్యంగా చూస్తుంది సమాజం. ఒక బిజినెస్ ఐడియా పట్టుకుని శాస్లాంటి సెషన్లకు వెళితే ఆడపిల్లను పట్టించుకునే నాథుడే ఉండడు. గ్రామీణ ప్రాంతాల మహిళలు ఆంత్రప్రెన్యూర్లు కావాలంటే ఎక్కడికి వెళ్లాలో కనీసం దారి తెలియని పరిస్థితి. స్త్రీలకుండే ఈ అడ్డంకులన్నింటినీ తొలగించింది తెలంగాణ ప్రభుత్వం. ఆడవారిని వ్యాపారవేత్తలుగా మలచాలన్న మహోన్నత సంకల్పంతో అచ్చంగా వారికోసమే ‘వీ హబ్’ పేరిట స్టార్టప్ ఇంక్యుబేటర్‌ను ఏర్పాటు చేసింది. ఆలోచన స్థాయి నుంచి వినియోగదారులకు ఉత్పత్తిని అందించేదాకా అడుగడుగునా అండగా నిలుస్తున్నది. అయిదేండ్లలో అయిదున్నర వేల మందికి దాకా వ్యాపారవేత్తలను తీర్చిదిద్దింది వీ హబ్. ఈ స్టార్టప్ దునియా నుంచి వచ్చిన వేలమంది విజేతల్లో నలుగురు నళిని, శ్రీలత, రమాదేవి, డా॥గాయత్రీదేవి. తెలంగాణ ప్రభుత్వం వారి జీవితాల్లో ఎలాంటి మార్పును తీసుకువచ్చిందో చదవండి…
We Hub1
నళిని (ట్రూలీఓ): తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన మార్పులు చాలారంగాల్లో మహిళల ప్రాధాన్యం పెరగడం అన్నది మనం స్పష్టంగా గమనించవచ్చు. వాళ్ల కోసం ప్రభుత్వం చేపట్టిన రకరకాల చర్యలు, పథకాలు దీనికి కారణమని నేను అనుకుంటున్నాను. మనం ఇప్పుడు కూర్చున్న ‘వీ హబ్’ కూడా మహిళల్ని శక్తిమంతులు
చేసేదేగా…
శ్రీలత (మై పూజా మార్ట్): అవును, ఐఐటీల్లాంటి విద్యా సంస్థల్లో మాత్రమే ఇలాంటివి విన్నాం. అంతేతప్ప, నేరుగా ప్రభుత్వమే స్టార్టప్‌ల కోసం ఇంక్యుబేషన్ సెంటర్ పెట్టడం చాలా గొప్ప విషయం!
రమాదేవి (ఎఫ్టీ.యు): ఎగ్జాక్ట్లీ! అందులోనూ అచ్చంగా మహిళా వ్యాపారవేత్తల కోసం ప్రత్యేకంగా ‘వీ హబ్’లాంటి ఇంక్యుబేషన్ సెంటర్లు ప్రారంభించడం దేశంలో మరెక్కడా లేదు. అది మన తెలంగాణ రాష్ట్రంలో ఉండటం నిజంగా అదృష్టం. ఇక్కడ ప్రీ ఇంక్యుబేషన్ సెషన్స్‌కి అటెండ్ అయ్యాక నాకు ఎలాంటి వ్యాపారం చేయాలన్న దాని మీద అవగాహన వచ్చింది. వీళ్లు ఇచ్చిన భరోసాతోనే లక్షల జీతం వచ్చే ఉద్యోగం వదిలేసి వ్యాపారం వైపు మళ్లా.
శ్రీలత: నేను నా వ్యాపారానికి సంబంధించి మార్కెటింగ్ కనెక్ట్స్ కోసం అడిగాను. సేల్స్‌కి కూడా వీళ్లు హెల్ప్ చేస్తున్నారు. నాతో కలిసి పనిచేసేందుకు నాలాంటి ఆంత్రప్రెన్యూర్లతో కొలాబరేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. అన్నింటికన్నా ముఖ్యంగా వ్యాపారం నిలబడాలంటే ఆర్థిక దన్ను అవసరం. అందుకే ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్లను మనం ఎలా పొందవచ్చో చెప్పడం, నాలాంటి అప్‌కమింగ్ ఆంత్రప్రెన్యూర్లకు అందివ్వడంలాంటివి చేస్తున్నారు.
డా॥ గాయత్రీదేవి (ఫిడ్స్ మెడ్‌టెక్): నేను మీలా టెక్నాలజీ రంగం నుంచి రాలేదు. 35 ఏండ్లుగా గైనకాలజిస్టుగా పనిచేస్తున్నాను. ప్రసవాలు చేసే సమయంలో బిడ్డ బయటికి వచ్చేందుకు వీలుగా గర్భాశయ ముఖద్వారం ఎంత తెరుచుకుంది అని తెలుసుకునేందుకు ఏండ్ల నుంచీ అక్కడ చెయ్యి పెట్టి చూసే పద్ధతే ఉంది. దానివల్ల తల్లికి తీవ్ర అసౌకర్యంతోపాటు, తల్లీబిడ్డలిద్దరికీ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువ! అందుకే, అసలు తల్లిని తాకే అవసరమే లేకుండా డయలేషన్ ఎంత ఉందని తెలుసుకునే పరికరాన్ని కనిపెట్టాను. దాని కోసం కావాల్సిన టెక్నికల్ సపోర్ట్, వెంచర్ క్యాపిటల్ పరంగా సాయం కోసం వీ హబ్‌కి వచ్చాను. వీళ్లు బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడికొచ్చినప్పుడు అందరూ కంప్యూటర్లు నొక్కుతుంటే నాకేం అర్థమవుతాయ్ ఇవన్నీ, నేనేం చేయగలను అనుకున్నా. కానీ ఇప్పుడు ధైర్యం వచ్చింది.
నళిని : మేడం, చదువుకున్న మీరే అలా అంటున్నారు. వీ హబ్‌లో చాలా పల్లెటూరి నుంచి వచ్చిన వాళ్లు కూడా స్టార్టప్‌లు పెట్టి, వ్యాపారవేత్తలుగా రాణించడం మేం చూశాం. ఇక్కడ జరిగిన ఒక సెషన్‌కి నిజామాబాద్ సమీపంలోని పల్లెటూరి నుంచి ఒక అమ్మాయి వచ్చింది. కుర్చీలో కూడా ఒక మూలకు కూర్చుంది. మీరంతా చదువుకున్న వాళ్లు మేడం, నాకు మీరు చేసేవన్నీ తెలీవు… అంటూ మాట్లాడింది. కానీ, ఇక్కడికి వచ్చాక ఆమెలో ఆత్మవిశ్వాసం ఎంతో పెరిగింది. వీ హబ్ అయిదేండ్ల వార్షికోత్సవానికి కేటీఆర్ వచ్చినప్పుడు మైక్ ఇస్తే ఆమె బ్రహ్మాండంగా మాట్లాడింది. మేమంతా స్టన్ అయ్యాం!
Entrepreneur
శ్రీలత: అవును పల్లె నుంచి వచ్చారా, పట్నం నుంచి వచ్చారా అన్న భేద భావం లేకుండా ఇక్కడ మంచి ట్రైనింగ్ ఇస్తున్నారు. అది కూడా అందరికీ సమాన ప్రాధాన్యం ఇస్తుండటం చాలా ముచ్చటగా అనిపించింది. ఇంకో విషయం ఏంటంటే మన ఇంట్లో వాళ్లు ఇవ్వలేని ఫీడ్‌బ్యాక్, సపోర్ట్ కూడా ఇక్కడ దొరుకుతున్నది. మనవాళ్లు, బాగుందనో బాగలేదనో చెబుతారు. కానీ, మనం సాగే క్రమంలో మన పోటీదారులు ఎవరు, ఎక్కడ వెనుకబడుతున్నాం, ముందుకెలా వెళ్లాలి.. లాంటి విషయాలు వీళ్లు చక్కగా చెబుతారు.
రమాదేవి: అవును, నేను వేరే ఇంక్యుబేషన్ సెంటర్లకు వెళ్లాను. శాస్ (సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్) మీటింగ్‌లకూ హాజరయ్యాను. మహిళలుగా మనం ఒక బిజినెస్ ఐడియాతో అక్కడికి వెళ్తే, ఎవరూ మనల్ని పట్టించుకోరు. మనతో కలిసి పనిచేస్తామనీ అడగరు. కానీ వీ హబ్‌లో అలాంటి పరిస్థితి చూడలేదు! ఇక్కడ మహిళలను ప్రోత్సహిస్తున్న తీరు అద్భుతం.
నళిని: ఆడవాళ్లంటే… చదువు, ఉద్యోగం, ఇల్లు.. ఇది మాత్రమే అన్న భావన ఉంటుంది. కానీ మహిళ తలచుకుంటే ఏదైనా చేయగలదని నా కూతురికి చూపించడానికే నేను ఆంత్రప్రెన్యూర్‌గా మారా. అమ్మకు అవకాశం ఇస్తే ఏదైనా చేయగలదన్న నమ్మకం నా బిడ్డలో కలిగించడానికే పందొమ్మిదేండ్ల నా ఐటీ కెరీర్‌ని వదిలిపెట్టి ఇటువైపు వచ్చా. అయితే నేను ఈ దిశలో ముందుకు వెళ్లగలనన్న ధైర్యాన్ని ఇచ్చింది మాత్రం వీ హబ్ ఓన్లీ! దీని స్థాపనకు కారణం అయిన కేసీఆర్ గారంటే నాకు చాలా అభిమానం. మాలాంటి మరింత మంది మహిళలు ఉన్నతంగా ఎదగాలంటే మళ్లీ బీఆర్ఎస్ సర్కారే రావాలి. అందుకే కేసీఆర్‌కు నేను ఓటు వేయడమే కాదు, మరో వంద మందిని తీసుకెళ్లి ఓటు వేయిస్తా!!
రమాదేవి: మీ ఇంట్లో అని కాదు. మన సౌత్ ఇండియాలోనే ఆంత్రప్రెన్యూర్‌షిప్ మీద దృష్టి చాలా తక్కువ. ఇందులో ఆడవాళ్ల పరిస్థితి పూర్తిగా వేరు. మాది ఆన్లైన్ ఫ్యాషన్ డిజైనింగ్ సంస్థ. మేం మా కంపెనీ కోసం క్లాత్ కొనేందుకు సూరత్ వెళ్లాం. రెండువేల మీటర్లు కావాలంటే మా దగ్గరికి రండి, లేకపోతే రాకండి అంటూ కఠినంగా మాట్లాడారు వాళ్లు. కానీ, ఇప్పుడు మాకు ఫ్యాబ్రిక్ ఇస్తామంటూ రోజుకు వంద మెసేజ్‌లు వస్తున్నాయి. ఇలా మహిళలకు వెన్నుదన్నుగా ఉండే ప్రభుత్వాలు పదికాలాలు పచ్చగా ఉండాలని కోరుకోవాల్సిందే. అందుకే మీరే కాదు, మన ఆంత్రప్రెన్యూర్లంతా బీఆర్ఎస్ జిందాబాద్ అనాల్సిందే!
…? లక్ష్మీహరిత ఇంద్రగంటి, సి.ఎం.ప్రవీణ్