హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): మహిళా పారిశ్రామికవేత్తల కోసం వీ-హబ్ తొలిసారి రూరల్ ఇంక్యుబేషన్ కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా 50 మంది మహిళా వ్యాపారవేత్తలకు ఈ కార్యక్రమం ద్వారా వారి సృజనాత్మకతతో కూడిన వినూత్నమైన ఆలోచనలకు పెద్దపీట వేయనున్నారు. ఈ రూరల్ ఇంక్యుబేషన్‌తో చిన్న, మధ్యతరహా సంస్థ (ఎస్ఎమ్ఈఎస్)లతోపాటు స్థానిక మార్కెట్‌ను మరింత బలోపేతం చేసుకుంటూ గ్లోబల్ మార్కెట్‌తో పోటీపడేలా సరికొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టనున్నారు. ఇక ఈ కార్యక్రమం ద్వారా మొత్తం ఐదు రంగాల్లోని మహిళా పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నారు. తయారీ, వస్త్ర, చేనేత, ఆహారశుద్ధి, హస్తకళ రంగాల్లో ఉన్నవారు మార్చి 15లోగా దరఖాస్తు చేసుకోవాలని వీ-హబ్ నిర్వాహకులు తెలిపారు. ఎంపికైనవారితో ఏప్రిల్ 1 నుంచి కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ మాట్లాడుతూ.. వీ-హబ్ వేదికగా చాలామంది ఔత్సాహికుల ఆలోచనలు వ్యాపార సంస్థలుగా మారుతున్నాయని అభినందించారు. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పుడు మహిళా పారిశ్రామికవేత్తలు రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో కీలకపాత్రను పోషించే స్థాయికి ఎదుగుతారని ఆకాంక్షించారు. ఈ రూరల్ ఇంక్యుబేషన్ కార్యక్రమం ఏడాదిపాటు కొనసాగనుంది. కార్యక్రమంలో వీ-హబ్ సీఈవో దీప్తి రావుల, న్యూచర్ ఫీల్డ్స్ సహవ్యవస్థాపకురాలు కీర్తి ప్రియ తదితరులు పాల్గొన్నారు.