ఇస్లామాబాద్: పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తన వింత వ్యాఖ్యలతో మరోసారి నవ్వుల పాలయ్యారు. భారత్‌లో జరిగిన ఓ ఐపీఎల్ మ్యాచ్‌లో ఫ్లడ్లైట్లను తమ దేశ సైబర్ యోధులు హ్యాక్ చేశారని చెప్పి నెటిజన్ల చేతిలో విపరీతంగా ఆయన ట్రోల్‌కు గురయ్యారు. పాక్ జాతీయ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ‘ఇదంతా పాక్ స్వదేశీ సాంకేతికత వల్ల జరిగిందనే విషయాన్ని ఇండియా అర్థం చేసుకోవడం లేదు. మా సైబ ర్ యోధులు భారత్‌పై దాడి చేసి ఓ క్రికెట్ స్టేడియంలోని విద్యు త్తు దీపాలను ఆర్పేశారు. దీంతో అక్కడ జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ ఆగిపోయింది. భారత్ వంతెనల నుంచి నీళ్లు విడుదలయ్యాయి’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఆపరేషన్ సిందూర్ చేపట్టినప్పుడు, మే 8న ధర్మశాలలో జరిగిన మ్యాచ్ గురించి ఆసిఫ్ వ్యాఖ్యానించి ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే ఆసిఫ్ వ్యాఖ్యలపై నెటిజన్లు వ్యంగ్యంగా స్పందించారు.