హనుమకొండ చౌరస్తా : సేంద్రియ ఎరువులతో ( Organic Products ) పండించిన పంటలను ప్రతిరోజు ఆహారంలో తీసుకోవడం వల్ల కరోనాను సైతం జయించామని ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ సుంకరి జ్యోతి (Principal Sunkari Jyoti ) అన్నారు. హనుమకొండ పబ్లిక్ గార్డెన్లో వరంగల్ గ్రామ భారతి ప్రకృతి సేంద్రియ ఎరువుల సంత ఏర్పాటు చేశారు.
ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ జ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. జంక్ ఫుడ్ బారిన పడకుండా చిన్నారులకు పోషక విలువలు కలిగిన గ్రామీణ ఉత్పత్తులను అందించాలన్నారు. ఇప్ప పువ్వుతో తయారైన లడ్డు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని పేర్కొన్నారు.
మాజీ ఎమ్మెల్యే తక్కల్లపల్లి రాజేశ్వరరావు మాట్లాడుతూ నగర ప్రజలు, రైతులు పండించే ఉత్పత్తులను వినియోగించాలని పిలుపునిచ్చారు. వరంగల్ గ్రామ భారతి అధ్యక్షులు ఎక్కటి అజిత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల ఆహారంలో మార్పులు తీసుకురావాడానికి ప్రతి నెల ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వివరించారు. ప్రజలు ఈ ఉత్పత్తులను వాడి పండించే రైతులను ప్రోత్సహించాలని కోరారు.
కార్యదర్శి చిన్నాల అనిత, కోశాధికారి బయ్యా సారయ్య, ప్రముఖ సామాజికవేత్త, మిల్లెట్ ప్రమోటర్ నిమ్మల శ్రీనివాస్ మాట్లాడుతూ ఉత్పత్తులను తీసుకువచ్చిన రైతులను నగర ప్రజలు ప్రోత్సహించాలని కోరారు.