Water Problem | పోచారం, ఫిబ్రవరి23: పోచారం మున్సిపాలిటీ లక్ష్మీనరసింహ కాలనీలో ప్రతిరోజు తాగునీరు వృథా అవుతుంది. వేసవి నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటూ ఉంటే.. ఇక్కడ మాత్రం ప్రతిరోజూ నీటి ట్యాంకు నుంచి గంటల తరబడి వృథాగా పోతున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు. దీనిపై అధికారుల దృష్టికి తీసుకెళ్లినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో అధికారుల తీరుపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తాగునీటి సరఫరా కోసం లక్ష్మీనరసింహ కాలనీలోని వాటర్ ట్యాంక్‌ను నింపి.. అక్కడి నుంచి వాల్స్ ద్వారా చుట్టుపక్కల ప్రాంతాలకు నీటిని విడుదల చేస్తారు. ట్యాంక్ నిండిన తర్వాత వెంటనే వాటర్ మ్యాన్ వాల్స్ ద్వారా నీటిని ఇండ్లకు పంపిణీ చేస్తే నీటి వృథా సరగదు. కానీ వాటర్‌మ్యాన్ మాత్రం విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నాడు. నీటి సరఫరాను సరిగ్గా పట్టించుకోకపోవడంతో ట్యాంక్ నిండిన తర్వాత గంటల తరబడి నీరు వృథాగా పోతుంది. కొద్దిరోజులుగా ఇలాగే ట్యాంక్ నుంచి నీరు వృథాగా వెళ్లిపోతుంది. దీని గురించి వాటర్‌మ్యాన్, అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు.
ఇదిలా ఉంటే.. ట్యాంక్ నిండిపోయిన తర్వాత నీళ్లు పక్కనే ఉన్న అంగన్వాడీ స్కూల్ భవనంపై పడుతున్నాయి. దీంతో పిల్లలు, టీచర్లు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ట్యాంక్ నుంచి కిందవరకు ఒక పైప్ ఏర్పాటుచేస్తే.. నిండిపోయిన తర్వాత స్కూల్ భవనంపై వాటర్ పడకుండా ఉంటుందని కూడా స్థానికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కానీ ఈ వినతిని కూడా అధికారులు పట్టించుకోవడం లేదు.