Mumbai | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): దేశంలోని మహానగరాలలో ఒకటైన ముంబైలో కూడా, పాలకులకు ముందుచూపు కొరవడడంతో ప్రజలు కష్టాలు ఎదుర్కొంటున్నారు. దేశ ఆర్థిక రాజధానిగా భావించే ముంబై నగరానికి నీటిని సరఫరా చేసే ఏడు డ్యాముల్లో నీటి నిల్వలు తరిగిపోవడంతో అక్కడి ప్రజలు నీటి కటకటను ఎదుర్కొంటున్నారు. రుతు పవనాలు రాకపోతే, సరైన సమయంలో వర్షాలు కురవకపోతే ముంబై వాసులకు అందించే నీటిలో 10 నుంచి 15 శాతం కోత తప్పదని సంబంధిత వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం గత మూడేండ్లతో పోలిస్తే ఈ ఏడాది జూన్లో అత్యల్ప నీటి నిల్వలు నమోదయ్యాయి. ముంబైకి నీటిని సరఫరా చేసే ఏడు డ్యాముల్లో ప్రస్తుతం కేవలం 7 శాతం నిల్వలే ఉన్నాయి. 2022లో ఇదే సమయంలో నీటి నిల్వలు 22 శాతం నమోదు కాగా, 2021లో 14 శాతం నీటి నిల్వలు ఉన్నాయి.
ముంబైకి మంచినీటిని సరఫరా చేసే మోదక్ సాగర్, తాన్సా, మధ్య వైతరిణి, భట్సా, విహార్, తులసి వంటి ఏడు డ్యాముల్లో మొత్తం 1,06,981 మిలియన్ లీటర్ల నీటి నిల్వలున్నాయి. అంటే 7.39 శాతం నీటి నిల్వలు మిగిలి ఉన్నాయి. ప్రస్తుతం నిల్వ ఉన్న నీరు, ముంబై ప్రజలకు మరో 27 రోజుల పాటు దాహార్తిని తీర్చేందుకు మాత్రమే సరిపోతాయి. జూలైలో మంచి వర్షాలు కురిసి డ్యాములు నిండితే తప్ప ముంబై వాసులకు నీటి సరఫరా జరగదు, వారి కష్టాలు తీరవు. అయినా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టకుండా, మీనమేషాలు లెక్కపెడుతుండటంపై ప్రజలు మండిపడుతున్నారు.