జలం.. సమస్త ప్రాణికోటికి జీవనాధారం. ఈ భూగోళంపై ప్రాణమున్న ప్రతి జీవికి గాలి తర్వాత అత్యవసరమైన వనరు ఇదే. అలాంటి నీటిని పొదుపుగా వాడుకోవడమే కాదు, ప్రతి బొట్టునూ ఒడిసిపడితేనే భవిష్యత్ తరాలు మనుగడ సాగించే అవకాశముంటుంది. లేదంటే ఉనికే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదమున్నది. అరవై ఏండ్ల ఉమ్మడి పాలనలో నీళ్ల గోసను కండ్లారా చూసిన ముఖ్యమంత్రి కేసీఆర్, అపర భగీరథుడిలా తాగు, సాగు నీటి కష్టాలను శాశ్వతంగా తీర్చారు. ఏడేండ్ల కాలంలోనే అనేక కార్యక్రమాలు చేపట్టి సక్సెస్ అయ్యారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని కేవలం మూడేళ్ల వ్యవధిలోనే పూర్తి చేసి, తెలంగాణ భూములను సస్యశ్యామలం చేశారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మండుటెండల్లోనూ జలవనరులన్నీ కళకళలాడుతున్నాయి. నాడు పాతాళానికి బోర్లు వేసినా కనిపించని భూగర్భజలాలు, నేడు పది మీటర్లలోపే ఉబికివస్తున్నాయి.
కరీంనగర్, మార్చి 21 (నమస్తే తెలంగాణ) : పెరుగుతున్న జనాభా, అందుబాటులో ఉన్న జలవనరులకు మధ్య రోజురోజుకు అంతరం పెరిగిపోతున్నది. మన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించకుంటే మున్ముందు నీటి ముప్పు పొంచి ఉన్నది. వృథాను అరికట్టకపోవడం, కాలుష్యం పెరిగిపోవడం, చట్టాలను అమలు చేయకపోవడంతో అందుబాటులో ఉన్న నీటి వనరులను వినియోగించుకోలేకపోతున్నాం. చేజేతులా మనమే సమస్యను జఠిలం చేసుకుంటున్నాం. అందుబాటులో ఉన్న జల వనరుల్లో 79.59 శాతం వ్యవసాయానికి, 13.75 శాతం విద్యుత్తు ఉత్పత్తికి, 3.47 శాతం తాగడానికి, 3.2 శాతం పరిశ్రమల నిర్వహణ కోసం వినియోగిస్తున్నాం. నేషనల్ బిల్డింగ్ కోడ్, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం ప్రతి మనిషికి రోజుకు కనీసం 135 లీటర్ల (9నుంచి 10 బకెట్లు) నీరు అవసరం. ఇందులో 10-15 లీటర్లు వంటకు, తాగడానికి, 40-45 లీటర్లు కాలకృత్యాలకు, 30-35 లీటర్లు స్నానానికి, 15-20 లీటర్లు బట్టలు ఉతుక్కునేందుకు, 10-15 లీటర్లు గిన్నెలు, వంట సామగ్రి శుభ్ర పర్చుకునేందుకు, 5-10 లీటర్లు ఇల్లు శుభ్ర పర్చుకునేందుకు వాడాలని అంచనా. ప్రస్తుతం అందుబాటులోని నీటి వనరులతో మనిషికి సగటున 78 లీటర్ల నీరు అందించడమే కష్టం. నగరాలు, పట్టణాల్లో 40 శాతం మంది మురికి వాడలు, తాత్కాలిక నివాసాల్లో జీవిస్తున్నారు. వీళ్లు నిరుపేదలుగానే కాకుండా నీటి పేదలుగా కాలం గడుపుతున్నారంటే అతిశయోక్తికాదు. నీటి వనరులను వృథా చేయడమే కారణంగా చెప్పవచ్చు.
‘2050 నాటికి ప్రపంచంలో సరిపడా తాగు నీరు ఉండదని, ప్రజలు స్నానాలు చేయడం మానేసి శరీరానికి రసాయన లేపనాలు పూసుకుంటారని, కెమికల్ బాత్‌లు చేస్తారని, తలస్నానానికి నీరు దొరక్క బోడిగుండ్లు చేయించుకుంటారని, సరిహద్దుల్లో ఉండాల్సిన సైన్యం నీటి వనరుల చుట్టూ కాపలా ఉంటుంది’ అని ఓ సందర్భంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఉటంకించారు. ఆయన చెప్పినట్లు 2050 ఎంతో దూరం లేదు. నీటిని పొదుపుగా వాడుకోవడం, సంరక్షణపై దృష్టి పెట్టాలని యునెస్కో చెబుతూనే ఉంది. నీటిని వృథా చేయడం సృష్టికి వ్యతిరేకం, సమస్త ప్రాణకోటికి నష్టదాయకం అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. పొదుపుగా వాడుకోవాలి.
ఏటా మార్చి 22న అంతర్జాతీయ జల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ తొలిసారి 1992లో నీటి వనరుల నిర్వహణపై అంతర్జాతీయంగా అవగాహన కల్పించాలని చేసిన సిఫారసు మేరకు యేటా జల దినోత్సవాన్ని జరుపుకొంటున్నారు. కానీ, గత పాలకులు ఈ విషయాన్ని పట్టించుకోలేదు. ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జల సంపద సంరక్షణపై దృష్టి పెట్టాయి. ప్రతి బొట్టునూ ఒడిసిపట్టాలని, పొదుపుగా వాడుకోవాలనే లక్ష్యంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు దేశానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. ఏడేళ్ల కాలంలో మిషన్ కాకతీయ కింద వేలాది చెరువుల పునరుద్ధరణ, కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టులు, వాగులపై చెక్‌డ్యాంలు నిర్మించి భూగర్భ జలాలు పెరిగేలా చేసింది. మరోవైపు ఉపాధి హామీ కింద ఇంకుడు, రీచార్జ్ గుంతల తవ్వకాన్ని యుద్ధప్రాతిపదికన చేపట్టి అమలు చేస్తున్నది.
సహజ వనరులను కాపాడుకోవాలనే లక్ష్యంతో 2002 ఏప్రిల్ 19 నుంచి గాలి, నీరు, భూమి, చెట్టు చట్టం (వాల్టా)ను అమలు చేస్తున్నారు. ఇందులో 6 చాప్టర్లు, 47 సెక్షన్లు, 30 నిబంధనలున్నాయి. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు చట్టం అమలును పర్యవేక్షిస్తున్నాయి. సెక్షన్ -8 రూల్ 8 ప్రకారం ప్రతి మంచినీటి, బోరు బావులకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ప్రజా మంచినీటి వనరులకు 250 మీటర్ల పరిధిలో బావుల తవ్వకాన్ని నిషేధించారు. సెక్షన్ -9, 11 ద్వారా భూ గర్భ జలాలు ఎక్కువగా వినియోగించే ప్రాంతాలను అధికారులు నోటిఫై చేయవచ్చు. వ్యవసాయం, పరిశ్రమలు ఇతర అవసరాలకు వినియోగించే బోరుబావులతో నష్టం కలుగుతున్నదని భావిస్తే సెక్షన్-12 ప్రకారం నిషేధించవచ్చు. అలాగే బోరుబావుల లోతును నిర్దేశించవచ్చు. సెక్షన్ -17 ప్రకారం 200 చదరపు గజాల పైబడి నిర్మించే ప్రతి ఇంటిలో ఇంకుడు గుంత తప్పనిసరి. సెక్షన్- 19 ప్రకారం భూగర్భ జలాలను కలుషితం చేసే పరిశ్రమలు, స్థానిక సంస్థలు, ఆక్వా ఫారాలను నియంత్రించ వచ్చు. ఉపరితల జలాలను కలుషితం చేసే పరిశ్రమలపై సెక్షన్ 20 రూల్ 19 ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. వివిధ పరిశ్రమలు ఎక్కువ నీటిని వినియోగించకుండా ఈ చట్టం సీలింగ్ విధించింది. సెక్షన్-27 ప్రకారం ఇసుక మైనింగ్‌పై ఆంక్షలను విధించింది.
నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏర్పడ్డ ప్రత్యేక తెలంగాణలో నీటి కోసం సీఎం కేసీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారు. అపర భగీరథుడిలా ప్రాజెక్టుల రూపకల్పన చేశారు. మిషన్ కాకతీయ తో చెరువులకు పునర్జీవం పోశారు. కాళేశ్వజరం ఎత్తిపోతల ప్రాజెక్టును కేవలం మూడేళ్లలోనే పూర్తి చేసి, గోదావరి జలాలను తెలంగాణ అంతటా పారిస్తున్నారు. నాడు వానకాలమే కాదు ఎండకాలం కూడా తాగు నీటికి తండ్లాడిన నేలలో ఇప్పుడు గోదారి జలాలు పరుగులు తీస్తున్నాయి. మండుటెండల్లోనూ చెరువులు, కుంటలు కళకళలాడుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఎక్కడ చూసినా భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అయితే ఏకంగా ఆరు మీటర్లు పైకి వచ్చాయి.