న్యూఢిల్లీ: భారత్, కెనడా మధ్య దౌత్య వైరం నడుస్తున్న విషయం తెలిసిందే. సిక్కు తీవ్రవాది నిజ్జర్ హత్య కేసులో భారతీయ దౌత్యవేత్తల ప్రాత ఉన్నట్లు అనుమానిస్తూ.. ఆరుగురు డిప్లమాట్లను కెనడా వెలివేసింది. ఈ నేపథ్యంలో కెనడా అధికారులు.. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌కు కీలకమైన సమాచారాన్ని అందించారు. కెనడాలో ఉన్న ఖలిస్తానీ నేత హత్య కేసులో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు సీనియర్ ఆర్అండ్ఏడబ్ల్యూ పాత్ర ఉన్నట్లు కెనడా అధికారులు తెలిపారు. అమిత్ షా, రా ఆదేశాల ప్రకారమే.. కెనడాలో ఖలిస్తానీ నేత హత్య జరిగినట్లు అమెరికాకు చెందిన వాషింగ్టన్ పోస్టు ఓ కథనాన్ని రాసింది.
ఖలిస్తానీ నేత హత్య విషయంలో భారత దౌత్యవేత్తలు సంభాషణలు జరిపారు. అయితే ఆ సంభాషణలను కెనడా అధికారులు ఇంటర్సెప్ట్ చేశారు. భారత ప్రభుత్వానికి చెందిన ఓ సీనియర్ అధికారితో పాటు ఆర్ఏడబ్ల్యూలోని సీనియర్ అధికారి ఆదేశాల ప్రకారం ఆ హత్య జరిగినట్లు కెనడా తన రిపోర్టులో తెలిపింది. భారత ప్రభుత్వ ఉన్నత అధికారిని కేంద్ర మంత్రి అమిత్ షాగా కెనడా అధికారులు గుర్తించారు. కెనడాలో జరిగిన కోవర్ట్ ఆపరేషన్‌కు షా బాధ్యతలని వెల్లడించారు. కెనడా చేసిన ఆరోపణలపై భారత ప్రభుత్వం ఇంకా స్పందించలేదు.