హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): తమ పరిధిలోని గోదాముల్లో సరుకుల నిల్వ, సరఫరాలో పారదర్శకత కోసం వాటిని జీపీఎస్‌తో అనుసంధానంచేసి, ఆన్లైన్ ట్రాకింగ్ వ్యవస్థను ఏర్పాటుచేయాలని గిడ్డంగుల కార్పొరేషన్ నిర్ణయించింది. ముఖ్యంగా రాష్ట్రం ఎఫ్‌సీఐకి అందించాల్సిన సీఎంఆర్ బియ్యానికి సంబంధించి ఈ విధానాన్ని పక్కాగా అమలు చేయనున్నారు. రాష్ట్రంలోని ప్రతి రైస్ మిల్లును గోదాములతో అనుసంధానం చేయనున్నారు. ఏ రైస్ మిల్ నుంచి ఎంత సీఎంఆర్ ఏ గోదాముకు వెళ్లింది? ఏ గోదాముకు ఎంత స్టాక్ వచ్చింది? ఎంత స్టాక్ బయటికి వెళ్లింది? వంటి వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి ట్రాక్ చేయనున్నారు.
సీఎంఆర్ డెలివరీలో పారదర్శకత పెంపొందించేందుకు గానూ కేంద్ర ప్రభుత్వం ఈ ఆన్లైన్ ట్రాకింగ్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ నెల 24లోపు అన్ని మిల్లులను, గోదాములను అనుసంధానం చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్, పౌరసరఫరాల శాఖ సంయుక్తంగా ఈ కొత్త విధానం అమలుకు చర్యలు చేపట్టాయి. కేవలం సీఎంఆర్‌కు మాత్రమే కాకుండా తమ గోదాముల్లోని అన్ని ఉత్పత్తుల నిల్వ, సరఫరాలపై ఆన్లైన్ ట్రాకింగ్ విధానాన్ని అమలుచేయాలని నిర్ణయించినట్టు గిడ్డంగుల కార్పొరేషన్ ఎండీ జితేందర్‌రెడ్డి తెలిపారు.