ఖిలావరంగల్, మార్చి 27 : చారిత్రక ఖిలావరంగల్ అగడ్త (చెరువు)ను సుందరీకరిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో అభివృద్ధి పనులు వేగం పుంజుకున్నాయి. వర్షకాలం వచ్చిందంటే చాలు అగడ్త ప్రధాన రహదారి మృత్యుకుహరంగా మారేది. వరద నీటితో అగడ్త ఉధృతంగా ప్రవహిస్తుండేది. దీంతో ఎప్పుడు ఏం ప్రమాదం ముంచుకు వస్తుందో తెలియని పరిస్థితి ఉండేది. సుమారు 600 మీటర్ల పొడవున్న అగడ్త రోడ్డు పైనుంచి రైతులు, విద్యార్థులు, స్కూల్, బస్సులు వెళ్తుంటే పోరాడుతున్నట్లే ఉండేది. దీంతో స్థానికులు వర్షాకాలం వచ్చిందంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణం చేసేవారు. ప్రతి వానకాలంలో పోలీసులు మూడు నెలల పాటు రోడ్డును మూసివేసేవారు. ఈక్రమంలో స్థానికుల వినతి మేరకు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ స్పందించి, అగడ్త సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని నిర్ణయించారు. సుందరీకరించి పక్కా రోడ్డు నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించారు. నర్సంపేట రోడ్డు నుంచి చింతల్, కోట అగడ్త మీదుగా దూపకుంట వరకు రోడ్డును విస్తరించి అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రూ.2.50 కోట్లు నిధులు మంజూరు చేయించారు. మూడేళ్ల క్రితమే పనులు ప్రారంభం కాగా, వర్షాలు ఎక్కువగా కురిసి అగడ్తలోని నీటిమట్టం తగ్గకపోవడంతో పనులు చేయడం వీలు కాలేదు. ప్రస్తుతం పనులు జరుగుతుండడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వేగంగా పనులు..
రూ.2.50 కోట్లతో ప్రారంభమైన పనులు వేగం పుంజుకున్నాయి. అగడ్తకు రిటెయినింగ్ వాల్ నిర్మాణం, కల్వర్టు, నూతన రోడ్డు పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పటికే ఆగడ్త రోడ్డుపై కల్వర్టు నిర్మించారు. ఎంత భారీ వర్షం వచ్చినా కల్వర్టు నుంచి వరద నీరు వెళ్లే విధంగా ఏర్పాట్లు చేశారు. అలాగే అగడ్త పొడవునా ప్రహరీ నిర్మాణ పనులు చేపట్టారు. వరద ప్రవాహాన్ని తట్టుకునే గోడ నిర్మా ణ పనులు చేస్తున్నారు. ఇప్పటికే 80 శాతం పనులు పూర్తికావడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు రాతికోట, మరోవైపు రిటెయినింగ్ వాల్ మధ్యలో అగడ్త చెరువు ప్రాంతం ఆహ్లాదకరంగా మారనుంది. పనులు పూర్తి చేసి బోటింగ్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
త్వరలోనే పనులన్నీ పూర్తి..
-బైరబోయిన ఉమ, 38వ డివిజన్ కార్పొరేటర్
అగడ్తను సుందరీకరించి అభివృద్ధి చేయాలనేది ఖిలావరంగల్ ప్రజల చిరకాల వాంఛ. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని సహకారంతో పనులు వేగంగా జరుగుతున్నాయి. ఎక్కువ మొత్తంలో నిధులు తీసుకువచ్చి డివిజన్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం.