వరంగల్, మార్చి 22: స్వరాష్ట్రంలోనే పేద ముస్లింలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. అన్ని కులాలు, మతాలను సమానభావంతో చూస్తున్న దమ్మున్న సెక్యులర్ లీడర్ కేసీఆర్ అని అన్నారు. మంగళవారం వరంగల్ పశ్చిమ, తూర్పు నియోజకవర్గాల మైనార్టీ సెల్ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మా ట్లాడారు. తెలంగాణలో హిందూ, ముస్లింలు సోదరభావంతో కలిసి జీవిస్తున్నారని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లింల అభ్యున్నతి కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు.
కాంగ్రెస్, టీడీపీ హయాంలో రాష్ట్రంలో కేవలం రెండు మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలుంటే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 240 మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇటీవల సీఎం కేసీఆర్ 90వేలకు పైగా ఉద్యోగాలు ప్రకటించారని, వాటిలో ముస్లిం మైనార్టీలు ఎక్కువ శాతం సాధించేలా కృషి చేయాలన్నారు. ఎంతోమంది పేద ముస్లిం విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం కోసం ఓవర్సీస్ స్కాలర్షిప్లను అందజేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనని అన్నారు. ముస్లింలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని పిలుపునిచ్చారు. పార్టీలు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా మరో 40 ఏళ్ల పాటు రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటుందని జోస్యం చెప్పారు.
కొన్ని రాజకీయ పార్టీలు మతవిద్వేషాలను రెచ్చగొట్టే కుట్రలు చేస్తున్నాయని, మతాలు, కులాల పేరిట వచ్చే పార్టీలను తరిమికొట్టాలన్నారు. సమాజంలో గౌరవం పెరిగేలా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న టీఆర్ఎస్ పార్టీకి ముస్లిం ప్రజలు అండగా నిలువాలని కోరారు. ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ.. ముస్లిం మైనార్టీల అభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకుపోతున్నదన్నారు. బీజేపీ మతవిద్వేషాలు రెచ్చగొట్టే కుట్రలు చేస్తున్నదని, తెలంగాణలో వారి ఆటలు సాగవన్నారు. తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ.. తూర్పు నియోజకవర్గంలో రూ.14కోట్లతో ఈద్గా, దర్గా, ఖబరస్థాన్‌లను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ముస్లిం మైనార్టీల కోసం షాదీఖానా, హజ్‌హౌస్, రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్మిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్, కుడా చైర్మన్ సుందర్రాజ్, కార్పొరేటర్లు సురేశజోషి, వస్కుల బాబు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్‌ఖాన్, మైనార్టీ నాయకులు నయీమొద్దీన్, ఖుద్దూస్, అక్బర్, రహెమున్నీసా బేగం, కమురున్నీసాబేగం తదితరులు పాల్గొన్నారు.
ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ప్రజలకు చేరువవ్వాలి..
సుబేదారి, మార్చి 22 : రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరమైన వరంగల్‌లో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ప్రజలకు మరింత చేరువవ్వాలని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ సూచించారు. మంగళవారం ఆయన హనుమకొండలోని వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయాన్ని సందర్శించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. కొత్తగా నిర్మిస్తున్న కమిషనరేట్ భవనాన్ని పరిశీలించారు. అమరవీరుల స్మృతివనంలో మొక్కలు నాటారు. అనంతరం కమిషనరేట్ పోలీసు అధికారులతో సమావేశమై గంజాయి, గుట్కా, ఇతర మత్తు పదార్థాల కట్టడికి, శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపై ఆరా తీయగా, సీపీ తరుణ్‌జోషి పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. శాంతిభద్రతలు, మహిళల రక్షణ విషయంలో తెలంగాణ పోలీసింగ్ దేశంలో నంబర్ స్థానంలో ఉన్నదన్నారు. కేసీఆర్ ఏడు సంవత్సరాల పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు. ఈ సమావేశంలో డీసీపీలు అశోక్‌కుమార్, వెంకటలక్ష్మి, సీతారాం, అదనపు డీసీపీలు వైభవ్‌గైక్వాడ్, భీంరావు, రాగ్యానాయక్, ఏసీపీలు, సీఐలు ఉన్నారు.
బంగారు తెలంగాణ సాధనే ధ్యేయం..
కరీమాబాద్ : సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణ సాధనే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. మంగళవారం ఉర్సు దర్గాలో ముస్లిం పెద్దలతో కలసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు. సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థనలు చేశానన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ టీఆర్ఎస్దే విజయమన్నారు. అనంతరం ముస్లిం పెద్దలతో కలసి దర్గా పీఠాధిపతులు ఉబేద్బాబా, నవీద్‌బాబా ఇంటికి వెళ్లారు. ఆయన వెంట చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, కార్పొరేటర్లు మరుపల్ల రవి, పోశాల పద్మ, మైనారిటీ నాయకులు ఎంఏ జబ్బార్, చాంద్‌పాషా తదితరులు పాల్గొన్నారు. కాగా, తెలంగాణ ఉద్యమంలో అలుపెరుగని పోరాటం చేసిన ఉద్యమకారులను గుర్తించాలని కోరుతూ కార్పొరేటర్ మరుపల్ల రవి హోంమంత్రికి వినతిపత్రం అందజేశారు.