ఖానాపురం, మార్చి 22: బృహత్ పల్లెప్రకృతి వనాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అడిషనల్ కలెక్టర్ హరిసింగ్ అన్నారు. మంగళవారం ఆయన కీర్యతండాలోని మెగా పార్కు, పల్లెప్రకృతి వనం, నర్సరీని పరిశీలించారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులను తనిఖీ చేశారు. తర్వాత ప్రాథమిక పాఠశాలను సందర్శించి ఉపాధ్యాయుల బోధనా తీరును పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బృహత్ పల్లెప్రకృతి వనానికి గేటు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. పార్కులో మొక్క లు తక్కువగా ఉన్నందున తక్షణమే మరికొన్ని నాటించాలని సూచించారు. సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలన్నారు. ఈ సందర్భంగా నర్సరీలు, జీపీల రికార్డుల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట ఎంపీడీవో సుమనావాణి, కార్యదర్శి, టీచర్లు ఉన్నారు.
ఉపాధి పనులను వినియోగించుకోవాలి
దుగ్గొండి: ఉపాధిహామీ పనులను అర్హులు వినియోగించుకోవాలని అడిషనల్ డీఆర్డీవో వసుమతి సూచించారు. బంధంపల్లి, లక్ష్మీపురంలో ఈజీఎస్ సిబ్బంది, అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి మంగళవారం ఈజీఎస్, నర్సరీ పనులను పరిశీలించారు. అనంతరం ఈజీఎస్ పథకంపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అనంతరం గ్రామంలో జరిగిన సమావేశంలో వసుమతి మాట్లాడుతూ అర్హులందరికీ వంద రోజుల పనిదినాలు కల్పించాలన్నారు. పనులను పారదర్శకంగా చేపట్టాలని సూచించారు. గ్రామాల్లో 2018-19 సంవత్సరంలో వంద రోజుల పనిదినాలు పూర్తి చేస్తున్న కుటుంబ సభ్యుల్లో ఎవరైనా 7వ తరగతి, ఆపై చదువులు పూర్తి చేసుకొని ఉంటే.. ఉన్నతి కార్యక్రమం ద్వారా వారికి శిక్షణ ఇచ్చి ఉపాధి మార్గాలు చూపిస్తామన్నారు. నర్సరీల్లో వందశాతం మొక్కలు బతికేలా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు పాండవుల సురేందర్, సునీత, కార్యదర్శులు సునీత, కొండల్‌రెడ్డి, ఈజీఎస్ అధికారులు ఈసీ రాజు, టీఏ భద్రు, ఈజీఎస్ కూలీలు పాల్గొన్నారు.
వైకుంఠధామాలను వినియోగంలోకి తేవాలి
నల్లబెల్లి: మండలంలోని అన్ని గ్రామాల్లో వైకుంఠధామాలను వినియోగంలోకి తేవాలని ఎంపీవో కూచన ప్రకాశ్ సూచించారు. బజ్జూతండాలోని క్రిమిటోరియాన్ని సందర్శించారు. పల్లెప్రగతి పనుల్లో అలసత్వం వహించొద్దన్నారు. ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా వెంటనే పరిష్కరించాలన్నారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేస్తూ గ్రామస్తులను భాగస్వామ్యం చేయాలన్నారు. ఆయన వెంట కార్యదర్శి, జీపీ సిబ్బంది ఉన్నారు.