వరంగల్, మార్చి 22: ప్రకృతి ప్రసాదిత జలవనరులకు ప్రత్యామ్నాయం లేదని, ప్రతి నీటి బొట్టునూ ఒడిసిపట్టి భావితరాలకు అందించేందుకు కృషి చేయాలని ప్రముఖ పర్యావరణ వేత్త ఠాగూర్ రతన్‌సింగ్ పిలుపునిచ్చారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా మంగళవారం వరంగల్‌లోని ఏవీవీ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఎంజీఎం దవాఖాన సెంటర్ నుంచి ఏవీవీ కళాశాల వరకు సాగిన ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. నీటి ని పరిరక్షిస్తూ పొదుపుగా వినియోగించకుంటే రాబోవు తరం వారు నీటి సంక్షోభం ఎదుర్కొంటారని తెలిపారు. అందుబాటులో ఉన్న నీటి వనరుల్లో 0.03 శాతం మాత్రమే మంచి నీరు ఉందని గుర్తుచేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వాడాలన్నారు. ర్యాలీ అనంతరం నీటిని పొదుపు చేస్తామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ భుజేందర్రెడ్డి, ప్రోగ్రాం ఆర్గనైజర్ శ్రీనివాసరావు, అధ్యాపకులు గోపి, సంజీవ, చండీశ్వర్, సీనియర్ వటింటర్లు రత్నాకర్, రాజ, ఇమ్రాన్, సమీర్, శివరాజు, నవ్య, సదాఫ్, నగేశ్, సాయి, గణేశ్, ప్రమోద్ పాల్గొన్నారు.
జీవకోటి ప్రాణులకు నీరే ధారం
నర్సంపేట/వర్ధన్నపేట/దుగ్గొండి: జీవకోటి ప్రాణులకు నీరే ప్రాణాధారమని స్వయంకృషి సంస్థ కార్యదర్శి బెజ్జంకి ప్రభాకర్ అన్నారు. నర్సంపేటలోని స్కూల్లో స్వయంకృషి సోషల్ వర్క్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నీటి పొదుపుపై అవగాహన కల్పించారు. జల వనరులు, నీటి పొదుపుపై విద్యార్థి దశ నుంచే అవగాహన కలిగి ఉండాలని సూచించారు. రిసోర్స్ పర్సన్ బొయిని వెంకటస్వామి మాట్లాడుతూ ప్రపంచ భూభాగంలో సముద్రపు నీటి శాతం ఎక్కువని, ఉన్న కొద్ది తాగునీటిని వృథా చేయొద్దన్నారు. చైల్డ్‌లైన్ ప్రతినిధి కొమ్ముల సతీశ్, జావిద్, ప్రిన్సిపాల్ ప్రకాశ్ పాల్గొన్నారు. అలాగే, వర్ధన్నపేట మండలంలోని ఉప్పరపల్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ప్రజలకు నీటి విలువ తెలిసేలా ప్లకార్డులు ప్రదర్శించారు.
అనంతరం ప్రధాన కూడళ్ల వద్ద మానవహారం నిర్వహించారు. అలాగే, బాలవికాస సాంఘిక సేవా సంస్థ, ఎన్సీసీ ఆధ్వర్యంలో కూడా ర్యాలీలు తీశారు. గ్రామ ప్రముఖులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. దుగ్గొండి మండలం తొగర్రాయి, తిమ్మంపేట, మందపల్లిలో బాలవికాస స్వచ్ఛంద సాంఘిక సేవా సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులతో ర్యాలీలు నిర్వహించారు. గ్రామ కూడళ్ల వద్ద నీటిని వృథా చేయబోమని విద్యార్థులతో ప్రతిజ్ఞలు చేయించి మానవహారాలు చేపట్టారు. తిమ్మంపేటలో సర్పంచ్ మోడెం విద్యాసాగర్‌గౌడ్ మాట్లాడుతూ నీటిని కాపాడుకోవాల్సిన అవసరం మనందరిపై ఉందన్నారు. కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
సర్పంచ్‌కు జల సైనిక్ అవార్డు
ఖానాపురం: బుధరావుపేట సర్పంచ్ కాస ప్రవీణ్‌కుమార్ ఆర్డబ్ల్యూఎస్ ఏఈ మౌనిక చేతులమీదుగా జల సైనిక్ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకాన్ని గ్రామంలో వందశాతం అమలు చేస్తున్నందునకు ప్రపంచ జల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తనకు అవార్డు అందజేశారన్నారు. ఈ అవార్డుతో తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. గ్రామంలో నీటి సంరక్షణ చర్యలు చేపడుతామన్నారు.