నర్సంపేట రూరల్, మార్చి 13 : ప్రముఖ సినీ గేయ రచయిత కందికొండ యాదగిరి అంత్యక్రియలు సోమవారం సొంతూరులో జరుగనున్నాయి. రెండేళ్లుగా గొంతు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న కందికొండ కీమోథెరపీ చేయించుకోగా స్పైనల్ కార్డ్ దెబ్బతిన్నది. ఈ క్రమంలో ఆరోగ్యం విషమించి శనివారం హైదరాబాద్‌లో మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయనకు భార్య రమాదేవి, కుమారుడు ప్రభంజన్, కూతురు మాతృక ఉన్నారు. ఆయన పార్థివదేహాన్ని హైదరాబాద్ నుంచి సొంతూరైన వరంగల్ జిల్లా నర్సంపేట మండలం నాగుర్లపల్లికి ఆదివారం సాయంత్రం 7.30గంటలకు తీసుకువచ్చారు. అంత్యక్రియలు సోమవారం ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నారు.
ఇందుకు ఏర్పాట్లు చేయాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి స్థానిక టీఆర్ఎస్ నాయకులను కాగా సొంతిల్లు కూడా లేని కందికొండ కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. అనార్యోగంతో బాధపడుతున్న ఆయనకు మంత్రి కేటీఆర్, రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఆర్థికసాయం చేసింది. తాజాగా హైదరాబాద్ చిత్రపురి కాలనీలో డబుల్ బెడ్రూం ఇల్లు, ఆ ఇంటికి సంబంధించిన అన్ని రకాల కాగితాలను, ఇంటి తాళాలను మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ చేతుల మీదుగా సోమవారం కందికొండ కుటుంబానికి హైదరాబాద్‌లో అందించారు.
పరామర్శించిన ఎమ్మెల్యే పెద్ది
కందికొండ మృతిపై ఎమ్మెల్యే పెద్ది తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. సొంతూరికి చేరిన కందికొండ పార్థివదేహంపై పూలమాల వేసి నివాళి అర్పించారు. కందికొండ మరణం సినీ ప్రపంచానికి, తెలంగాణ సమాజానికి తీరని లోటు అని అన్నారు. ఆయన తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టేలా ఎన్నో అద్భుతమైన పాటలు రచించి తెలంగాణ కీర్తిని ప్రపంచానికి చాటారని చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
అమరవీరుల స్తూపం వద్ద నివాళి
నర్సంపేట : నర్సంపేటలోని అమరవీరుల స్తూపం వద్ద ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి కందికొండ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కందికొండ రచయితగా ఈ ప్రాంతానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చారన్నారు. తెలంగాణ ఉద్యమంలో పజలను చైతన్యం చేశారన్నారు. కార్యక్రమంలో పట్టణాధ్యక్షుడు నాగెల్లి వెంకటనారాయణగౌడ్, డాక్టర్ లెక్కల విద్యాసాగర్‌రెడ్డి, నాగిశెట్టి ప్రసాద్, యువరాజు, మండల శ్రీనివాస్, పెండెం వెంకటేశ్వర్లు, శీలం రాంబాబు, పాషా, రుద్ర ఓంప్రకాశ్, దార్ల రమాదేవి పాల్గొన్నారు.