‘ఆదాయం పెంచాలి, పేదలకు పంచాలి’ అనే నినాదంతో పరిపాలన సాగిస్తున్న టీఆర్ఎస్ సర్కారు, అదే పంథాలో 2022-23 రాష్ట్ర బడ్జెట్‌ను ఆవిష్కరించింది. శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తన బడ్జెట్ ప్రసంగంలో సకల జనులకు, ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లావాసులకు తీపి కబురు చెప్పారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. దళితబంధును మరింత విస్తృతం చేయడం, పేద, మధ్యతరగతి వర్గాల సొంతింటి కలను సాకారం చేసే దిశగా నిర్ణయం తీసుకోవడంపై ఆనందం వెల్లివిరుస్తున్నది.
36వేల ఇండ్లు
పేదల సొంతింటి కల నెరవేర్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి మూడు వేల చొప్పున డబుల్ బెడ్రూం ఇండ్లను కేటాయించింది. సొంత స్థలంలో ఇండ్లు కట్టుకునే వారికి ప్రభుత్వం రూ.3 లక్షల చొప్పున ప్రభుత్వం అందించనుంది. ఉమ్మడి జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 36వేల ఇండ్లు పేదలకు అందనున్నాయి.
24వేల కుటుంబాలకు దళితబంధు
దళితబంధు పథకం కింద ఉమ్మడి జిల్లాలో ఎక్కువ మంది లబ్ధి పొందనున్నారు. ప్రస్తుతం అసెంబ్లీ నియోజకవర్గానికి 100 మంది చొప్పున ఈ పథకంతో లబ్ధి పొందుతున్నారు. తదుపరి దశలో రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల మందికి పథకం అందించేలా ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో కొత్తగా 24 వేల కుటుంబాలకు దళితబంధు అందే అవకాశముంది.
బాలింతలకు మేలు
జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని బాలింతలు ఎక్కువగా రక్తహీనతతో ఇబ్బంది పడుతున్న విషయం వెలుగు చూసింది. ఈ లోపాన్ని నివారించేందుకు ‘కేసీఆర్ న్యూట్రిషియన్ కిట్’ పేరుతో పోషకాలతో కూడిన కిట్‌ను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రెండు జిల్లాలోని పేద, మధ్య తరగతి మహిళలకు ఈ పథకంతో ఎంతో మేలు కలుగనుంది.
పామాయిల్ సాగు.. ఇక జోరు
రాష్ట్ర వ్యాప్తంగా 2.50 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగు చేపట్టేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందిందిచి రూ.వెయ్యి కోట్లు కేటాయించింది. సాగునీటి వసతి ఎక్కువగా ఉన్న ములుగు, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ జిల్లాలో ఈ పంట సాగు జోరందుకునేందుకు ఇది దోహదపడనుంది.
హెల్త్‌సిటీగా వరంగల్
వరంగల్ నగరాన్ని హెల్త్‌సిటీగా అభివృద్ధి చేసేందుకు బడ్జెట్లో ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చింది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కోసం రూ.1100 కోట్లు కేటాయించింది. ఈ యేడాది జనగామ, భూపాలపల్లి జిల్లాలకు మెడికల్ కళాశాలలు మంజూరు చేసింది. 2023లో వరంగల్, ములుగు జిల్లాలకు మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే హనుమకొండ జిల్లాలో కాకతీయ మెడికల్ కాలేజీ ఉంది. మహబూబాబాద్‌లో కొత్త మెడికల్ కళాశాల నిర్మాణ దశలో ఉంది. గ్రేటర్ వరంగల్‌తో పాటు మున్సిపాలిటీల్లోనూ బస్తీ దవాఖానలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో 61 మార్చురీల ఆధునీకరణకు రూ.32.50కోట్లు కేటాయించగా ఉమ్మడి జిల్లాలోని పలు మార్చురీలకు వసతులు సమకూరనున్నాయి.
139 పంచాయతీలకు భవనాలు
ఆదివాసీ, గిరిజన తండాల్లో కొత్తగా గ్రామ పంచాయతీ భవనాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 1,326 జీపీలు ఉండగా, ఉమ్మడి జిల్లాలో 139 తండా పంచాయతీలకు కొత్త భవనాలు అందుబాటులోకి రానున్నాయి.
బడుగు బలహీన వర్గాల జీవితాలను మార్చే బడ్జెట్
ఇది బడుగు బలహీన వర్గాల జీవితాలు మార్చే బడ్జెట్. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా సంక్షేమం, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం సంతోషకర విషయం. రాష్ట్రంలో ఒక మహిళా విశ్వవిద్యాలయాన్ని, అటవీ విశ్వవిద్యాలయాలను, ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాశాలను నెలకొల్పుతామని ప్రకటించడం గొప్ప విషయం.
– టీజీఓ ఉమ్మడి వరంగల్ జిల్లా కో ఆర్డినేటర్ ఎ.జగన్మోహన్రావు
‘సమ్మక్క’ బరాజ్ అందుబాటులోకి
ఉమ్మడి జిల్లాలో ప్రతి ఎకరాకు సాగునీటిని అందించే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో తుపాకులగూడెం వద్ద సమ్మక్క బరాజ్ నిర్మించారు. దీనిని త్వరలోనే ప్రారంభించనున్నట్లు బడ్జెట్లో ప్రకటించారు. ఇది అందుబాటులోకి వస్తే దేవాదుల ప్రాజె క్టు ద్వారా గోదావరి జలాలు అంది సుమారు 12లక్షల ఎకరాలు స్థిరీకరణకు నోచుకోనున్నాయి.
79,227మందికి కొత్తగా ‘ఆసరా’
వృద్ధాప్యంలో పేదలకు అండగా నిలిచేందుకు ప్రస్తుతం 65 ఏండ్లకు ఉన్న ఆసరా పథకాన్ని 57 ఏండ్లకు ప్రభుత్వం కుదించింది. ఈ మేరకు ఆరు జిల్లాల్లో కలిపి 79,227 మందికి కొత్తగా ‘ఆసరా’ అందనుంది. ఇప్పటికే ఆరు జిల్లాల్లో కలిపి 4.61 లక్షల మంది ఆసరా పింఛన్లు పొందుతున్నారు.
చేనేత వర్గాలకు భరోసా
దేశంలో ఎక్కడా లేనివిధంగా చేనేత బీమా పథకానికి శ్రీకారం చుట్టడం చేనేత వర్గాలలో భరోసా నింపుతుంది. సీఎం కేసీఆర్ చేనేత కార్మికుల అభ్యున్నతి కోసం అద్భుతమైన పథకాన్ని ప్రకటించారు. ఏ ప్రభుత్వం కూడా ఆలోచన చేయని విధంగా నేతన్నల కోసం రూ.5లక్షల బీమా పథకం తీసుకొస్తున్న తెలంగాణ సర్కారుకు ప్రత్యేక కృతజ్ఞతలు.
– కొలిపాక మధునయ్య, మట్టెవాడ చేనేత పారిశ్రామిక సంఘం మాజీ అధ్యక్షుడు
కాళేశ్వరం టూరిజం సర్యూట్
కొత్తగా నిర్మించిన జలాశయాలన్నీ ప్రకృతి రమణీయ ప్రదేశాల్లో ఉన్నాయి. ప్రాజెక్టుల పరిధిలోని జలాశయాల సందర్శన కోసం వచ్చే పర్యాటకుల కోసం అవసరమైన వసతులు ఏర్పాటు చేయాలని ప్ర భుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా కాళేశ్వరం సర్క్యూట్లో టూరిజం అభివృద్ధికి రూ.1500 కోట్లు కేటాయించింది.
నేతన్నలకు బీమా
రైతు బీమా తరహాలో నేత కార్మికుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నేత బీమా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ పథకంతో హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో ఎక్కువగా ఉన్న నేత కుటుంబాలకు భరోసా దొరకనుంది.
1.24లక్షల మంది బాలికలకు ప్రయోజనం
ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో ఏడో తరగతి నుంచి 12వ వరకు చదివే బాలికలకు ‘హెల్త్ అండ్ హైజెనిక్ కిట్ల’ను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఉమ్మడి జిల్లాలో 1.24 లక్షల మంది బాలికలు ఉండగా వీరికి ఈ పథకంతో ప్రయోజనం కలుగనుంది.
భవన నిర్మాణ కార్మికులకు మోటర్ సైకిళ్లు
భవన నిర్మాణ కార్మికులు పని కోసం వెళ్లేందుకు వీలుగా మోటర్ సైకిళ్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ తర్వాత ఎక్కువ మంది పని చేసే వరంగల్ నగరంలో ఎక్కువ మందికి ఈ పథకంతో లబ్ధి చేకూరనుంది.
మహిళలకు ఆసరా..
మహిళ సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కోసం రూ.2750కోట్లు కేటాయించడం హర్షణీయం. ఒంటరి మహిళలు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రతినెలా నగదు అందించే ఆసరా పథకానికి రూ.11,728 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించింది. అన్ని విధాలా ఆదుకుంటున్న సర్కారుకు మహిళాలోకం రుణపడి ఉంటుంది.
– తేజావత్ శారద, జిల్లా స్టాండింగ్ కమిటీ చైర్మన్
సర్కారు బడులు బలోపేతమవుతాయి..
ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న మన ఊరు-మన బడి కార్యక్రమానికి బడ్జెట్లో రూ.7289కోట్లు కేటాయించడం హర్షణీయం. ఫలితంగా పేద, మధ్యతరగతి విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన బోధన, నాణ్యమైన భోజనం అందుతుంది.
– గుడిపూడి నవీన్‌రావు,మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్
సొంతింటికి సాయం బాగుంది..
ఇప్పటివరకు అర్హులైన పేదలకు ప్రభుత్వమే స్థలం కొని, అందులో డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి ఇస్తున్నది. ఇక నుంచి డబుల్ ఇళ్లతో పాటు సొంత స్థలం ఉంచి ఇల్లు నిర్మించుకునే స్థోమత లేని వారికి ప్రభుత్వం రూ.3లక్షలు ఇవ్వడం బాగుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఎంతోమంది పేదలకు మేలు జరుగుతుంది. సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం.
– రచ్చ అనిల్, కురవి
మహిళా యూనివర్సిటీ ఏర్పాటు అభినందనీయం..
రాష్ట్రంలో తొలిసారి మహిళా యూనివర్సిటీకి నిధులు కేటాయించడం అభినందనీయం. అంతర్జాతీ మహిళా దినోత్సవాలు జరుపుకుంటున్న వేళ మహిళలకు ఉన్నత విద్యను అందించేందుకు రూ.100 కోట్లతో యూనివర్సిటీ ఏర్పాటు నిర్ణయం సీఎం కేసీఆర్‌కే సాధ్యం. మహిళాలోకం ఎంతో ఆనందించదగ్గ విషయం. – మబ్బు కరుణాకర్, కళ్లెం, ఓయూ విద్యార్థి జేఏసీ నాయకుడు
చేనేత బీమాతో భరోసా
కార్పొరేట్ శక్తుల కారణంగా చేతివృత్తిదారులైన చేనేత రంగం ఆర్థికంగా ఇబ్బందులు పడుతోంది. ఈ తరుణంలో బీసీ సంక్షేమం ద్వారా అండగా నిలుస్తూనే రైతుబీమా మాదిరిగా చేనేత బీమా ద్వారా రూ.5లక్షల బీమా సౌకర్యం కల్పించడం గొప్ప విషయం. సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి బీసీలతో పాటు అన్ని వర్గాల ప్రజల ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయి.
– దేవరశెట్టి లక్ష్మీనారాయణ
కార్మిక పక్షపాతి సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ కార్మికుల నాయకుడు. కష్టజీవుల కష్టసుఖాలు తెలిసిన మనిషి. వారి జీవితాలు బాగుపడాలని భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి కొత్త పథకం ప్రవేశపెట్టడం సంతోషంగా ఉంది. కార్మికులకు మోటార్ సైకిళ్లు బడ్జెట్లో ప్రతిపాదించి వారికి భరోసా ఇవ్వడం మంచి నిర్ణయం. మొదటి విడుతలో రాష్ట్రవ్యాప్తంగా లక్షమందిని ఎంపిక చేయనున్నారు.
– తాటి సత్యనారాయణ, తెలంగాణ బిల్డింగ్ పెయింటింగ్ ,మేస్త్రీ అండ్ వర్కర్స్ యూనియన్ హనుమకొండ అధ్యక్షుడు
దేశంలో ఎక్కడాలేని పథకాలు..
సీఎం కేసీఆర్ దేశంలోనే ఎక్కడాలేని సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ అందరికీ మేలు చేస్తున్నాడు. ఇతర దేశాలు సైతం మనవైపు చూసేలా చేస్తున్నారు. అందరికీ సముచితస్థానం కల్పిస్తూ వారి ఆర్థికంగా తోడ్పడుతున్నారు. సొంత స్థలం ఉన్న వారికి ఇల్లు కట్టుకోవడానికి రూ.3 లక్షలు, భవన నిర్మాణ కార్మికులకు మోటార్ సైకిళ్లు ఇస్తామని ప్రకటించడం సంతోషంగా ఉంది.
– పొలంపల్లి వినయ్‌కుమార్, హనుమకొండ
వ్యవసాయరంగానికి పెద్దపీట
రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయరంగానికి పెద్దపీట వేశారు. ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం సోమవారం ప్రకటించిన బడ్జెట్లో రూ.24,254కోట్లు కేటాయించడం శుభపరిణామం. గతంలో ఇచ్చిన హామీ మేరకు ఈ ఏడాది రూ.75వేల లోపు వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తున్నట్లు బడ్జెట్లో ప్రకటించడాన్ని యావత్ రైతాంగం స్వాగతిస్తుంది. సీఎం కేసీఆర్‌కు, ఆర్థిక మంత్రి హరీశ్‌రావుకు, ప్రభుత్వానికి ధన్యవాదాలు.
– కన్నా సోమశేఖర్, రైతు, జఫర్గౌడ్
దళితుల రాత మార్చే బడ్జెట్
ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రవేశపెట్టిన బడ్జెట్లో దళితబంధుకు అత్యధిక నిధులు కేటాయించడం హర్షణీయం. ఈ ఏడాది 11,800 కుటుంబాలకు రూ.17,700కోట్లు కేటాయించడం వల్ల దళితుల జీవితాలు బాగుపడనున్నాయి. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో దళితులు సమగ్రాభివృద్ధిని సాధిస్తారు. వారికి ఉపాధిని, ఆత్మగౌరవాన్ని, వికాసాన్ని చేకూర్చే గొప్ప పథకంగా దళితబంధు చరిత్రలో నిలిచిపోతుంది. అత్యధిక నిధులు కేటాయించిన బడ్జెట్ దేశానికే దిశ చూపే బడ్జెట్.
– సూదమల్ల విష్ణువర్దన్, పరకాల
సొంతింటి కల నెరవేరుతుంది..
పేదల సొంతింటి కల సాకారం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం సంతోషం. సొంత స్థలం ఉన్న పేదలు ఇల్లు కట్టుకునేందుకు రూ.3లక్షల ఆర్థిక సహాయం అందించేలా బడ్జెట్లో రూ.12వేల కోట్లు కేటాయించడం శుభపరిణామం. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయంతో పేద ప్రజలు సొంతింటి కల నెరవేరుతుంది. రాష్ట్ర ప్రజలు సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటారు.
– ఇంగిలి వీరేశ్‌రావు, పరకాల
మహిళలపై కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ
తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు రక్షణ పెరిగింది. షీటీములను ఏర్పాటుచేయడం, లైంగిక వేధింపుల బాధితుల కోసం భరోసా, సఖీ కేంద్రాల ద్వారా భరోసా పెంచుతున్నది. తల్లీబిడ్డల సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ కేసీఆర్ కిట్స్ ఇవ్వడం వల్ల ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. అంగన్వాడీ సెంటర్లలో ఆరోగ్యలక్ష్మి పథకంతో బలవర్థక ఆహారం అందిస్తోంది. తద్వారా ప్రసూతి మరణాల రేటు, శిశు మరణాల రేటు తగ్గింది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి.
– బత్తుల జ్యోత్స్న, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, హనుమకొండ