సంగెం, మార్చి 7 : ‘ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో పోలీస్ ఉద్యోగంలో చేరాను. సవాళ్లతో కూడుకున్న ఉద్యోగమే అయినా సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తున్నా. కుటుంబ బాధ్యతలు, వృత్తి నిర్వహణ.. ఇలా రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నా. మహిళలు కూడా అన్ని రంగాల్లో మగవారితో సమానంగా రాణించాలి.’ అని సంగెం ఎస్సై దుద్దుకూరి హరిత అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’లో ప్రత్యేక కథనం.. ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాచలంలో పుట్టిన దుద్దుకూరి హరిత ప్రాథమిక స్థాయి విద్యను అక్కడే చదివింది.
ఇంటర్ నారాయణ కళాశాలలో, బీటెక్ ఉస్మానియూ యూనివర్సిటీలో 2016లో పూర్తి చేసింది. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున జాబ్ నోటిఫికేషన్స్ వేయడంతో పోటీ పరీక్షలకు సిద్ధమైంది. 5 ప్రభుత్వ ఉద్యోగాలను సాధించింది. కమ్యూనికేషన్స్ ఎస్సై, ఎక్సైజ్ ఎస్సై, సివిల్ ఎస్సై, పంచాయతీ కార్యదర్శి, మైనింగ్ డిపార్ట్ మెంట్లో ఉద్యోగాలకు అర్హత పొందింది. మొదట మైనింగ్ డిపార్ట్మెంట్లో 2 నెలలు ఉద్యోగం చేసింది. తర్వాత కమ్యూనికేషన్స్, ఎక్సైజ్ ఎస్సై, పంచాయతీ కార్యదర్శి పోస్టులను పక్కన పెట్టి సివిల్ ఎస్సై ఉద్యోగంలో చేరింది. శిక్షణ అనంతరం జనగామ జిల్లా తరిగొప్పులలో మొదటి పోస్టింగ్ ఇచ్చారు. రెండేళ్ల పాటు అక్కడ విధులు నిర్వర్తించిన అనంతరం బదిలీపై సంగెం ఎస్సైగా వచ్చారు.
రిస్కు.. గౌరవం రెండూ ఎక్కువే..
‘పోలీసు ఉద్యోగం రిస్క్ జాబే అయినప్పటికీ ప్రజలు కూడా అదే స్థాయిలో గౌరవం ఇస్తారు. శాంతి భద్రతల పరిరక్షణలో ఉన్నతాధికారుల ఆదేశాలను పాటించడం ప్రథమ కర్తవ్యంగా భావిస్తాను. రాత్రింబవళ్లు డ్యూటీ, పెట్రోలింగ్, బందోబస్త్ డ్యూటీలు చేయడం అలవాటు అయింది. సంగెం మండలంలోని కాపులకనపర్తి బ్రాందీషాపులో చోరీ జరిగిన 24 గంటల్లోనే దొంగలను పట్టుకున్నాను. భార్యాభర్తల మధ్య వచ్చిన గొడవలను కౌన్సెలింగ్ ఇచ్చి పరిష్కరించిన సందర్భాల్లో చెప్పలేని సంతోషం కలిగేది.’ అని హరిత చెప్పారు.
అమ్మ వల్లే ఈ స్థాయికి..
చిన్నతనంలో నాన్న చనిపోయాడు. అమ్మే నన్ను, చెల్లిని చదివించింది. అనేక కష్టాలకోర్చి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన అమ్మ రుణం తీర్చుకోలేనిది. పెళ్లి అయ్యాక అమ్మతో పాటు, అత్తమ్మ మా ఏడాది పాపను చక్కగా చూసుకుంటున్నారు. నేను ఈ ఉద్యోగం చేస్తున్నానంటే కుటుంబసభ్యులు, అధికారుల ప్రోత్సాహం వల్లే. మా బంధువుల అమ్మాయిలు నన్ను ఆదర్శంగా తీసుకుని ఉన్నత ఉద్యోగాల కోసం పోటీ పడుతున్నారు. అలాగే, యువత చెడు అలవాట్లను వీడి ఉన్నతస్థాయికి ఎదగాలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.