ములుగు, మార్చి 5 (నమస్తే తెలంగాణ)/నర్సంపేట రూరల్/పరకాల : ఉమ్మడి జిల్లాలో శనివారం ఆరోగ్య పండుగ జరిగింది. రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్ల ఆధ్వర్యాన వైద్యరంగంలో నవశకం మొదలైంది. రాష్ట్రంలోనే పైలట్ పైజెక్టు కింద ములుగు జిల్లాలో ‘హెల్త్ ప్రొఫైల్’ను మంత్రి హరీశ్ లాంఛనంగా ప్రారంభించారు. ములుగులోని ప్రేమ్‌నగర్‌లో కొత్త ప్రభుత్వ వైద్యశాల భవన సముదాయ నిర్మాణం, రేడియాలజీ ల్యాబ్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ములుగు ప్రభుత్వ దవాఖానలో ఆక్సిజన్ ప్లాంట్, పీడియాట్రిక్ సెంటర్, ఐసీయూ, సీటీ స్కాన్ మిషన్‌ను ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్లో హెల్త్ ప్రొఫైల్ సర్వేను ప్రారంభించి, నలుగురికి హెల్త్ ప్రొఫైల్ కార్డులు అందించారు.
అమెరికా, యూరప్ లాంటి దేశాల్లోనే ఇలాంటి కార్యక్రమం ఉందని, మన రాష్ట్రంలోనూ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని హెల్త్ ప్రొఫైల్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడా శ్రీకారం చుట్టారని, ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాల నమోదు కోసం రూ.10కోట్లు కేటాయించారని మంత్రి హరీశ్ వెల్లడించారు. అనంతరం వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణం సర్వాపురం శివారు నర్సంపేట-కొత్తగూడ ప్రధాన రహదారిలోని దామెర చెరువు సమీపంలో 330 పడకల జిల్లా స్థాయి వైద్యశాల భవనం, టీ-డయాగ్నొస్టిక్ హబ్, 26 హెల్త్ సబ్ సెంటర్ల భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఇక్కడే మొక్కలు నాటి నీళ్లు పోశారు. అంతకు ముందు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా క్రీడోత్సవాలను ప్రారంభించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. తర్వాత హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాల ఆవరణలో 100 పడకల దవాఖాన భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు.
వరాల జల్లు
నర్సంపేటలో ఒక్కో సబ్ సెంటర్‌కు రూ.20లక్షలు కేటాయించడంతో పాటు మరో 13 ఏఎన్ఎం సబ్ సెంటర్లు మంజూరు చేస్తామని మంత్రి హరీశ్ పేర్కొన్నారు. నెక్కొండ, దుగ్గొండి మండలాల పీహెచ్సీలో మెరుగైన సదుపాయాలు కల్పిస్తామన్నారు. మాదన్నపేట మినీ ట్యాంక్‌బండ్ అభివృద్ధి కోసం రూ.10కోట్ల నిధులను వెంటనే మంజూరయ్యేలా చూస్తానని భరోసా ఇచ్చారు. వరంగల్ నగరాన్ని హెల్త్ సిటీగా మార్చేలా సీఎం కేసీఆర్ రూపొందించిన ప్రణాళికలను అమలు చేస్తున్నామని, రూ.1100 కోట్లతో ఓరుగల్లు నగరంలో 24 అంతస్తులతో అతి పెద్ద వైద్యశాలను నిర్మిస్తున్నామని, ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయిందని, త్వరలోనే పనులు మొదలవుతాయని చెప్పారు. కార్యక్రమాల్లో ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, బస్వరాజు సారయ్య, నర్సంపేట, వర్ధన్నపేట, పరకాల, వరంగల్ తూర్పు, ములుగు ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, నన్నపునేని నరేందర్, సీతక్క, జడ్పీ అధ్యక్షులు గండ్ర జ్యోతి, కుసుమ జగదీశ్, రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్రావు, రాష్ట్ర దివ్యాంగుల సహకార సంస్థ చైర్మన్ కే వాసుదేవారెడ్డి, టీఎస్ఎండీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, డీసీసీబీ, ఓడీసీఎంఎస్ చైర్మన్లు ఎం రవీందర్రావు, రామస్వామినాయక్, కలెక్టర్లు బీ గోపి, రాజీవ్‌గాంధీ హన్మంతు, కృష్ణ ఆదిత్య, మాజీ ఎంపీ సీతారాంనాయక్ తదితరులు పాల్గొన్నారు.
భారీగా తరలివచ్చిన ప్రజలు
నర్సంపేట, పరకాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలకు టీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. అంతకు ముందుకు ఆయా చోట్ల మంత్రులకు పుష్పగుచ్ఛాలు ఇచ్చి, బోనాలు, కోలాటాలతో ఘన స్వాగతం పలికారు.
హెల్త్ ప్రొఫైల్ నమోదు ఇలా..
ఒక్కో బృందంలో ఇద్దరు ఏఎన్ఎమ్లు, ముగ్గురు ఆశ వరర్లు, మెడికల్ ఆఫీసర్, వైద్య ఆరోగ్య సిబ్బంది ఉంటారు. వీరు ఇంటింటికీ తిరుగుతూ ప్రతి ఒకరి ఆరోగ్య వివరాలు సేకరిస్తారు. బీపీ, షుగర్, రక్త నమూనా, దీర్ఘకాలిక, స్వల్పకాలిక వ్యాధుల వివరాలను ప్రభుత్వం అందించిన స్మార్ట్ ఫోన్ల ద్వారా ఆన్లైన్లో ‘ఈ హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్ట్’లో అప్లోడ్ చేస్తారు. ఇలా ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలు డిజిటలైజ్ అవుతాయి. ఆధార్ లేదా సెల్ నంబర్ ఎంటర్ చేయగానే వివరాలు తెలుస్తాయి. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వైద్యం అందించేందుకు హెల్త్ ప్రొఫైల్ ఎంతో ఉపయోగపడుతుంది. ప్రతి ఒకరికీ డిజిటల్ హెల్త్ కార్డు అందిస్తారు.
ప్రారంభోత్సవాలు.. శంకుస్థాపనలు ములుగు జిల్లా కేంద్రంలో..
రూ.42కోట్లతో 250 పడకల కొత్త ప్రభుత్వ వైద్యశాల భవనం, రూ.60 లక్షలతో రేడియాలజీ ల్యాబ్‌కు శంకుస్థాపన చేశారు.
రూ.31 లక్షలతో ఏర్పాటు చేసిన 40 పడకల పీడియాట్రిక్ యూనిట్, రూ.2.14కోట్లతో ఏర్పాటైన సీటీ స్కాన్, రూ.60లక్షలతో నిర్మించిన ఆక్సిజన్ ప్లాంట్‌ను ప్రారంభించారు.
వరంగల్ జిల్లాలో..
నర్సంపేట మండలం సర్వాపురం శివారు దామెర చెరువు సమీపంలో రూ.66కోట్లతో సుమారు పదెకరాల స్థలంలో నిర్మించే 330 పడకల దవాఖాన భవనానికి శంకుస్థాపన చేశారు.
నర్సంపేట పట్టణం, చుట్టుపక్కల గ్రామాల్లో నిర్మించే 26 ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల భవనాల నిర్మాణ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
రూ.1.18కోట్లతో నిర్మించే టీ డయాగ్నొస్టిక్ సెంటర్‌కు శంకుస్థాపన చేశారు.
మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నర్సంపేటలో ఆరు రోజుల పాటు నిర్వహించే మహిళా క్రీడా పోటీలను ప్రారంభించారు.
బహిరంగ సభలో ప్రసంగించారు.
హనుమకొండ జిల్లాలో
పరకాల మండలకేంద్రంలో రూ.35.30 కోట్లతో నిర్మించే 100 పడకల దవాఖాన భవనానికి శంకుస్థాపన చేశారు. పరకాల జూనియర్ కళాశాల గ్రౌండ్లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు.