వరంగల్‌చౌరస్తా, మార్చి 5: ప్రతి విద్యార్థి జ్ఞానాన్ని సముపార్జించేందుకు గ్రంథాలయాలు ఎంతగానో ఉపయోగపడుతాయని జిల్లా విద్యాశాఖ అధికారి డీ వాసంతి అన్నారు. మట్టెవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం ఆమె రీడ్ క్యాంపెయిన్ ప్రోగ్రాంను ప్రారంభించారు. ఈ సందర్భంగా సంచార గ్రంథాలయ వాహనాన్ని ప్రారంభించారు. అనంతరం డీఈవో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన సంచార గ్రంథాలయాల నిర్వహణకు ప్రేరణ ఫౌండేషన్ ముందుకు రావడం అభినందనీయన్నారు. రాష్ట్రంలో ప్రథమంగా వరంగల్ జిల్లాలోనే ఈ సంచార గ్రంథాలయాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.
విద్యార్థుల్లో పుస్తక పఠన నైపుణ్యాలు, ఆసక్తిని మెరుగుపరచడం కోసం జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ సంచార గ్రంథాలయాన్ని అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించారు. ఆసక్తి కలిగిన విద్యార్థులకు కోరిన అంశాలకు సంబంధించిన పుస్తకాలను అందుబాటులో ఉంచుతామన్నారు. శాస్త్ర, విజ్ఞాన, చరిత్ర, భూగోళ, జంతు, ఆర్థిక శాస్ర్తాలు, కథలు, సాంకేతిక అంశాలకు సంబంధించిన పుస్తకాలు, కరెంట్ అఫైర్స్ సమాచారాన్ని అందుబాటులో ఉంచడానికి ఏర్పాట్లు చేశామన్నారు.
ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేరుస్తాం
విద్యార్థుల్లో పఠనాసక్తి, నైపుణ్యాలను పెంచడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన రీడ్ ప్రోగ్రాంకు కన్వనర్‌గా తనను నియమించడం ఆనందంగా ఉందని టీవీ అశోక్‌కుమార్ అన్నారు. ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకోవడానికి తనవంతు కృషి చేస్తానన్నారు. ముందుగా విద్యార్థులకు అవసరమయ్యే ఐదు వేల రూపాయల విలువైన పుస్తకాలను సంచార గ్రంథాలయానికి త్వరలో అందజేస్తానన్నారు. ప్రస్తుతం వివిధ శాస్ర్తాలకు సంబంధించిన సుమారు రెండు వేల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వాటి సంఖ్యను పది వేలకు చేర్చడానికి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. అనంతరం డీఈవో రీడ్ క్యాంపెయిన్ ప్రోగ్రాం కన్వీనర్‌గా టీవీ అశోక్‌కుమార్‌కు నియామక ఉత్తుర్వులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ కార్యదర్శి కృష్ణమూర్తి, హెచ్ఎం పూసారాం, ప్రేరణ ఫౌండేషన్ అధ్యక్షుడు ఉపేందర్‌రెడ్డి, సామాజికవేత్త బూర రాంచందర్, ఎన్ శ్రీనివాస్, సంపత్ పాల్గొన్నారు.