వర్ధన్నపేట, నవంబర్ 16 : ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తర్వాత రైతులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండ గా నిలుస్తున్నదని పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండలంలోని దమ్మన్నపేట గ్రామంలో డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్‌రావుతో కలిసి బుధవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నదన్నారు. మహిళ, సహకార సంఘాల ఆధ్వర్యంలో ప్రతీ గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. రైతులు కేంద్రాలకు నిబంధనల ప్రకారం ధాన్యం తీసుకువచ్చి విక్రయించుకోవాలన్నారు. నిర్వహకులు రైతులను ఇబ్బందులకు గురిచేయవద్దని సూచించారు. గ్రేడ్-ఏ రకం ధాన్యానికి రూ.2060లు, గ్రేడ్-బీ రకానికి రూ.2040 మద్దతు ధరను ప్రభుత్వం చెల్లించనున్నదని తెలిపారు. ధాన్యాన్ని కొనుగోలు చేసిన వారం రోజుల్లోపే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నట్ల వివరించారు.
మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 42 మంది లబ్ధిదారులకు క్యాంపు కార్యాలయంలో కల్యాణలక్ష్మి చెక్కులు, మరో ఏడుగురికి రూ.2.79లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల జీవన, ఆర్థిక పరిస్థితులపై సీఎం కేసీఆర్‌కు పూర్తిస్థాయిలో అవగాహన ఉండడం వల్లే మంచి సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్నారన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పాలన సాగిస్తున్నారని చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు నిత్యం ప్రజల్లో ఉంటూ సంక్షేమ పథకాలను అర్హులైనవారికి అందేలా చూడాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, వైస్ ఎంపీపీ చొప్పరి సోమలక్ష్మి, పీఏసీఎస్ చైర్మన్ రాజేశ్‌ఖన్నా, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తూళ్ల కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.