రైతుల పాలిట శాపంగా మారిన కల్తీ విత్తనాలు, ఎరువులపై ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లా వ్యవసాయ శాఖ, విత్తనాభివృద్ధి సంస్థ, పోలీస్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఇటీవల ఏర్పాటైన ‘టాస్క్‌ఫోర్స్’ టీం అక్రమార్కుల భరతం పడుతున్నది. ఫర్టిలైజర్ దుకాణాలు, గోదాముల్లో నిరంతరం తనిఖీలు చేపట్టి కల్తీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే చీటింగ్ కేసులు నమోదు చేస్తున్నారు. అవసరమైతే పీడీ యాక్ట్‌ల నమోదుకూ వెనుకాడడం లేదు.
జిల్లా కేంద్రంలోని జేకేఎస్ అగ్రిమాల్‌లో ఇటీవల టాస్క్‌ఫోర్స్ టీం తనిఖీలు నిర్వహించగా, ైగ్లెఫోసెట్ గడ్డి మందులు లభించడంతోపాటు కాలపరిమితి దాటిన కూరగాయలు, పత్తి విత్తనాలు లభించాయి. దీంతో షాపునకు ‘స్టాప్ సేల్ నోటీసు’, చీటింగ్ కేసు నమోదు చేశారు. జిల్లాలో ఎక్కడైనా కల్తీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు విక్రయిస్తున్నట్లు సమాచారం తెలిస్తే టాస్క్‌ఫోర్స్ టీం సెల్‌ఫోన్ నంబర్ 9491089125 సమాచారం అందించాలని సంబంధిత శాఖ అధికారులు కోరుతున్నారు.
జనగామ చౌరస్తా, జూన్ 4 : రైతుల పాలిట శాపం గా మారిన కల్తీ విత్తనాలు, ఎరువులపై ఉక్కుపాదం మోపడానికి జనగామ జిల్లా వ్యవసాయ శాఖ, విత్తనాభివృద్ధి సంస్థ, పోలీస్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఇటీవల ‘టాస్క్‌ఫోర్స్’ టీం ఏర్పాటైంది. ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా అక్రమాలకు పాల్పడుతున్న ఫర్టిలైజర్ షాపులపై చీటింగ్ కేసులు నమోదు చేయడంతో పాటు స్టాప్ సేల్ నోటీసులు ఇస్తున్నారు.
జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ టీం నిరంతరం ఫర్టిలైజర్ దుకాణాలు, గోదాముల్లో తనిఖీలు నిర్వహిస్తోంది. కల్తీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా రైతులు రశీదు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు. రశీదు ఉంటేనే రైతుకు పంట నష్టం వాటిల్లినప్పుడు ప్రభుత్వం నుంచి ఆర్థికసాయం పొందే అవకాశం ఉంటుందని వివరిస్తు న్నారు. అదేవిధంగా విత్తన ప్యాకెట్లపై ఎక్కడ తయారు చేశారు, మొలక శాతం, జన్యు స్వచ్ఛత తదితర విషయాలకూ రైతులు పరిశీలించాలన్నారు. కల్తీ విత్తన బెడద నుంచి కాపాడేందుకు టాస్క్‌ఫోర్స్ టీం తనిఖీలు నిర్వహిస్తోంది. ఇప్పటి వరకు జనగామ, లింగాల ఘనపురం, దేవరుప్పుల, కొడకండ్ల మండలాల్లోని గోదాముల్లో తనిఖీ చేశారు.
జనగామ జిల్లా కేంద్రంలోని జేకేఎస్ అగ్రిమాల్‌లో టాస్క్‌ఫోర్స్ టీం తనిఖీలు నిర్వహించగా వానకాలం సీజన్లో అమ్మకూడని రూ. 10లక్షల 49 వేల 450 విలువైన ైగ్లెపోసేట్ గడ్డి మందులు లభించాయి. దీంతో నిబంధనలు ఉల్లంఘించిన సదరు షాపుకు ‘స్టాప్ సేల్ నోటీసు’ ఇచ్చారు. అదేవిధంగా రూ.54వేల 85 విలువైన కాలపరిమితి దాటిన కూరగాయలు, పత్తి విత్తనాలు పట్టుబడగా చీటింగ్ కేసు నమోదు చేశారు. ప్రతి ఫర్టిలైజర్ షాపులో విత్తన ప్యాకెట్లను ఎక్కడ తయారు చేశారు? ప్యాకింగ్ చేశారు? ఎవరు మార్కెటింగ్ చేస్తున్నారనే సమాచారంతో తనిఖీలు చేస్తున్నారు.
జనగామ జిల్లా వ్యాప్తంగా మొత్తం 234 లైసెన్స్ ఫర్టిలైజర్ దుకాణాలు ఉన్నాయి. జనగామ-31, బచ్చన్నపేట-12, చిల్పూరు-25, దేవరుప్పుల-22, స్టేషన్ ఘన్పూర్-24, కొడకండ్ల-8, లింగాల ఘన్పూర్-16, నర్మెట-17, పాలకుర్తి-27, రఘునాథపల్లి-23, తరిగొప్పుల-12, జఫర్గడ్-17 ఫర్టిలైజర్ దుకాణా లు ఉన్నాయి. సీజన్లో రైతుల డిమాండ్‌కు అనుగుణంగా డీలర్లు సకాలంలో నాణ్యమైన విత్తనాలు రైతులకు అందజేయనున్నారు.
దీన్ని ఆసరా చేసుకొని దళారులు కల్తీ విత్తనాల విక్రయించే అవకాశం ఉన్నందున తనిఖీలు చేపట్టారు. జిల్లాలోని ప్రతి ఫర్టిలైజర్ షాపులో జరిగే క్రయవిక్రయాలపై టాస్క్‌ఫోర్స్ టీం ప్రత్యేక నిఘా పెట్టింది. జిల్లాలో ఎక్కడైనా కల్తీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు విక్రయిస్తున్నట్లు సమాచారం తెలిస్తే జిల్లా వ్యవసాయశాఖ అధికారులు లేదా టాస్క్‌ఫోర్స్ టీంకు 9491089125 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సంబంధిత శాఖ అధికారులు ప్రజలను కోరుతున్నారు.
వానకాలం సీజన్ మొదలవడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా టాస్క్‌ఫోర్స్ టీం ఆధ్వర్యంలో కల్తీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందు విక్రయాలను కట్టడి చేసేందుకు జిల్లాలోని ఫర్టిలైజర్ దుకాణాల్లో తనిఖీలు చేపట్టాం. నిబంధనలు ఉల్లంఘించే డీలర్లపై కేసులు నమోదు చేస్తున్నాం. కల్తీ విత్తనాలు, ఎరువులు విక్రయించే అక్రమార్కులపై పీడీ యాక్ట్ నమోదు చేసేందుకు సిద్ధమయ్యాం. సీజన్‌కు అనుగుణంగా ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేలా చూస్తున్నాం. కల్తీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందు అమ్మతున్నట్లు తెలిస్తే సమాచారం ఇవ్వాలి.
వినోద్ కుమార్, డీఏవో, జనగామ