
నగరాభివృద్ధే లక్ష్యంగా వరంగల్ మహా నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం కొనసాగింది. కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన మంగళవారం జరిగిన సమావేశంలో 34 ఎజెండా అంశాలకు ఏకగ్రీవ ఆమోదం లభించింది. రూ. 13.96కోట్ల నిధులను పలు డివిజన్లలో చేపట్టనున్న 20 అభివృద్ధి పనులకు కేటాయించగా కార్పొరేషన్లో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పని చేస్తున్న కార్మికులు, ఉద్యోగులకు ప్రస్తుత వేతనంపై 30 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అన్నపూర్ణ పథకంతో పాటు స్వచ్ఛ ఆటోల ఈఎంఐల కోసం రూ.4.13 కోట్ల చెల్లింపులకు పచ్చజెండా ఊపారు. ఉదయం 11.34 గంటలకు ప్రారంభమైన సమావేశం సుమారు రెండున్నర గంటల పాటు జరుగగా, తొలుత గత కౌన్సిల్ సభ్యుడు సమ్మిరెడ్డి మృతికి సంతాపం తెలుపుతూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.
వరంగల్, నవంబర్ 2 : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం నగరాభివృద్ధే లక్ష్యంగా కొనసాగింది. ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై సభ్యులు చర్చించారు. పలు అభివృద్ధి పనులకు కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ప్రభుత్వ షటర్ల లీజ్‌లను పొడిగించే అంశంపై సభ్యుడు గుండేటి నరేంద్రకుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం చేస్తున్నారా పైరవీలతో చేస్తున్నారా ప్రశ్నించారు. గత ఏడాది నిబంధనల ప్రకారం 30 శాతం అద్దె పెంచి లీజ్‌ను కొనసాగిస్తున్నామని అధికారులు సమాధానం చెప్పారు. బీజేపీ కార్పొరేటర్ చింతాకుల అనిల్‌కుమార్ లీజ్ పొడిగింపుపై అభ్యంతరం చెబుతూ టెండర్లు పిలిస్తే కార్పొరేషన్‌కు ఆదాయం వస్తుందని సూచించారు. పోలీస్ కమిషనరేట్‌లో రూ. 23.50 లక్షలతో ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలన్న అంశంపై సభ్యులు అభ్యంతరం తెలిపారు. పోలీస్ శాఖ వద్ద నిధులు ఉన్నాయి కదా అని ప్రశ్నించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఖర్చు చేస్తే బాగుంటుందని సభ్యులు అభిప్రాయపడ్డారు.
డివిజన్లలో అభివృద్ధి పనులకు నిధులు..
నగరంలో రూ. 13.96 కోట్ల అభివృద్ధి పనులకు కౌన్సిల్ సమావేశం ఆమోదం తెలిపింది. పలు డివిజన్లలో 20 అభివృద్ధి పనుల కోసం నిధులను మంజూరు చేశారు. రోడ్లు, బాక్స్ డ్రైనేజీలు, ఆర్ట్స్ కళాశాల కాలినడక బాట వెంట ప్రహరీ నిర్మాణం చేసేందుకు సమావేశం ఆమోద ముద్ర వేసింది. గణేశ్ నిమజ్జన సమయంలో చెరువుల క్లీనింగ్ చేసిన ఇరిగేషన్ శాఖకు రూ.65 లక్షలు చెల్లించేందుకు ఆమోదం తెలిపింది. ఎజెండాలోని 34 అంశాలకు కౌన్సిల్ అమోదం తెలిపింది.
రూ.90 కోట్ల బ్యాంకు రుణం తీసుకోవాలని నిర్ణయం
నగరాభివృద్ధి కోసం బ్యాంకుల నుంచి రుణం తీసుకోనేందుకు కౌన్సిల్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు రూ. 90 కోట్లు బ్యాంకు రుణం తీసుకోవాలని నిర్ణయించారు. నిధుల సేకరణలో భాగంగా బ్యాంకు రుణం తీసుకోవాలని మున్సిపల్ శాఖ ప్రధాన కార్యదర్శి, సీడీఎంఏ సూచించిన విషయం తెలిసిందే.
ఔట్ సోర్సింగ్ కార్మికుల వేతనాలు పెంపు
ప్రజారోగ్యం, వివిధ విభాగాల్లో ఔట్ సోర్సింగ్ పద్ధతిన పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులకు వేతనాలు పెంచాలని కౌన్సిల్ నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న వేతనంపై 30 శాతం వేతనం పెంచేందుకు కౌన్సిల్ ఆమోద ముద్ర వేసింది. దీంతో పాటు ఇంటింటి చెత్త సేకరణ చేస్తున్న స్వచ్ఛ ఆటో డ్రైవర్లకు నెలకు రూ.15 వేల వేతనం చెల్లించనుంది. పారిశుధ్య కార్మికులకు రక్షణ కోసం రేడియం జాకెట్లు, గ్లౌజ్, సబ్బులు, కొబ్బరినూనె కొనుగోలుకు కౌన్సిల్ ఓకే చెప్పింది.
మిషన్ భగీరథ పనులపై ఆగ్రహం
గ్రేటర్లో మిషన్ భగీరథ పనుల నత్తనడకపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పైపులైన్ పేరుతో రోడ్లను తవ్వి వదిలివేశారని ఫైర్ అయ్యారు. రోడ్ల అధ్వాన పరిస్థితిపై ప్రజలు నిలదీస్తున్నారని సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పబ్లిక్ హెల్త్ అధికారులు చెప్పన సమాధానంపై సభ్యులు సంతృప్తి చెందలేదు, కుమ్మరిగూడెం, తరాలపల్లి ఎస్సీ వాడల్లో మిషన్ భగీరథ కనెక్షన్లు ఇవ్వలేదని కార్పొరేటర్ ఇండ్ల నాగేశ్వర్రావు కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయాన్ని జాతీయ ఎస్సీ కమిషన్ దృష్టికి తీసుకుపోతానని పేర్కొన్నారు. డిసెంబర్ నాటికి మిషన్ భగీరథ పనులను పూర్తిచేస్తామని పబ్లిక్ హెల్త్ అధికారులు చెప్పడంతో సభ్యులు శాంతించారు.
సైకిళ్లపై వచ్చిన ఎమ్మెల్యేలు
పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ కోసం ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ కౌన్సిల్ సమావేశానికి సైకిళ్లపై వచ్చారు. వచ్చే కౌన్సిల్ సమావేశానికి కార్పొరేటర్లు సైకిళ్లపై రావాలని వారు కోరారు. సైకిల్ ఫర్ చేంజ్‌లో భాగంగా సైకిళ్లు కొనుగోలు చేయాలని సూచించారు.
సమష్టి కృషితో నగరాభివృద్ధి
మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్ల సహకారంతో సమష్టిగా నగరాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకపోతాం. సీఎం కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి నగరాభివృద్ధి రూ.వందల కోట్ల నిధులు కేటాయిస్తున్నారు. ఇప్పటికే పనులు పురోగతిలో ఉన్నాయి. క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించేందుకు డివిజన్ బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ప్రాధాన్యతా క్రమంలో సమస్యలను పరిష్కారించేలా చర్యలు తీసుకుంటున్నాం. నగరంలో వరద ముంపు నివారణకు రూ. 610 కోట్లతో వరద కాల్వల నిర్మాణం చేస్తున్నాం, మురుగునీటి శద్ధీకరణకు ఎస్టీపీలు నిర్మిస్తున్నాం. సమీకృత మార్కెట్ల నిర్మాణాలకు టెండర్ ప్రక్రియను పూర్తి చేశాం. ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న పట్టణ ప్రగతి నిధులతో నగరంలో అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నాం. డిసెంబర్ గ్రేటర్ పరిధిలోని ప్రతి ఇంటికి రక్షిత తాగునీరు సరఫరా చేస్తాం.
చిరు వ్యాపారులపై యుద్ధం వద్దు
నగరంలో బడాబాబులు రోడ్లు ఆక్రమణ చేసినా, అక్రమ నిర్మాణాలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. కానీ, అధికారులు చిరువ్యాపారులపై యుద్ధం ప్రకటిస్తున్నారు. చిరు వ్యాపారులకు కౌన్సెలింగ్ ఇస్తాం. ప్రజాప్రతినిధులు, అధికారులు వెళ్లి వారికి అవగాహన కల్పించాలి. పెద్ద బంగ్లాలు అక్రమంగా నిర్మిస్తున్న వారిని పట్టించుకోని టౌన్‌ప్లానింగ్ అధికారులు చిరు వ్యాపారుల వద్దకు మాత్రం జేసీబీలు తీసుకుని వెళ్లి భయభ్రాంతులకు గురిచేయడం మానుకోవాలి. ఆక్రమణలను సమర్థించడం లేదు. చిరు వ్యాపారులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. నగరాభివృద్దికి సీఎం కేసీఆర్ పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారు.
విలీన గ్రామాల అభివృద్ధిపై దృష్టి సారించాలి
విలీన గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించాలి. గ్రేటర్‌లోని 42 విలీన గ్రామాల్లో 31 గ్రామాలు వర్ధన్నపేట నియోజవర్గంలో ఉన్నాయి. కొత్త మున్సిపల్ చట్టంలో స్పష్టంగా విలీన గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక నిధుల కేటాయించాలని పేర్కొన్నారు. కొత్తపేట రోడ్డు నిర్మాణం కోసం టెండర్లు పూర్తి చేసినా పనులు మొదలు కాలేదు. వెంటనే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలి. విలీన గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి, డీపీఆర్‌ను రూపొందించాలి.
మిషన్ భగీరథ పనులపై సమీక్షిస్తాం..
మిషన్ భగీరథ పనుల్లో జాప్యంపై సమీక్ష చేస్తాం. పబ్లిక్ హెల్త్ ఎస్ఈ దృష్టికి తీసుక వెళ్లి త్వరగా పనులు జరిగేలా చర్యలు తీసుకుంటాం. ప్రతి డివిజన్‌కు కేటాయించిన రూ. 50 లక్షల పనులపై క్షేత్రస్థాయిలో పరిశీలించి అంచనాలు రూపొందిస్తాం. సభ్యులు లేవనెత్తిన ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా ముందుకు పోతాం.
నగరంలో కుక్కల బెడద తీవ్రంగా ఉంది. కుక్కలను తీసుకెళ్లి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసి మళ్లీ డివిజన్లలో వదిలివేస్తున్నారు. దీంతో ఆపరేషన్లు చేసిన కుక్కలు బలహీనంగా మారి చర్మం ఊడిపోయి డివిజన్ల తిరుగుతున్నాయి. ఆపరేషన్లు చేసిన కుక్కల కోసం డాగ్ పార్కు ఏర్పాటు చేయాలి. కాంట్రాక్టర్లు టెండర్లు వేయడానికి ముందుకు రాకపోవడంతో అభివృద్ధ ముందుకు సాగడం లేదు.
రూ. 50 లక్షల పనులకు అంచనాలు రూపొందించాలి
గత కౌన్సిల్ సమావేశంలో డివిజన్‌కు కేటాయించిన రూ. 50 లక్షల పనులకు అంచనాలు రూపొందించాలి. ఇప్పటి వరకు చాల డివిజన్లలో రూ.50 లక్షల పనులకు అంచనాలు వేయలేదు. సీఎం హామీ నిధులతో చేటట్టిన అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు. కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. సీఎం హామీ నిధులతో చేపట్టిన పనులు త్వరగా జరిగేలా చర్యలు తీసుకోవాలి.
గుంతల రోడ్లపై నడిపిస్తున్నారు..
మిషన్ భగీరథ పైపులైన్ తవ్వకాలతో ఏర్పడిన గుంతల రోడ్లపై నడువలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. డివిజన్లలో ప్రజల మద్యకు వెళ్లలేక పోతున్నాం. వెంటనే రోడ్ల మరమ్మతులు చేపట్టాలి. డివిజన్‌కు కేటాయించిన రూ.50 లక్షల పనులకు టెండర్లు పిలిచి పనులు మొదలు పెట్టాలి.
మోడల్ డివిజన్ ఉత్త మాటేనా?
గత కౌన్సిల్లో 57వ డివిజన్‌ను మోడల్‌గా ప్రకటించారు. అది ఉత్తమాటగానే నిలిచిపోయింది. డివిజన్లో ఏమాత్రం అభివృద్ధి జరుగలేదు. ప్రణాళికలు కాగితాలకే పరిమితమయ్యాయి. గత వరదల సమయంలో డివిజన్లోని ఇంజినీర్ కాలనీ ముంపునకు గురైంది. ఇప్పటికీ అనేక ఇళ్లు నీళ్లలోనే ఉన్నాయి. అధికారులు కనీసం క్షేత్రస్థాయిలోకి వచ్చి పరిశీలించడం లేదు.