హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): లీడర్లూ లేక, క్యాడరూ లేక ముక్కి మూలుగుతున్న కాంగ్రెస్ పార్టీ, సామాన్యులు కూడా నవ్వుకొనే పనిచేసింది. ఇతర పార్టీల నేతలను చేర్చుకొనేందుకు ఆ పార్టీ అధిష్ఠానం ప్రత్యేకంగా ఓ కమిటీనే ఏర్పాటుచేసింది. కమిటీకి మాజీ మంత్రి జానారెడ్డిని చైర్మన్‌గా నియమించగా రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ సభ్యులుగా ఉన్నారు. రాజకీయంగా పరువు పోయేలా ఉన్న ఈ కమిటీ ఏర్పాటుపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సొంత పార్టీ నేతలను గాడిలో పెట్టలేని అధిష్ఠానం, ఇప్పుడు కొత్తగా చేరికలపై కమిటీ వేయడం హాస్యాస్పదమంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. చేరికల సంగతి దేవుడెరుగు.. ఉన్న వాళ్లు పార్టీని వీడకుండా కాపాడుకొంటే అదే పదివేలు అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఈ నిర్ణయం పార్టీ పరువును తీయడమేనని మండిపడుతున్నారు. కాగా, చేరికల కమిటీకి చైర్మన్‌గా ఉండేందుకు జానారెడ్డి ససేమిరా అంటున్నట్టు తెలిసింది. అసలు చేరికల కోసం ఓ కమిటీ వేయడమేంటని ఆయన ప్రశ్నించినట్టు తెలిసింది. ఇలాంటి కమిటీకి తాను చైర్మన్‌గా ఉండే ప్రసక్తే లేదని అధిష్ఠానానికి తేల్చి చెప్పినట్టు సమాచారం.
చేరికల కమిటీ ఏర్పాటు వెనుక ఆ పార్టీ సీనియర్ల పాత్ర ఉన్నదని సమాచారం. రేవంత్‌రెడ్డి ఒంటెత్తు పోకడకలకు చెక్ పెట్టేందుకే ఈ కమిటీని వేశారని అంటున్నారు. చేరికల విషయంలో రేవంత్‌రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు తీసుకొంటున్నారనే విమర్శలున్నాయి. దీంతో రేవంత్‌రెడ్డి తీరుపై గుర్రుగా ఉన్న సీనియర్లు, ఈ విషయాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లగంతో ఈ కమిటీ వేసినట్టు తెలిసింది. ఈ కమిటీలోని సభ్యులను గమనిస్తే ఇందుకు బలం చేకూరుతున్నది. అందులో ఉన్నవారంతా రేవంత్‌కు వ్యతిరేక వర్గమే కావడం గమనార్హం.