రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టింది. వరిని కొనుగోలు చేయలేమని కేంద్రం స్పష్టంగా చెప్పడంతో.. వాణిజ్య పంటలు సాగు చేయాలని రైతులను ప్రోత్సహిస్తున్నది. ఈ క్రమంలో
వంట నూనెలను ఉత్పత్తి చేసే ఆయిల్‌పామ్ సాగు వైపు మళ్లించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నది. నాటేందుకు అవసరమైన మొక్కల ధర నుంచి మొదలుకొని అంతర పంటల వరకు సబ్సిడీ అందిస్తున్నది. అంతేకాకుండా మార్కెటింగ్ సౌకర్యం కల్పించడంతోపాటు రవాణా ఖర్చులు చెల్లిస్తూ రైతులకు అండగా నిలుస్తున్నది.
వనపర్తి, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ) : వంటనూనెల ఉత్పత్తికి కావాల్సిన పంట కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. యాసంగిలో పండిన వరి కొనుగోలు చేయబోమని కేంద్రం తెగేసి చెప్పడంతో రైతులకు అండగా నిలుస్తున్నది. అందుకే ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని రైతులకు సూచిస్తున్నది. ఈ క్రమంలో పలువురు కర్షకులు అయిల్‌పామ్ వైపు దృష్టి సారిస్తున్నారు. వనపర్తి జిల్లా విషయానికొస్తే ప్రస్తుతం 543 మంది రైతులు 2,500 ఎకరాల భూమిలో ఈ తోటను చేసేందుకు జిల్లా ఉద్యానవన శాఖకు దరఖాస్తులు చేసుకున్నారు. విడుతల వారీగా సంవత్సరానికి మూడు వేల ఎకరాలకు మొక్కలు అందజేయాలని ఆ శాఖ నిర్ణయించింది. ఈ పంట వేసిన వారికి రైతుబంధుతోపాటు ఎకరాకు అదనంగా మరో నాలుగు వేల రూపాయలు అందించనున్నది. సర్కార్ ప్రోత్సాహంతో రైతులు ఈ తోటల సాగుకు ఆసక్తి చూపుతున్నారు. ఒకసారి అందుబాటులోకి వస్తే దాదాపు 30 నుంచి 40 ఏండ్ల పాటు ఆదాయం ఇచ్చే పంటగా పేరుండడంతో మక్కువ పెంచుకుంటున్నారు. ఇటీవల ఈ పంటపై శిక్షణ, అవగాహన ఇచ్చేందుకు రైతులను ఖమ్మం జిల్లాకు కూడా పంపించారు.
మార్కెటింగ్ సౌకర్యం
పంట దిగుబడిని స్వీకరించేందుకు ప్రభుత్వం మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తున్నది. బీచుపల్లి ప్రాంతంలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు ఉన్నాయి. ఇప్పటికే ఇక్కడ స్థలాన్ని పరిశీలించారు. ప్రస్తుతం టన్ను ధర రూ.18 వేలుగా నిర్ణయించారు. ఒక పంట కాలంలో ఎకరంలో సుమారు 10 టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. దీన్ని ప్రోత్సహించేందుకు ముందుగా జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా 2020-21 ఆర్ధిక సంవత్సరానికిగానూ 49 మంది రైతులకు 225 ఎకరాలు ఎంపిక చేసి మొక్కలు అందజేశారు. వీటికి సబ్సిడీలో డ్రిప్, స్ప్రింక్లర్ వంటి వాటిని అందజేస్తున్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికిగానూ 2 లక్షల మొక్కలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. కడుకుంట్ల దగ్గర నర్సరీలో మొక్కలు పెంచుతున్నారు. దీనికి ఎఫ్‌జీవీ ప్రీ యూనిక్ సంస్థ బాధ్యత తీసుకున్నది. విస్తీర్ణం పెంచాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున రాయితీలు అందిస్తున్నది. నర్సరీలో పెంచే మొక్కలను వనపర్తి, గద్వాల, మహబూబ్‌నగర్ జిల్లాలకు పంపిణీ చేయనున్నారు.
రాయితీలు ఇలా..
అయిల్‌పామ్ సాగుచేసే రైతుకు ఎకరాకు రూ.36 వేలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో తొలి ఏడాది రూ.26 వేలు, రెండు , మూడు సంవత్సరాల్లో ఏడాదికి ఐదు వేల రూపాయల చొప్పున అందించనున్నది. ఉపాధి జాబ్‌కార్డు ఉన్న రైతులకు గుంతలు తవ్వడం, మొక్కలు నాటడం, సస్యరక్షణ చర్యలు చేపట్టనున్నారు. బిందు సేద్యం కోసం ఎస్సీ, ఎస్టీ రైతులకు వంద శాతం, బీసీ, సన్న కారు రైతులకు 80 శాతం రాయితీపై పరికరాలు అందజేయనున్నారు. జీఎస్టీ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇంతకు ముందు డ్రిప్ తీసుకున్నా ఆయిల్‌పామ్ రైతులకు మరోసారి రాయితీపై డ్రిప్ అందించనున్నారు. ఒకటి నుంచి పన్నెండు ఎకరాల వరకు సబ్సిడీ కూడా అందనున్నది.
వచ్చే ఏడాది 4 వేల ఎకరాలు
వచ్చే సంవత్సరంలో నాలుగు వేల ఎకరాలు ఆయిల్‌పామ్ సాగు చేసేందుకు ప్రణాళికలు రూపాందించాం. ఇప్పటికే రైతుల నుంచి దరఖాస్తులు వస్తున్నాయి. రాబోయే మూడేండ్లలో 12 వేల ఎకరాల సాగు విస్తీర్ణం పెంచాలనే లక్ష్యం ఉన్నది. రాయితీలు అందిస్తున్నాం. జూన్ నుంచి ఎంపిక చేసిన కర్షకులకు పంపిణీ చేస్తాం. నర్సరీలో మొక్కలు పెంచుతున్నాం. 108 మందిని శిక్షణ కోసం అవ్వరావుపేటకు పంపించాం. నాలుగు నుంచి ఐదేండ్లలోనే ఎకరాకూ పది టన్నుల దిగుబడి వస్తుంది.