సోషల్ సర్వీస్‌లో ఒక్కొక్కరిది ఒక్కో పాత్ర. ప్రతి రంగంలో సేవాతత్పరత కలిగిన వారుంటారు. వారి సమయానుకూలతలను బట్టి ఎక్కడో ఒక చోట, ఎప్పుడో ఒకసారి సేవాగుణాన్ని చాటుతుంటారు. అదే ఇంకొందరైతే ఏండ్లకేండ్లు కొనసాగుతూ తమ జీవితాన్ని సామాజిక సేవ కోసం అంకితం చేసేస్తున్నారు. ఇంకొందరైతే సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా నగరంలోని పేదలు నివసించే బస్తీలు, పాఠశాలలకు చేయూతనిచ్చిన సందర్భాలు అనేకం. బాలలు, మహిళలు, విద్య, ఆరోగ్యం, ప్రభుత్వాల ద్వారా వచ్చే సంక్షేమ పథకాల అమలు కోసం హైదరాబాద్‌కు చెందిన అనేక మంది వ్యక్తులు, సంస్థలు అధికారులతో కలిసి పనిచేస్తున్నారు. ఇంకొందరైతే పేదలు, మానవ హక్కుల కోసం నిరంతరంగా కృషి చేస్తున్నారు.
ఉమ్మడి భవిష్యత్తు కోసం..
ప్రపంచవ్యాప్తంగా సమాజ సేవలో నిమగ్నమై సోషల్ యాక్టివిస్టుల కోసం ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 1985లో మొట్టమొదటి సారిగా అంతర్జాతీయ స్వచ్ఛంద సేవకుల దినాన్ని పాటించాలని తీర్మానించింది. ప్రతిఏటా డిసెంబర్ 5న నిర్వహిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా సమ్మిళిత అభివృద్ధిని సాధించడం, మహిళా స్వావలంబన, స్వయం సమృద్ధి లక్ష్యాలతో యూఎన్వో జనరల్ అసెంబ్లీ ముందుకు సాగుతున్నది. ఇందులో భాగంగా 2021కి గాను ‘మన ఉమ్మడి భవిష్యత్తు కోసం ఇప్పుడే స్వచ్ఛందంగా సేవకు కదులుదాం’అనే థీమ్‌ను ఎంపిక చేసింది.
వలంటీరింగ్ అంటే..
వలంటీరింగ్ అంటే సేవచేయడమే. కానీ కుటుంబ బాధ్యతలు, కేరీర్‌తో పాటు కొనసాగాల్సిన బాధ్యత. ఒక్కమాటలో చెప్పాలంటే సాటివారికి చేతనైన సాయం చేయడమేనని పలువురు సోషల్ యాక్టివిస్టులు పేర్కొంటున్నారు. రెమ్యునరేషన్ లేకుండా సేవచేస్తే వలంటీర్లు పేదరికంలోకి నెట్టివేయడంతో పాటు నిత్యం ఆర్థిక సమస్యలతో కొట్టమిట్టాడాల్సిన పరిస్థితి ఏర్పడితే దానికి అర్థం ఉండది కదా అంటున్నారు.
అత్యవసర సమయాల్లో ఆదుకోవాలి..
బాలికా విద్య, సామాజిక మార్పు, ఆరోగ్యకరమైన సమాజం, సాంస్కృతిక రంగాల్లో చైతన్యం కల్పిస్తున్నాం. రైతులకు సేంద్రియ పద్ధతులపై అవగాహన కల్పిస్తున్నాం. రెండేండ్లుగా కొవిడ్-19 నివారణ సేవల్లో నిమగ్నమయ్యాం. ఇందులో భాగంగా తెలంగాణ, ఏపీలో కలిపి 25 వేల కుంటుంబాలకు సాయమందించాం. రెండు రాష్ర్టాల్లోని ప్రభుత్వ వైద్యశాలలకు వెయ్యి ఆక్సిజన్ కాన్సట్రేటర్లను అందజేశాం. ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీశ్‌రావు సమక్షంలో 50 ఆక్సిజన్ కాన్సట్రేటర్లు ఇచ్చాం. అత్యవసర సమయాల్లో ఆదుకున్నవారే నిజమైన సేవకులు. 15 ఏండ్లుగా స్వచ్ఛంద సేవలో ఉన్న నాకు ఎంతో సంతృప్తిగా ఉన్నది. అత్యవర సమయాల్లో ఆక్సిజన్ కాన్సట్రేటర్ల కోసం 83748 90113లో సంప్రదించవచ్చు.
-ఎం.ఆంజనేయులు,
యాక్షన్ఎయిడ్, హైదరాబాద్ స్వచ్ఛంద కార్యకర్తల కృషితో చట్టాల రూపకల్పన..
కొన్ని స్వచ్ఛంద సంస్థలు, కార్యకర్తల కృషితో పార్లమెంటుతో పాటు పలు రాష్ర్టాల్లోని అసెంబ్లీల్లో కొన్ని చట్టాలు రూపొందాయి. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ (RTE), మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారంటీ స్కీం (NREGS), సమాచార హక్కు చట్టం (RTI), అటవీ హక్కుల చట్టం, సబ్‌ప్లాన్ లాంటి చట్టాల రూపకల్పనలో సుప్రీంకోర్టు సైతం పలు సందర్భాల్లో సూచనలు చేసింది.
బాధ్యతగా భావించాలి
కొవిడ్ విజృంభిస్తున్న తరుణంలో కూడా పేదలు, కూలీలకు బియ్యంతో పాటు నిత్యావసర సరుకులను అందజేశాం. ఉన్నత చదువులు చదువుకున్న మిత్రులందరం కలిసి ఎంతో కొంత పోగుచేసి సామాజిక బాధ్యతతో లాక్డౌన్ సమయంలో పేదలకు చేయూతనిచ్చాం. స్లమ్ ఏరియాల్లోని చిన్నారులకు పోషకాహార లోపం రాకుండా 16 ఏండ్లుగా పనిచేస్తున్నాం. మా మిత్రులు జె.ప్రతాప్, బాలాజీ వేతనాల నుంచి నెలకు కొంత సోషల్ సర్వీస్ కోసం కేటాయించి సందర్భాన్ని బట్టి సాయం చేసేందుకు కృషి చేస్తున్నాం. బాధ్యతగా భావించినప్పుడే సామజిక సేవ చేయగలం.
నిరంతరం పనిచేస్తేనే..
వలంటీర్ అనగానే కొంత సేపు పనిచేస్తే అయిపోతుందని అనుకోకూడదు. సమస్యేమిటో అర్థం చేసుకొని పరిష్కరించే దిశగా మనకున్న సమయాన్ని అడ్జస్ట్ చేసుకొని నిరంతరం పాటుపడాలి. అప్పుడే పూర్తిస్థాయి ఫలితాలు ఆశించగలుగుతాం. కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూనే సమాజం సేవలో పాలుపంచుకుంటున్నా. 1975 నుంచి సోషల్ యాక్టివిస్టుగా పనిచేస్తున్నా. 1997 నుంచి నల్గొండ జిల్లా దేవరకొండలో చిన్నారులు, మహిళల హక్కుల కోసం పనిచేయడం ప్రాంభించాం. అనేక పర్యాయాలుగా ఆడపిల్లల అమ్మకాలపై గ్రామ్య రిసోర్స్ సెంటర్ ఫర్ వుమెన్ ద్వారా పేదలను చైతన్యం చేశాం. మహిళల హక్కుల కోసం హెల్ప్‌లైన్ నంబర్ 181తో పాటు Gramya Resource Centre for Women. ఫోన్‌నంబర్ 040-4260 1382ను సంప్రదించవచ్చు.
పిల్లలకు అండగా నిలుస్తాం
సేవ చేయాలనే లక్ష్యం ఉంటే ఎంతటి బిజీ లైఫ్‌లో ఉన్నా ఎంతోకొంత సమయం కేటాయించవచ్చు. నిజమైన సంతృప్తి సేవలోనే దాగి ఉంది. చాలా మంది నిరుపేదలు అనేక అవసరాలతో బాధపడుతుంటారు. మనకు వీలైనంతలో వారికి సాయం చేయడం గొప్ప విషయం. మా జగతి ఫౌండేషన్ తరపున నిత్యావసర సరుకులు పంపిణీ చేశాం. నిరుపేద చిన్నారులకు బ్యాగులు, పుస్తకాలు అందిస్తున్నాం. పిల్లల చదువుకు సంబంధించి మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎప్పటికీ ఈ కార్యక్రమం కొనసాగిస్తాం. మహిళలు స్వయం ఉపాధి పొందేలా వారికి మోటివేషన్, అందుకు తగ్గ వనరులను సమకూరుస్తున్నాం. స్వచ్ఛందంగా సేవ చేయడానికి అనేక మంది వలంటీర్లు ముందుకు వస్తున్నారు. పిల్లలకు బ్యాగులు, బట్టలు, పుస్తకాలు అవసరమయ్యే వాళ్లు 9963741518 నంబర్‌కు ఫోన్ చేస్తే మేం సాయం చేస్తాం.