ఎవరూ పుట్టించకపోతే మాటలెలా పుడతాయని మాయాబజార్లో ఘటోత్కచుడు అన్నట్టే అనుకుంటేనే ఏదో ఒకటి సాధిస్తాం. గెలుస్తాం. ఓడితే అనుభవమైనా దక్కుతుంది! ప్రయత్నమూ ఓ గెలుపే! కాబట్టి అనుకున్నప్పటి నుంచి ఓడిపోతామనే దిగులొద్దు. అనుకున్నప్పుడే గెలిచామనే ధైర్యంతో ముందడుగు వేయాలి. ఇంతకుముందు చాలా అనుకున్నాం. ఏం సాధించలేదనే దిగులొద్దు. ఇప్పుడు కొత్తగా ఏదో సాధించాలనే ఆలోచనలే లేకుండా ఎక్కడ ఓడిపోయారో అక్కడే మొదలుపెట్టండి. ఓటమే విజయానికి నాంది! నయా సాల్ 2026ని కొత్తగా మొదలుపెడదాం. అసలైన గెలుపును అందుకుందాం!
ఏదైనా అనుకున్నప్పుడే… అది సాధించడానికి ఆచరణ మొదలవుతుంది. కానీ, ‘సఫలమవుతామా? విఫలమవుతామా?’ అని ఆదిలోనే సందేహిస్తే ఏ ప్రయత్నమూ ముందుకు సాగదు. ‘ఎందుకు సాధించలేం?’ అనే సాహసమే సాధనకు పునాది. కోరికే విజయం వైపు నడిపిస్తుంది. అందుకే కఠినమైనా సరే, ఆచరణకు కట్టుబడి ఉండాలి. పునాది ఎంత బలంగా ఉన్నా బలహీనమైన గోడలు కడితే ఆ సౌధం నిలబడదు. ఆశల సౌధం కూడా అంతే! బలమైన కోరిక, కఠినమైన ఆచరణ ఉంటే అవాంతరాలన్నీ ఓడిపోతాయి. సందేహాలతో, స్వయంకృతాలతో ఆచరణ బీటలు వారితే చేరుకోవాల్సిన గమ్యం ఎప్పటికీ దగ్గర కాదు. ‘నేను సాధించలేను’ అనే ఆలోచన మీలోంచి రాకూడదు. ‘నువ్వు సాధించలేవు. నీ శక్తికి మించిన కోరిక’ అనే బయటి మాటలు వినపడినా పట్టించుకోకూడదు. ఆ స్వప్నమే చెదిరిపోతే ప్రయత్నమంతా వృథా అవుతుంది. కాబట్టి కోరికను కాపాడుకోండి.
రెండు చక్రాలూ సమంగా ఉంటేనే బండి సవ్యంగా సాగుతుంది. అలాగే సాధకులు విజయవంతంగా ముందుకుసాగాలంటే ఆలోచన, ఆచరణలు సరిగా ఉండాలి. ఆలోచన మంచిదై ఉండాలి. ఆచరణ కచ్చితంగా సాగాలి. అప్పుడే అనుకున్నది సానుకూలమవుతుంది. ఇతరుల అవకాశాల్ని, ఆస్తుల్ని, సందపను గెలుచుకునే (గుంజుకునే) కోరికలూ ఉంటాయి. ఇవి నెరవేరక ఇబ్బంది పెడతాయి. నెరవేరినా ఆత్మన్యూనతే కానీ, ఆత్మానందాన్ని మిగల్చవు. కాబట్టి మంచి కోరికలు కోరుకోవాలి. మీ ఆశలు మీ సామర్థ్యాన్ని, నైపుణ్యాన్ని పెంచేవిగా ఉండాలి. అప్పుడే అవకాశాలు అందిపుచ్చుకోగలరు. ఎవరి నుంచి ఏదీ లాక్కోవాల్సిన అవసరం రాదు. మీ ప్రయత్నంలో నిజాయతీ ఉంటే ఇతరుల సహకారం లభిస్తుంది.
శక్తికి మించిన ఆచరణ సాధ్యం కాదు. ఉరికురికి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం మేలు. నిదానంగా అయినా ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఉండాలి. అంతేకానీ, ఆరంభ శూరత్వం వద్దు. వైఫల్యం పలకరించినంత మాత్రాన కుదేలవ్వాల్సిన అవసరం లేదు. ఓటమి వాస్తవ సామర్థ్యాన్ని ఎరుక చేస్తుంది. మీ లోపాలను ముందుంచుతుంది. అందుకే, గెలుపును మర్చిపోయినా ఫర్వాలేదు కానీ, ఓటమిని మాత్రం రాసిపెట్టుకోండి. ఆ ఓటమికి గల కారణాలను విశ్లేషించి, లోపాలను సరిదిద్దుకోండి.
సామర్థ్యానికి మించిన ప్రయత్నం కూడా వైఫల్యానికి కారణమే. జనవరి ఫస్టునే మొదలుపెట్టాలన్న నిబంధనేమీ లేదు. ఆ రోజు ప్రారంభిస్తేనే అనుకున్నది సఫలం అవుతున్నదీ లేదు. ఆలస్యమైనా ఫర్వాలేదు. గత వైఫల్యాలను విశ్లేషించుకుని లోపాలను ముందుగా గుర్తించండి. మీ సామర్థ్యానికి తగ్గట్టు చిన్న చిన్న లక్ష్యాలు ఏర్పర్చుకోండి. వాటిని అందుకోవడానికి ప్రణాళికలు రచించుకోండి. చిన్న గెలుపుతో పెద్ద విజయానికి బాటలు పరుచుకోండి.
ఇంతకుముందు చాలా అనుకున్నా.. కానీ, సాధించలేదు. ఇక అనుకోవడం మానేశానని చెప్పేవాళ్లు చాలామంది ఉంటారు. ఫారిన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, కంప్యూటర్ కోర్స్ చేయాలి, పొద్దునే లేవడం అలవర్చుకోవాలి, సిగరెట్లు మానేయాలి, జిమ్‌కి వెళ్లాలి, వెయిట్ తగ్గాలి.. ఇలాంటివి చాలానే అనుకుంటాం. ప్రయత్నం చేయడం, కొద్ది రోజులకే అన్నీ మానేయడం.. చాలా కామన్. వీళ్లందరూ ఓటమికి ఎన్నో కారణాలు చెబుతారు. కానీ, వాటన్నిటి మూలాలూ వాళ్ల ఆలోచన ధోరణిలోనే ఉన్నాయన్న సంగతి గుర్తించరు. గెలుపు అనేది ప్రత్యేకమైనది. అది అందరికీ అందేది కాదు. కొందరి అదృష్టమని భావిస్తుంటారు. విజయం అనేది ప్రత్యేకమైన సందర్భం కానే కాదు. గెలుపు అనేది ఒక జీవన శైలి. ఏ రంగంలో, ఏది సాధించాలో దానికి సాధించాల్సిన నైపుణ్యాలు, వెచ్చించాల్సిన సమయం, మార్చుకోవాల్సిన అలవాట్లు ఉంటాయి. వాటికి అనుగుణంగా రోజువారీ జీవితాన్ని మలచుకోవాలి. అప్పుడే అనుకున్నది ఒక్కొక్కటిగా చేరువవుతుంది. చుట్టూ ఉండే పరిసరాలు, రోజూ కలిసే మనుషులు, మనసులోకి వచ్చే ఆలోచనలన్నీ సానుకూలంగా ఉన్నప్పుడే గెలుపు సాధ్యమవుతుంది. కేవలం సమయం కేటాయించినంత మాత్రాన గెలుపు వరిస్తుందని అనుకోవద్దు. మీ విజయాన్ని ఆటంకపరిచే శత్రువులనూ గెలవాలి. అందుకే గెలుపు ప్రత్యేకమైన సందర్భం కాదు. అది ఒక జీవన శైలిగా మార్చుకోవాలి. ఈ 2026లో ఇలా పయనిద్దాం. మన విజయానికి మైలురాయిగా మలుచుకుందాం!!