
హైదరాబాద్, నవంబర్ 17: కేరళకు చెందిన ప్రముఖ పాదరక్షల సంస్థ వీకేసీ గ్రూపు.. తెలంగాణలో ప్లాంట్ను ఏర్పా టు చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది. ఈ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి కంపెనీ ఉన్నతాధికారి ఒకరు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారితో భేటీ అయినట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు, ఇతర విషయాలపై ప్రధానంగా వీరు చర్చించినట్లు తెలుస్తున్నది. రూ.25 కోట్ల ప్రారంభ పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న ఈ ప్లాంట్ కోసం వచ్చే మూడేండ్ల కాలంలో రూ. 100 కోట్ల వరకు పెట్టుబడి పెట్టే అవకాశం ఉన్నది. ఈ ప్లాంట్ ద్వారా ప్రత్యక్షంగా 500 మందికి, పరోక్షంగా మరో 500 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ప్రస్తుతం సంస్థకు దేశవ్యాప్తంగా ఏడు రాష్ర్టాల్లో 24 ప్లాంట్లు ఉండగా, వీటిలో 7 వేల మంది పనిచేస్తున్నారు. దేశవ్యాప్తంగా పాదరక్షల మార్కె ట్ రూ.50 వేల కోట్ల స్థాయిలో ఉండగా, 2030 నాటికి రూ.80 వేల కోట్లకు చేరుకునే అవకాశాలున్నాయి.