విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’.రుక్సర్ థిల్లాన్ నాయికగా నటిస్తున్నది. బీవీఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో ఎస్వీసీసీ డిజిటల్ పతాకంపై బాపినీడు, సుధీర్ ఈదర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవి కిరణ్ కథ కథనం అందించగా..విద్యాసాగర్ చింతా దర్శకత్వం వహించారు. మే 6న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ…‘నా సినిమాలకు యువత మాత్రమే ఎక్కువగా వస్తుంటారు. ఈ చిత్రంతో కుటుంబ ప్రేక్షకులు కూడా థియేటర్లకు వస్తారని ఆశిస్తున్నాను. ఆహ్లాదకర ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. ఒక చిన్న ఐడియాతో సినిమా ప్రారంభమైంది. ఇప్పుడు నా కెరీర్లో ఇదే బెస్ట్ ఫిల్మ్ అని చెప్పగలను. అర్జున్ కుమార్ పాత్ర మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. బాపినీడు సినిమా క్వాలిటీగా రావాలని కోరుకునే అభిరుచి గల నిర్మాత’ అన్నారు. ‘ఈ సినిమా నాకెంతో ప్రత్యేకమైనది. మాధవి అనే పాత్రలో నటించాను. ఈ పాత్రను చూస్తే మీ ఇంటి అమ్మాయిలా అనిపిస్తుంది. ఒక టీమ్ స్పిరిట్‌తో చేసిన చిత్రమిది. లాక్ డౌన్లో మాకెన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినా మంచి సినిమా చేయాలనే పట్టుదలతో పనిచేశాం’ అని చెప్పింది నాయిక రుక్సర్ థిల్లాన్. ఈ కార్యక్రమంలో దర్శకుడు విద్యాసాగర్ చింతా, నిర్మాత బాపినీడు, సుధీర్ ఈదర తదితరులు పాల్గొన్నారు.