విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’. రుక్సర్ థిల్లాన్ నాయికగా నటిస్తున్నది. బీవీఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో ఎస్వీసీసీ డిజిటల్ పతాకంపై బాపినీడు, సుధీర్ ఈదర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవి కిరణ్ కోల కథ, కథనం అందించగా..విద్యాసాగర్ చింతా దర్శకత్వం వహించారు. మే 6న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా రవికిరణ్ కోలా మాట్లాడుతూ…‘ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే నేనే అందించాను. దర్శకత్వం కూడా చేయాల్సింది అయితే నాకు మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్లో ఓ సినిమా కమిట్ అయి ఉంది. అందుకే విద్యాసాగర్‌ను పెట్టాము. నేను షోరన్నర్‌గా వ్యవహరించాను. సాధారణంగా వెబ్ సిరీస్‌లకు షో రన్నర్స్ ఉంటారు. సినిమాలకు నేనే తొలి షో రన్నర్ అనుకుంటా. ఈ సినిమా హీరోకు మొదట కొన్ని ఆప్షన్స్ అనుకున్నా.. విశ్వక్సేన్ అయితే బాగుంటుందని నిర్ణయించాం. ప్రేమ, పెళ్లి, జీవితం అనే అంశాలను కొత్త కోణంలో చూపించిన చిత్రమిది. వినోదాత్మకంగా సినిమా సాగుతుంటుంది. మన జీవితాల్లో ఉండే చాలా సీరియస్ అంశాలను నవ్విస్తూ చెప్పాం. 33 ఏళ్లయినా పెళ్లి కాని అల్లం అర్జున్ కుమార్‌కు తన కులం, భాష, ప్రాంతం కాని అమ్మాయితో సంబంధం కుదురుతుంది. అక్కడి నుంచి అతని పెళ్లయ్యే వరకు ఎలాంటి సందర్భాలు ఎదురయ్యాయి అనేది సినిమాలో ఆసక్తికరంగా ఉంటుంది. దర్శకుడిగా నా తర్వాతి సినిమా రాజకీయ నేపథ్యంతో ఉంటుంది’ అన్నారు.