హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ) : విశాఖ స్టీల్‌ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ జరగదని కేంద్ర ఉకు-గనులశాఖ మంత్రి కుమారస్వామి స్పష్టం చేశారు. ప్లాంట్ పునరుద్ధరణే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని వెల్లడించారు. కేంద్రమంత్రులు కుమారస్వామి, శ్రీనివాస వర్మతోపాటు ఇద్దరు ఎంపీలు గురువారం స్టీల్‌ప్లాంట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి కుమారస్వామి మీడియాతో మాట్లాడారు.
2030లోపు విశాఖ ప్లాంట్ 300 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి సాధించాలని ప్రధాని నరేంద్రమోదీ లక్ష్యంగా నిర్దేశించారని వెల్లడించారు. రూ.35వేల కోట్లు అప్పులుగా ఉన్న ప్లాంట్‌ను పరిరక్షించేందుకు రెండు విడుతలుగా ఆర్థిక సహాయం అందజేశామన్నారు. మొదటి, రెండు విడుతలుగా విడుదల చేసిన నిధులతో బ్లాస్ట్ ఫర్నేస్(లోహాన్ని కరిగించే కొలిమి) పనులు మొదలు పెట్టామని తెలిపారు. ఉద్యోగులు, కార్మికులు సమర్థవంతంగా పనిచేయడంతో కేంద్రం మరో రూ. 11,440 కోట్లు ప్యాకేజీ ఇచ్చిందని పేర్కొన్నారు.