పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే దాకా.. నిత్యం ఏదో ఓ టెన్షన్. ఆఫీస్ పని, ట్రాఫిక్, ఒంటరితనం.. వీటన్నిటి నుంచి కొంచెం ప్రశాంతత కోరుకుంటాం. అందుకోసం ఏదైనా పెంపుడు జంతువుని తెచ్చుకుందామంటే కుదిరే పని కాదు. అపార్ట్మెంట్ రూల్స్ ఓ పక్క, వాటిని చూసుకునే టైమ్ లేకపోవడం మరోపక్క. మరి దీనికి పరిష్కారం లేదా? అంటే.. వచ్చేసింది! 1990ల్లో జపాన్ టీన్స్‌ని ఆకర్షించిన ‘తమగోట్చి’ ఆట గుర్తుంది కదా? ఇప్పుడూ అదే కాన్సెప్ట్‌ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో కలిపి ‘వర్చువల్ పెట్స్’ పేరుతో మన ఫోన్లలోకి పట్టుకొచ్చారు. దేశంలో ఇప్పుడు ఈ డిజిటల్ నేస్తాలు విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.
ఈ వర్చువల్ పెట్స్ కేవలం ఒంటరితనాన్ని పోగొట్టడానికే కాదు, కుటుంబ సభ్యులు, దంపతుల మధ్య అనుబంధాలను బలపరచడానికీ ఉపయోగపడుతున్నాయి. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి ఒక డిజిటల్ పెంగ్విన్నో, కుక్కపిల్లనో ‘కో-పేరెంట్’ చేస్తున్నారు. దీనికోసం నెలకు కొంత మొత్తాన్ని సబ్స్క్రిప్షన్ ఫీజుగా చెల్లిస్తున్నారు. సదరు పెట్.. పిల్లల్లో ఇతరుల పట్ల సానుభూతిని పెంచుతోందని, బాధ్యతను నేర్పిస్తోందని తల్లిదండ్రులు చెబుతున్నారు. అంటే, ఇక్కడ టెక్నాలజీ కేవలం ఆట మాత్రమే కాదు, ఒకరితో ఒకరు క్వాలిటీ టైమ్ గడపడానికి ఒక సాధనంగా మారుతోంది.
వర్చువల్ పెట్స్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందంటే.. ప్రస్తుతం మన దేశంలో ఈ రంగం విలువ వందల కోట్లకు చేరుకుంది. ఏటా 35 నుంచి 45 శాతం వృద్ధిని నమోదు చేస్తున్నది. రాబోయే రెండు మూడేళ్లలో కొన్ని వేల కోట్లకు చేరుకుంటుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న కొత్త స్టార్టప్స్ అన్నీ ఇప్పుడు ‘వర్చువల్ హ్యూమన్స్’, ‘వర్చువల్ పెట్స్’ అనే కాన్సెప్ట్‌తో వినూత్నమైన ఏఐ అప్లికేషన్లను డెవలప్ చేస్తున్నాయి. భారతీయులను ఆకర్షిస్తున్నాయి. దీనికి కారణం లేకపోలేదు.. నగరాల్లో పెరుగుతున్న ఒంటరితనం ఈ ఏఐ నేస్తాల వృద్ధికి ప్రధాన కారణం. ప్రజలు ఇప్పుడు రియల్ పార్ట్నర్ల కంటే.. తక్షణ ఉపశమనం ఇచ్చే ఏఐ తోడునే ఎక్కువగా కోరుకుంటున్నారట. అయితే, పుట్టుకొచ్చే ప్రతి టెక్నాలజీ వెనక ఓ ప్రమాదం కూడా దాగుంటుంది. ఒంటరితనం వల్ల వచ్చే డిప్రెషన్‌ను తగ్గించడానికి ఈ ఏఐ పెట్స్ కొంతవరకు సహాయపడతాయని మానసిక నిపుణులు చెబుతున్నా.. ఇవి ఎప్పటికీ మన మధ్య ఉండే అసలైన మనుషుల బంధాలకు ప్రత్యామ్నాయం కావవని అంటున్నారు. మనుషులతో మాట్లాడటం కంటే, ఫోన్లోని బొమ్మలతోనే కాలక్షేపం చేయడం మొదలుపెడితే అది సామాజిక దూరాన్ని పెంచే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
మీకు కూడా ఇలా ఓ పెంపుడు జంతువు కావాలనుకుంటే.. వర్చువల్ పెట్స్ మంచి ఆప్షన్. యాప్ స్టోర్లలో ప్రస్తుతం అనేక రకాల ఏఐ పెట్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో కొన్ని ఉచితంగా లభిస్తే, మరికొన్ని ప్రీమియం ఫీచర్ల కోసం చిన్నపాటి రుసుమును వసూలు చేస్తాయి. వీటిని మీ ఫోన్ హోమ్ స్క్రీన్‌పై ‘విడ్జెట్’ లాగా సెట్ చేసుకుని, మీ పనుల మధ్యలో వాటికి తిండి పెట్టడం, ఆడించడం వంటివి చేస్తూ రిలాక్స్ అవ్వొచ్చు. చూశారా.. టెక్నాలజీ ఒక వైపు మనల్ని ఒంటరి వాళ్లను చేస్తుందో.. అదే టెక్నాలజీ మళ్లీ మనకు తోడుగా నిలుస్తోంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. పెట్స్ అనేవి మీ ఫోన్ స్క్రీన్ పై ఉంటాయేగానీ.. గుండెల్లో అసలైన నేస్తాలుగా స్థానాన్ని సంపాదించలేవు. సో.. బిజీ లైఫ్‌లో ఆ కాసేపు ఏదో సరదాకి ట్రై చేయొచ్చు.