Viral News | న్యూఢిల్లీ : 60-70 రూపాయలు పెడితే డజను అరటిపండ్లు వస్తున్న వేళ.. న్యూయార్క్లో బుధవారం జరిగిన వేలంలో ఒక అరటిపండుకు నమ్మలేనంత ధర పలికింది. గోడకు టేపుతో అతికించి ఉన్న ఆ అరటిపండును ఓ వ్యక్తి 6.24 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 52.7 కోట్లు)కు కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇటలీ విజువల్ ఆర్టిస్ట్ మౌరిజియో కాటెలన్ 2019లో దీనిని సృష్టించాడు.
గోడపై ఒక అరటిపండుకు టేప్ వేసి అతికించడం మినహా దీంట్లో ప్రత్యేకతేమీ లేదు. ఈ అరటిపండుకు ‘కమెడియన్’ అని పేరు పెట్టాడు. అప్పటి నుంచి ఈ కదళీఫలం వార్తల్లోకి ఎక్కగా తాజాగా దీనిని వేలం వేయగా రూ. 52.7 కోట్లకు అమ్ముడుపోయి మరోమారు హెడ్లైన్స్కు ఎక్కింది. చైనా పారిశ్రామికవేత్త జస్టిన్ సన్ వేలంలో దీనిని సొంతం చేసుకున్నాడు.