హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రైమ్ వాలీబాల్ లీగ్(పీవీఎల్)లో హైదరాబాద్ బ్లాక్‌హాక్స్ జట్టుకు విపుల్‌కుమార్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈనెల 5 నుంచి గచ్చిబౌలి స్టేడియం వేదికగా పీవీఎల్ తొలి సీజన్ మొదలవుతున్నది. హైదరాబాద్ తమ మొదటి మ్యాచ్‌ను కొచ్చి బ్లూస్పైకర్స్ జట్టుతో ఆడనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఫ్రాంచైజీ యాజమాన్యం వర్చువల్ విధానంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలు అంశాలు వెల్లడించింది. జట్టు కెప్టెన్ విపుల్ కుమార్ మాట్లాడుతూ ‘నాపై నమ్మకముంచి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించిన యజమాన్యానికి కృతజ్ఞతలు. టీమ్ మేనేజ్మెంట్ అంచనాలు అందుకోవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తాను. ఈ పోటీలో తామంతా సమిష్టిగా ఆడి సత్తాచాటాల్సి ఉంది. సీనియర్ ప్లేయర్‌గా యువకులను ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తాను’ అని అన్నాడు. ఈ భేటీలో జట్టు యజమాని అభిషేక్‌రెడ్డి, చీఫ్ కోచ్ రూబెన్ వోలోచిన్, సహాయక కోచ్ టామ్ జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు.