హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): నిబంధనలకు విరుద్ధంగా రియల్ ఎస్టేట్ దందా చేసేవారిపై కఠిన చర్యలు తీసుకొంటామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ హెచ్చరించారు. రెరా నియంత్రణ చర్యలు, అక్రమ లే అవుట్లు, బిల్డర్లపై తీసుకోవాల్సిన చర్యలపై కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్), తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (ట్రెడాయ్), తెలంగాణ బిల్డర్స్ అసోసియేషన్ తదితర సంస్థల ప్రతినిధులతో బీఆర్కే భవన్లో శుక్రవారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే కంపెనీలు, డెవలపర్లపై తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ రెరా ఆమోదించిన ప్రాజెక్టులను మాత్రమే కొనుగోలు చేసేలా, ప్రజలు నష్టపోకుండా ఉండేలా సోషల్ మీడియా ట్రాకింగ్ కోసం మున్సిపల్, రిజిస్ట్రేషన్, సమాచార పౌర సంబంధాల శాఖల సమన్వయంతో బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. అవినీతికి పాల్పడే బిల్డర్లపై కఠిన చర్యలు తీసుకొనేందుకు, పకడ్బందీగా రెరా అమలులో సూచనలు ఇచ్చేందుకు పట్టణ ప్రణాళిక, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు, క్రెడాయ్ ప్రతినిధులతో కూడిన నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించామని వెల్లడించారు. సమావేశంలో మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, పోలీస్ విభాగం అదనపు డీజీ జితేందర్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల సీఐజీ శేషాద్రి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ పాల్గొన్నారు.