గొండా (యూపీ): భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) మధ్య వివాదం మరోసారి పతాక స్థాయికి చేరింది. గొండాలో జరుగుతున్న నేషనల్ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నీలో పోటీ పడేందుకు వినేశ్ ప్రయత్నించగా, ఆమెపై ఉన్న అనర్హత వేటును సాకుగా చూపుతూ ఫెడరేషన్ నిరాకరించింది. దీనిపై వినేశ్ తీవ్రంగా స్పందిస్తూ.. తనను మానసిక వేదనకు గురిచేసి, కుట్రపూరితంగా ఆటకు దూరం చేయాలని చూస్తున్నారని ఆరోపించింది. ‘నేను సన్యాసం తీసుకుని ఆటకు దూరంగా ఉండాలా? లేక ఓటమిని ఒప్పుకోవాలా?’ అంటూ సోమవారం ఫెడరేషన్ అధ్యక్షుడు సంజయ్ సింగ్‌ను కలిసి తన ఆవేదన వ్యక్తం చేసింది.
జనవరి 1 నుంచే తాను పోటీలకు అర్హురాలినని అంతర్జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (ఐటీఏ) ధృవీకరించినప్పటికీ, జూన్ 26 వరకు తనను అనర్హురాలిగా ప్రకటించడం వెనుక కుట్ర దాగుందని వినేశ్ ఆరోపించింది. అందుకే కోర్టులు సెలవులో ఉన్న సమయంలో, టోర్నీకి కేవలం రెండు రోజుల ముందు షోకాజ్ నోటీసులు పంపారని ఆరోపించింది. ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్ వంటి ప్రతిష్టాత్మక ఈవెంట్లలో దేశం కోసం పతకాలు సాధించిన తనను ‘తుక్డే తుక్డే గ్యాంగ్’ అని సంబోధిస్తున్నారని, రాజ్యాంగం తనకు ఇచ్చిన హక్కులను కాలరాస్తూ మున్ముందు తనను ఉగ్రవాదిగా చిత్రించినా ఆశ్చర్యం లేదని ఆమె వాపోయింది.
తాను మానసికంగా కుంగిపోయి రెజ్లింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించేలా కుట్రలు చేస్తున్నారని ఆరోపించింది. మరోవైపు, క్రమశిక్షణా చర్యలు పూర్తయ్యే వరకు వినేశ్‌ను పోటీలకు అనుమతించబోమని డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు సంజయ్ సింగ్ స్పష్టం చేశాడు. మీడియా సమావేశం అనంతరం ఆమె కనీసం ప్రాక్టీస్ చేసుకునేందుకు కూడా అధికారులు అనుమతించకపోవడంతో గొండా వేదికగా హైడ్రామా చోటుచేసుకుంది. వామప్ ఏరియాకు తాళం వేసి ఉండటం, సాయ్ సెంటర్లోనూ సౌకర్యాలు లేకపోవడంతో వినేశ్ నిరాశతో వెనుదిరిగింది. ఎన్ని అడ్డంకులు సృష్టించినా, నిజాయితీగా కష్టపడుతున్నానని, తన హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తానని వినేశ్ స్పష్టం చేసింది.